పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది

24 Dec, 2021 04:16 IST|Sakshi
భర్త, పిల్లలతో సుష్మ

పురుషులతోపాటు మహిళలు దాదాపు అన్నిరంగాల్లో సమానంగా రాణిస్తున్నారు. ఇప్పటిదాకా నిత్య పూజల నుంచి కైంకర్యాల దాకా అంతా మగ పూజారులు, పండితులు మాత్రమే చూసుకోవడం చూస్తున్నాం. కానీ అమెరికాలో పండితుల పీటమీద సుష్మా ద్వివేది కూర్చుని పెళ్లిళ్లు జరిపిస్తూ కొత్త ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తోంది. కుల, మత భేదం లేకుండా పెళ్లిళ్లు చేయడమే గాక, పూజలు, వ్రతాలు కూడా నిర్వహిస్తోంది.

భారత సంతతికి చెందిన సుష్మ కెనడాలో పెరిగిన అమ్మాయి. 2013లో వివేక్‌ జిందాల్‌తో పెళ్లి జరిగింది. వీరి పెళ్లితోపాటు వివేక్‌ జిందాల్‌ తోబుట్టువు ఒకరి పెళ్లికూడా అదే సమయంలో ఏర్పాటు చేశారు. కానీ అది ఒక ట్రాన్స్‌జెండర్‌ పెళ్లి. దీంతో సుష్మా వాళ్ల పెళ్లి శాస్త్రోక్తంగా జరిగినప్పటికీ తోబుట్టువు పెళ్లి అలా జరగలేదు. అప్పుడు అంతా బాధపడ్డారు. ఆ పెళ్లి కూడా సంప్రదాయబద్ధంగా జరిగితే బావుండును అని సుష్మకు అనిపించింది. కానీ అలా జరగలేదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటోన్న వారికి పరిష్కారం చూపాలని అప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించింది సుష్మ.

తొలి బిడ్డ ప్రసవ సమయంలో...
నెలలు నిండిన సుష్మ ఆసుపత్రిలో చేరింది. అక్కడ కాన్పు సవ్యంగా జరగడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో ఓ జంటకు పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఎనస్థీషియా డాక్టర్‌ ద్వారా తెలిసింది. ఆ జంట పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడమే అందుకు కారణమని ఆమె చెప్పడంతో సుష్మ మరోసారి ఆలోచనలో పడింది. అరగంట ఆలోచించి ఆ జంటకు తానే పెళ్లిచే యిస్తానని చెప్పింది. ప్రసవం అయ్యి బెడ్‌మీద నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న సుష్మ గదిలోకి ఆ జంట రాగా అక్కడ ఉన్న నర్సులు పాట పాడగా ఆ జంటకు పెళ్లి తంతుని ముగించింది సుష్మ. ఈ కార్యక్రమం మొత్తాన్ని వివేక్‌ ఐఫోన్‌లో వీడియో తీశారు. ఆ తరువాత ఆ వీడియో బాగా వైరల్‌ అవ్వడంతో ఒక్కసారిగా సుష్మ పాపులర్‌ అయ్యింది. అప్పటి నుంచి హిందూ సంప్రదాయంలో ఉన్న పెళ్లిమంత్రాలను నేర్చుకుని పెళ్లిళ్లు చేయడం ప్రారంభించింది.

బామ్మ దగ్గర నేర్చుకుని..
ప్రారంభంలో అంతా సుష్మను వ్యతిరేకించినప్పటికీ వాటన్నింటి దాటుకుని ముందుకు సాగుతూ అమెరికాలోనే తొలి మహిళా పురోహితురాలిగా నిలిచింది. ఇదే రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్న తరువాత హిందూ సంప్రదాయాల గురించి లోతుగా తెలిసిన బామ్మతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుంది. అంతేగాక బామ్మతో కలిసి... పూజలు, పెళ్లికి ఏయేమంత్రాలు చదువుతారు? వాటిని ఎలా ఉచ్చరించాలి? సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన క్రతువుల గురించి వివిధ గ్రంథాలను చదివి పెళ్లిమంత్రాలను ఆపోశన పట్టింది. అంతేగాక 88 ఏళ్ల బామ్మ ఇచ్చిన ఉంగరాన్ని తన వేలికి తొడుక్కుని అనేక పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా ఇప్పటిదాకా దాదాపు యాభై పెళ్లిళ్లు చేసింది.

అరగంట పెళ్లి..
ఎంతో చక్కగా పెళ్లిళ్లు చేస్తోన్నసుష్మా.. మరింతమందికి తన సేవలు అందించేందుకు 2016లో ‘పర్పుల్‌ పండిట్‌ ప్రాజెక్ట్‌’ పేరిట న్యూయార్క్‌లో సంస్థను ప్రారంభించింది. దీనిద్వారా పెళ్లితోపాటు అనేక మతపరమైన సేవలను అందిస్తోంది. దక్షిణాసియాలోని ‘గే’ కమ్యూనిటీ వాళ్లకు అరగంటలో పెళ్లి చేస్తుంది. సంప్రదాయ హిందూ పెళ్లిళ్లను మూడుగంటల్లో పూర్తి చేస్తోంది. అంతేగాక తన భర్త నిర్వహిస్తోన్న ఆర్గానిక్‌ ఫుడ్‌ కంపెనీ ‘డెయిలీ హార్వెస్ట్‌’కు ఉపాధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి ఒకపక్క సంసారాన్ని, మరోపక్క కంపెనీ బాధ్యతలనూ నిర్వర్తిస్తూనే పౌరోహిత్యం కూడా అంతే సజావుగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని కామెంట్లు వస్తున్నాయి.  సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుష్మ మరిన్ని పెళ్లిళ్లతో ముందుకు సాగాలని కోరుకుందాం.            

బాలింతగా ఆస్పత్రి బెడ్‌పైన ఉండి మరీ పెళ్లి జరిపిస్తున్న సుష్మ

మరిన్ని వార్తలు