Susmita Basak: వారి కోసం ప్రత్యేకంగా లోదుస్తులు, అవయవాలు..

22 Sep, 2021 17:31 IST|Sakshi

క్యాన్సర్‌ పేరు చెప్పగానే ఒక్కసారిగా ఉలిక్కిపడతాం. కాని తప్పించలేం.  ఆడవారిలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఎక్కువగా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ భాగాన్ని తొలగించేస్తారు. అలా చేయటం వలన ఆడవారు ఆత్మన్యూనతకు లోనవుతారు. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఒక పక్కన అనారోగ్యంతో బాధపడటం, మరోపక్క మానసిక దిగులు. అటువంటివారి కోసం ప్రత్యేకంగా లోదుస్తులు, అవయవాలు తయారుచేస్తున్నారు సుస్మిత అనే టెక్నాలజీ విద్యార్థి.  సుస్మిత తన కుటుంబ సభ్యులతో కలిసి సుగర్‌షెల్‌ అనే స్టార్టప్‌ ప్రారంభించి, ఇన్నర్లు, అవయవాలు తయారుచేస్తున్నారు.​

సుగర్‌షెల్‌..
సుస్మిత బసక్, దేబ్రప్‌ మజుందార్, మౌమిత బసక్, శివశంకర్‌ బసక్‌... అందరూ ఒకే కుటుంబీకులు. ఈ కుటుంబ సభ్యుల ఆలోచన నుంచి పుట్టినదే సుగర్‌షెల్‌ స్టార్టప్‌. ్ర»ñ స్ట్‌ క్యాన్సర్‌ రోగులకు, ఆ అనారోగ్యం నుంచి బయటపడిన వారికి... వారి శరీరానికి అనుకూలంగా ఇన్నర్‌వేర్‌లను, అవయవాలను ఈ కంపెనీ తయారుచేస్తుంది.  సుస్మిత బసక్‌కు ఇంజినీరింగ్‌ చదువుకునే రోజుల్లోనే ఏదైనా ప్రత్యేకంగా డిజైన్‌ చేయాలనే ఆకాంక్ష ఉండేది. బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి కాగానే కార్పొరేట్‌ సెక్టార్‌లో ఉద్యోగానికి చేరారు. తన మనసుకు తగ్గ పని కావటంతో ఉత్సాహంగా పనిచేశారు.

నైపుణ్యం ప్రదర్శించి ఏదో ఒకటి డిజైన్‌ చేయాలనే కోరిక కారణంగా సుస్మిత నిఫ్ట్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ) లో చేరారు. తను చదువుకున్న ఇంజినీరింగ్‌ టెక్నాలజీ ఉపయోగించి, ఏదో ఒకటి కొత్తది డిజైన్‌ చేయాలనే కోరిక రోజురోజుకీ బలపడుతూ వచ్చింది. ‘‘నేను నిఫ్ట్‌లో చదువుతున్నప్పుడు, ఆఖరి సెమిస్టర్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చి తగ్గిన రోగులకు కావలసిన లోదుస్తులను తయారుచేయాలనుకున్నాను. ఆ వ్యాధితో పోరాడి జీవించిన వారితో మాట్లాడిన తరవాత, వారికి కృత్రిమ అవయవం, ఇన్నర్‌ల అవసరం చాలా ఉందనీ, వీటిని తయారుచేయటానికి మంచి నైపుణ్యం కూడా అవసరమనీ తెలుసుకున్నాను’’ అంటారు సుస్మిత. 

కుటుంబ సభ్యులతో..
భర్త దేబ్‌రప్‌ మజుందార్, సోదరి మౌమిత, తండ్రి శివ్‌శంకర్‌లతో కలిసి, ‘సుగర్‌షెల్‌’ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ స్టార్టప్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రోగులకు, వ్యాధి నుంచి బయటపడినవారికి ప్రత్యేకించి ఇన్నర్‌వేర్‌లు ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలోనే ఇటువంటివి తయారుచేయబోతున్న మొట్టమొదటి సంస్థ ఇది. ఎఫ్‌ఎంసిజి ఫార్మాలో పది సంవత్సరాలుగా డాటా సైంటిస్ట్‌గా పనిచేసిన మౌమిత తన సోదరికి సహకరించటానికి ముందుకు వచ్చారు.

ఆ కంపెనీలో మౌమిత ...మార్కెటింగ్, బ్రాండింగ్, డాటా అనలిటిక్స్, కంటెంట్‌ జనరేషన్, వైట్‌ పేపర్‌ రైటింగ్‌లలో నైపుణ్యం సాధించారు. ‘‘నా అనుభవం మా అక్క కోసం వినియోగించి, తనకు సహకరించాలనుకుంటున్నాను’’ అంటారు మౌమిత. సుస్మిత భర్త దేబ్రప్‌ మజుందార్‌కు ఐటీ ఎక్స్‌పర్ట్‌గా పన్నెండు సంవత్సరాల అనుభవం ఉంది. తండ్రి శివ్‌ శంకర్‌ బసక్‌... ఇండస్ట్రియల్‌ ఇంజినీర్‌గా నలభై సంవత్సరాల ప్రాజెక్ట్‌ అనుభవం ఉంది. వీరంతా సుస్మిత ఆశయసాధనకు సహకరించటానికి ముందుకు వచ్చారు.

ఇబ్బందులను అధిగమించేలా...
‘‘క్యాన్సర్‌ బారిన పడి బతికి బయటపడ్డ 20 మందితో మాట్లాడిన తరవాత, ఈ కంపెనీ చిన్నస్థాయిలో కాకుండా, భారీ స్థాయిలో ప్రారంభించాలి అనుకున్నాను. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడినవారు రకరకాల వైద్య విధానాల వల్ల అనేక ఇబ్బందులు పడతారు. వారి అవసరాలకు అనుగుణంగా ఇన్నర్‌లు, సర్జరీ చేసి తొలగించిన ప్రదేశంలో అమర్చటానికి అనువుగా బ్రెస్ట్‌ తయారుచేయాలనుకున్నాను’’ అంటున్న సుస్మిత, నాణ్యమైన ఇన్నర్‌లు, బ్రెస్ట్‌లను అందరికీ అందుబాటులో ఉండేలా తయారుచేయటానికి నిశ్చయించుకున్నారు.

మార్కెట్‌లో సింథటిక్‌తో రూపొందినవి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి  రకరకాల ఇన్నర్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి. ‘‘బ్రెస్ట్‌ను తొలగించటం వల్ల బాధితులు మానసికంగా, శారీరకంగా బాధపడుతుంటారు. కొందరు మహిళలు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. అటువంటి వారికి మా ఉత్పత్తుల ద్వారా ఆత్మవిశ్వాసం కలిగించడమే మా ధ్యేయం’’ అంటున్నారు సుస్మిత. ఇందులో ఉపయోగించేవన్నీ ప్రకృతిలో సహజంగా లభిస్తున్నవే. అంతేకాదు... మామూలు కాటన్‌తో కూడా తయారుచేస్తున్నారు. ఈ అక్టోబర్‌ (బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ మాసం) మాసంలో పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు