మనిషి కాదు కీర్తి కలకాలం బ్రతకాలి!

26 Mar, 2021 06:58 IST|Sakshi

*వస్తువు ద్వారా, వ్యక్తి ద్వారా జీవితంలో సుఖం ప్రాప్తిస్తుందంటే, దాని కాలపరిమితి కూడా ఆ వస్తువంత, వ్యక్తి అంత పరిమితమైనదే! మనిషి ఎంత కాలం జీవిస్తాడు ? ఈ రోజుల్లో మనిషి సగటు ఆయువు 65సంవత్సరాలు అంటారు విజ్ఞానవేత్తలు. మన సనాతన ధర్మం మనిషి ఆయుర్దాయం నూరు సంవత్సరాలు అంటుంది. అందుకే పెద్దలు  'శతాయుష్మాన్ భవ' అని దీవిస్తారు. కాకిలా  కలకాలం జీవించే కంటే హంసలా కొంత కాలం జీవించడం మేలు అన్నది ఒక సామెత. ఆ రెండు పక్షుల జీవన విధానంలో ఆ బేధం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 

*మనిషి మరణించిన తరువాత కూడా జీవించి ఉంటాడా? ఒక మారు భౌతిక దేహం బూడిద అయిన తరువాత ఎలా జీవించి ఉంటాడు? నిజమే, కొందరు మరణించిన తరువాత కూడా జీవించివుంటారు, అదెలా! "అభిమాన ధనస్య గత్వరైః అనుభిః స్థాస్తు యశశ్వి చీషతః । అచిరం సువిలాసఞ్చలానను లక్ష్మీః ఫల మానుషఙ్గీ కమ్ ॥ 'ఎప్పుడో ఒకప్పుడు పోయే ప్రాణం చేత  చిరస్థాయియైన కీర్తిని సంపాదించదలచిన అభిమానధనుడినికి అచిరకాలంలోనేఆ కీర్తి లభిస్తుంది. దానితో పాటు చంచలమైన లక్ష్మియు అనుషంగీకంగా ప్రాప్తిస్తుంది.' మనిషి చనిపోయినా అతని కీర్తి నిలిచి ఉంటే ఆ వ్యక్తి జీవించి ఉన్నట్లే అని భావము. కీర్తి తనంతటతనే లభించదు. అందుకు మనిషి సద్గుణశీలి కావాలి. పరోపకారం, ఈవి, దయ, సహనం, క్రోధరాహిత్యం వంటి గుణాలు ఉండాలి. ఇందుకు మనముందు ఉన్న సజీవ ఉదాహరణ స్వామి వివేకానంద.

*భౌతికంగా స్వామిజీ ఈ భూమిపై కేవలం 39 సంవత్సరాల 6 నెలల 22 రోజులే జీవించి ఉన్నారు. "తాను నిజంగా ఎవరో, తనస్వరూపమేమిటో తెలుసుకున్న తరువాత  నరేంద్రుడు ఈ భూమిపై ఉండలేడు. తన స్వస్వరూపంలో లీనమైపోతాడు!" అన్నారు రామకృష్ణులు. కాని మహాసమాధిలో పర బ్రహ్మైక్యం చెందిన వివేకానంద అంతటితో మరణించారా? లేదు!! *గీతలో శ్రీకృష్ణభగవానుడంటాడు " ఈ ఆత్మను శస్త్రాలు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్చివేయజాలదు. ఈ ఆత్మ  నిత్యమూ, సర్వవ్యాపి చలింపనిది,స్థాణువు, స్థిరమైనది, సనాతనం, శాశ్వత మైనది."

*వివేకానందుడి శరీరాన్ని ఆ 1902 జూలై 4న అగ్నిజ్వాలలు దహించివేసి ఉండవచ్చుగాక! కాని వివేకానందుడి ఆత్మను శస్త్రాలు ఛేధింపలేవు, అగ్ని దయహింపజాలదు, వాయువు ఆర్చివేయజాలదు, వివేకానందుడి ఆత్మ  నిత్యమైనది, సర్వవ్యాపి, అచలము, స్థిరమైన, సనాతనము, శాశ్వతమూ అయినది. స్వామిజీ భారతదేశపు ఆత్మ, అంతరాత్మ  అయింది." అని వివేకానందుడి ప్రముఖ శిష్యురాలు సోదరి నివేదిత అన్నారు. 

*భారతదేశం ఈనాడు ప్రపంచ వేదికలపై ఆధ్యాత్మితకూ, సర్వశ్రేష్ఠ సభ్యత, సంస్కృతి, సంప్రదాయాలకు, శాంతి, సహనము, మంచితనము, ఆత్మవిద్యకు కేంద్ర బిందువై, గురు స్థానంలో గౌరవం పొందుతోంది అంటే ఇదంతా స్వామిజీ ఆత్మ ప్రభావమే.

*ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత, నోబుల్ బహుమతి గ్రహీత రోమారోలా తాను రచించిన పుస్తకం 'స్వామి వివేకానందుడి జీవితం' లో ఇలాగన్నారు."స్వామిజీ నలభై సంవత్సరాల వయస్సులోనే తన వజ్రమయ జీవితాన్ని చాలించి, చితిపై ఉంచబడ్డారు.... కాని అతని చితి నుండి వచ్చిన జ్వాలలు ఆరిపోలేదు. ఇంకా ఇంకా ఉజ్వలంగా వెలుగు తూనేవున్నాయి! ప్రాచీన పౌరాణిక ఫెనిక్స్ అనే పక్షి కొన్ని వందల సంవత్సరాలు జీవించి, తనను తానే దహించివేసుకుని తన చితి భస్మం నుండి మళ్ళీ పునర్జీవత అవుతుంది. అలాగే వివేకానందుడి చితిభస్మం నుండి భారతదేశపు ఆత్మ, అంతరాత్మ చైతన్యం పునర్జీవతమై, మేల్కొన్నాయి.

*వివేకానందుడి వాణి మూగవోకూడదు, మనం అతని ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకోవడమే మహోన్నతమైన కార్యం.
- గుమ్మా ప్రసాద రావు భిలాయి

మరిన్ని వార్తలు