ప్రెసిడెంట్‌ ఆనందవల్లి

1 Jan, 2021 10:39 IST|Sakshi

స్వీపర్‌గా పంచాయతీ కార్యాలయ గదుల్ని శుభ్రం చేసిన ఆనందవల్లి చేతులు ఇకపై పంచాయతీ ప్రెసిడెంటుగా శుభ్రమైన పాలనను అందివ్వబోతున్నాయి. పదేళ్లుగా ప్రతిరోజూ పఠాన్‌పురం పంచాయతీలోని ‘ఆ’ బ్లాకును శుభ్రం చేస్తున్నారు అనందవల్లి. స్వీపర్‌ ఆమె తాత్కాలిక ఉద్యోగి. ఆమె శుభ్రం చేసే బ్లాకులోనే పంచాయతీ ప్రెసిడెంట్‌ కుర్చీ ఉంటుంది. మంగళవారం ఆమె తన స్వీపర్‌ ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆమె గురువారం నుంచీ ఆ ప్రెసిడెంట్‌ కుర్చీలో కూర్చోబోతున్నారు! అవును. స్వీపర్‌ ఆనందవల్లి పంచాయతీ ప్రెసిడెంట్‌ అయ్యారు. అసలిదంతా ఆమె ఊహించని, ఊహించలేని విధంగా జరిగింది. ‘కొంచెం భయంగా ఉంది’ అంటున్న ఆనందవల్లి, ‘కష్టపడి పని చేస్తాను’ అని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఆమె ఆత్మవిశ్వాసం కేరళ, కొల్లం జిల్లాలోని ఆ పఠాన్‌పురం పంచాయతీకి కొత్త వెలుగులు తేబోతున్నదన్న నమ్మకం కలిగిస్తోంది. స్వీపర్‌ ఏంటి! పంచాయతీ ప్రెసిడెంట్‌ అవడం ఏంటి! ప్రజాస్వామ్యంలోని ప్రత్యేకతే ఇది. 

పఠాన్‌పురం పంచాయతీ.. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కేటాయించిన సీటు. మొత్తం 13 వార్డులు ఉన్నాయి. వాటిల్లో తలవూరు వార్డు నుంచి ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్‌ అభ్యర్థిగా కాక.. ఎస్సీ, ఎస్టీ జనరల్‌ ఆభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆనందవల్లి. సీపీఐ (ఎం) పార్టీ సభ్యత్వం ఉండటంతో లెఫ్ట్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ (ఎల్డీఎఫ్‌) అభ్యర్థిగా సీపీఐ(ఎం) ఆమెను తలవూరు వార్డుకు నిలబెట్టింది! పదమూడు సీట్లలో ఎల్డీఎఫ్‌కు ఏడు సీట్లు, ప్రతిపక్ష యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌కు (యూడీఎఫ్‌) ఆరు సీట్లు లభించాయి. మెజారిటీ సీట్లున్న పార్టీలోని వార్డు మెంబరుగా ఆనందవల్లి పంచాయతీ ప్రెసిడెంట్‌ అయ్యారు. ఆనందవల్లి భర్త మోహనన్‌ పెయింటర్‌. ఆయన కూడా సీపీఐ(ఎం) స్థానిక కమిటీ సభ్యుడే. ఇద్దరు పిల్లలు. మిథున్, కార్తీక్‌. స్కూల్లో చదువుతున్నారు. పంచాయతీ ఆఫీస్‌లో స్వీపర్‌గా చేరినప్పుడు మొదట ఆనందవల్లి జీతం రెండు వేలు. తర్వాత మూడు వేలు, తర్వాత ఆరు వేలు అయింది. పార్టీ సభ్యుల సహకారంతో ఈ కొత్త బాధ్యతను నిర్వర్తిస్తానని ఆమె చెబుతున్నారు. (2020లో ప్రపంచాన్ని నడిపించిన స్త్రీ మూర్తులు)

మరిన్ని వార్తలు