తెలుగు విభాగంలో.. మొదటి ముస్లిం యువతి

8 Dec, 2020 08:33 IST|Sakshi
యూనివర్సిటిలో తండ్రిని సన్మానిస్తుండగా ఆనందంలో ఆఫ్రీన్‌ 

తెలంగాణ నవలా రచయిత్రుల రచనలను ఇతివృత్తంగా తీసుకొని సమగ్ర పరిశోధన జరిపిన సయ్యద్‌ ఆఫ్రీన్‌ బేగంకు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. దాంతో తెలంగాణ విశ్వ విద్యాలయం నుంచి తెలుగు విభాగంలో పిహెచ్‌డి పట్టా పొందిన మొట్టమొదటి ముస్లిం యువతిగా ఆఫ్రీన్‌ బేగంకు అరుదైన ఘనత దక్కింది.

తండ్రి ప్రోత్సాహంతో...
కామారెడ్డి బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీ లో నివసించే అబ్దుల్‌ లతీఫ్‌ కూతురు ఆఫ్రీన్‌ బేగంకు చిన్నప్పటి నుంచే తెలుగుపై ఎంతో ఆసక్తి ఉండేది.  ఆఫ్రీన్‌ బేగంను డాక్టర్‌ చేయాలని తండ్రి లతీఫ్‌కి ఉండేది. అయితే కుమార్తెకు తెలుగుపై ఉన్న మక్కువను గుర్తించి ఆమె తెలుగులో ప్రావీణ్యం సాధించే విధంగా వేలాది రూపాయల విలువ చేసే తెలుగు సాహిత్య పుస్తకాలను కొనుగోలు చేసి బహుమతులుగా అందించారు.

ఆఫ్రీన్‌ బేగం

2013–14లో తెలంగాణ యూనివర్సిటీలో ప్రవేశానికి పీజీ సెట్‌ రాయగా, అందులోనూ మొదటి ర్యాంకు సాధించి ఎం.ఎ. తెలుగులో ప్రవేశం పొందారు. తెలుగు పై ఆమెకు ఉన్న శ్రద్ధను గ్రహించిన తెలంగాణ వర్సిటి తెలుగు విభాగం ప్రొఫెసర్లు లావణ్య, బాల శ్రీనివాస్‌మూర్తి, త్రివేణి, లక్ష్మణ చక్రవర్తి, ప్రిన్సిపాల్‌ కనకయ్యలు ఆమెను ఎంతో ప్రోత్సహించడంతో ఆఫ్రీన్‌ ప్రతిభ కనబర్చి యూనివర్సిటీలోనే టాపర్‌గా నిలిచారు. 

తెలుగుపై పరిశోధనాత్మక వ్యాసాలు 
ఆఫ్రీన్‌ బేగం రాసిన వ్యాసాల్లో తెలుగు సాహిత్యం పై పరిశోధనలే అధికంగా ఉన్నాయి. ఆమె ప్రాచీన కాలం నాటి పుస్తకాలు చదివి తెలుగు చరిత్రపై అనేక వ్యాసాలు రాసారు. ముఖ్యంగా ముస్లిం కథలు– జీవన వాస్తవికత, సామెతల్లో జీవన చిత్రణ, రచయిత్రుల కథల్లో తెలంగాణ జీవన చిత్రణ, తెలంగాణలో నవలా మణులు తదితర వ్యాసాలు ఉన్నాయి. తెలంగాణలో నవలా మణులు అనే పరిశోధనాత్మక కథనంలో గత 400 ఏళ్ళుగా తెలుగు సాహిత్యానికి జరుగుతున్నసేవ, రచయితలు, కనుమరుగైన పేర్లను ఆమె తన వ్యాసంలో రాసి అందరి ప్రశంసలను అందుకున్నారు. 

గురజాడ పురస్కారం
ఆఫ్రీన్‌ తెలుగు సాహిత్యంపై రాసిన వ్యాసాలను పరిశీలించిన మానవ సాహిత్య సాంçస్కృతిక అకాడమి, విజయవాడ వారు ‘గురజాడ అవార్డు’ను అందజేశారు. అలాగే 2014 మార్చి నెలలో విశాఖపట్టణంలో ఏపీ స్టేట్‌ కల్చరల్‌ అవేర్‌నెస్‌ సొసైటీ వారు నిర్వహించిన ఉమ్మడి రాష్ట్ర స్థాయి ఎడ్యుకేషన్‌ మెరిట్‌ అవార్డుల్లో ఆఫ్రీన్‌ బేగంకు ప్రథమ స్థానం లభించింది. ఈ సందర్భంగా అవార్డుతో సత్కరించారు. 
– ఎస్‌. మొహియొద్దీన్, సాక్షి, బాన్సువాడ

నాన్న ఇచ్చిన ప్రోత్సాహం
పిహెచ్‌డి చేయాలని నాలో బీజం నాటి, ఆ దిశగా నన్ను విజయవంతంగా ముందుకు నడపడంలో, నాలో ఆత్మధైర్యం పెంపొందించడంలో మా నాన్నతో పాటు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. పిహెచ్‌డి సాధించాలనే నా కల నెరవేరింది. తెలుగు సాహిత్యంపై మరిన్ని పరిశోధనలు చేయాలనుకుంటున్నాను.
– ఆఫ్రీన్‌ బేగం

మరిన్ని వార్తలు