'గోల్డ్'‌ తరం మోడలింగ్‌

12 Aug, 2020 11:08 IST|Sakshi
చెంగ్‌ వాంజీ, సువో షోర్‌

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అనే మాటను అక్షరాలా నిజం చేసుకుంటున్నారు ఈ తాతమ్మ, తాతయ్యలు. పాత దుస్తులను ధరించి మోడలింగ్‌ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పేరు సంపాదిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా చర్చిస్తున్న ఈ జంట యువతరం కాదు. మోడల్స్‌ కానే కాదు. సినిమా తారలు అసలే కాదు. కానీ, పాత దుస్తులతో ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తున్నారు. ఈ దంపతుల దేశం తైవాన్‌. వీరికి తైచుంగ్‌లోని సెంట్రల్‌ సిటీ సమీపంలో ఓ చిన్న లాండ్రీ ఉంది. 83 ఏళ్ల చెంగ్‌ వాంజీ, 84 ఏళ్ల సువో షోర్‌ దంపతులకు ఇన్‌స్ట్రాగామ్‌లో ఇప్పుడు 6 లక్షలకు మందికి పైగా ఫాలోవర్స్‌ అయ్యారు.. మోడలింగ్‌ చేస్తున్న ఈ జంట ఫోటోలు ఈ తరానికి తెగ నచ్చుతున్నాయి. 

అసలు విషయం ఏంటంటే..
కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న వీరి లాండ్రీకి రోజూ కస్టమర్లు వచ్చేవారు. కరోనా మహమ్మారి కారణంగా లాండ్రీ మూతపడింది. లాండ్రీ తెరిచే సమయానికి ఇక్కడ బట్టలు ఇచ్చిన కస్టమర్లు వాటిని తిరిగి తీసుకోవడం మర్చిపోయారు. కొంతమంది పట్టణమే వదిలేసి వెళ్లిపోయారు. అలా దాదాపు 400 డ్రెస్సులు వీరి లాండ్రీలోనే ఉండిపోయాయి. ఈ వృద్ధ దంపతులకు  31 ఏళ్ల మనవడు రీఫ్‌ ఉన్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా లాండ్రీ మూసేయడంతో తాత, బామ్మలు తరచూ బాధపడటం చూశాడు. రీఫ్‌ తమ బామ్మ, తాతయ్యల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు.

ఆనందంగా మోడలింగ్‌
ఇంట్లో లాండ్రీకి వచ్చిన పాత బట్టలను ధరించి మోడలింగ్‌ చేయమని అవ్వాతాతకు సలహా ఇచ్చాడు. ముందు వారు ఒప్పుకోలేదు. కానీ, మనవడి కోసం ఆ డ్రెస్సులను వేసుకున్నారు. ‘వాటిని ధరించినప్పుడు మా వయస్సు ముప్పై సంవత్సరాలకు తగ్గినట్టుగా భావించాన’ని చెంగ్‌ వాంజీ సంబరంగా చెబుతున్నాడు.  రీఫ్‌ అమ్మమ్మకు బట్టలు అంటే ఇష్టం. దీంతో ఈ అవ్వాతాతలు ఇద్దరూ రకరకాల దుస్తులు ధరించి మోడలింగ్‌ చేస్తూ తెగ ఆనందపడిపోతున్నారు.  ‘నా వార్డోబ్ర్‌లో 35 ఏళ్ల క్రితం కొన్న నా డ్రెస్సులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ధరించడం, ఆ డ్రెస్సుల్లో నన్ను నేను చూసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను మోడలింగ్‌ను ఆస్వాదిస్తున్నాను’ అని చెబుతుంది 84 ఏళ్ల సువో షోర్‌. మనవడు రీఫ్‌ ఈ జంట ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతాను నిర్వహిస్తున్నాడు. కరోనా కాలంలో ఈ వృద్ధ దంపతులు ప్రజలలో ఆశా కిరణాన్ని సృష్టిస్తున్నారని సోషల్‌ మీడియా అభిమానులు వీరికి అభినందనలు తెలుపుతున్నారు.  

ఆరు దశాబ్దాల క్రితం
ఈ జంట ఆరు దశాబ్దాల క్రితం తైవాన్‌లో వివాహం చేసుకుంది. ‘వయసు మీద పడింది, లాండ్రీని మూసేసి విశ్రాంతి తీసుకోవాలని చాలాసార్లు ఆలోచించాను, కానీ మిషనరీ మీద ఈ పని సులభంగా చేయవచ్చులే అని ఆలోచనను మానుకున్నాం. పని మొదలెడితే తక్కువ కష్టమే అనిపిస్తుంది. అందువల్ల లాండ్రీని మూసివేయకూడదనుకున్నాం. వృద్ధాప్యంలో అలసటతో కూర్చోవడానికి బదులు చేతనైన పనులు చేసుకుంటేనే మంచిది. పని చేస్తూ ఉంటే వృద్ధాప్యంలో పుట్టుకొచ్చే అనేక శారీరక మానసిక సమస్యలను నివారించవచ్చ’ని చెంగ్‌ చెబుతున్నాడు. సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు ధరించడం ద్వారా కూడా ఫ్యాషన్‌ని చూపించవచ్చని నిరూపిస్తున్నారు ఈ వృద్ధ దంపతులు. ప్రస్తుతం వీళ్లు ‘ఎన్విరాన్మెంటల్‌ ఫ్యాషన్‌‘ ను ప్రోత్సహించడంలో బిజీగా ఉన్నారు.

మరిన్ని వార్తలు