మావటీల జీవితాల్లో వెలుగు తెచ్చారు

19 Mar, 2023 05:44 IST|Sakshi

ఆ ఇద్దరికి తోడు ఏనుగు

‘నాకు అడివింటే చాలా భయం’ అంటుంది బెల్లి. ఆస్కార్‌ వచ్చిన ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ డాక్యుమెంటరీ లో మావటి బొమ్మన్‌ భార్య ఆమె. భర్తతో కలిసి రఘు అనే పిల్ల ఏనుగును ఆమె సాకుతుంది. దాంతోపాటు ‘అమ్ము’ అనే ఇంకో పిల్ల ఏనుగు బాగోగులను బెల్లి చూస్తుంది. బొమ్మన్‌ ప్రభుత్వ ఉద్యోగి. బెల్లి కాదు. అయినా సరే భర్త డ్యూటీలో ఆమె భాగం పంచుకుంది. భర్తతో పాటే పసి ఏనుగులను చూసుకుంది.

‘నా భర్తను పులి చంపింది. అప్పటి నుంచి అడివంటే భయం. బొమ్మన్‌ను చేసుకున్నాక కొంచెం భయం పోయింది.  పిల్ల ఏనుగుల బాగోగుల్లో పడ్డాక, వాటి వెంట తిరుగుతుంటే అడివంటే భయం పోయింది’ అంటుంది బెల్లి.

నీలగిరి (ఊటీ) అడవుల్లో ఉండే ఎలిఫెంట్‌ క్యాంపుల్లో ఏనుగుల సంరక్షణ మావటీలు చూస్తారు. వీళ్లంతా దాదాపు ఆ ప్రాంత గిరిజనులే. ఏనుగులను చూసుకోవడం మగవారి పనే. అయితే బొమ్మన్‌ చూసేది పిల్ల ఏనుగులను కనుక వాటి అమాయకత్వానికి ముగ్ధురాలై అమ్ము కూడా వాటితో అనుబంధం పెంచుకుంటుంది.

ఆమెకు రఘు, అమ్ము ఎంత మాలిమి అంటే డాక్యుమెంటరీలో అమ్మును పిలిచి ‘ఏయ్‌... నా ఒడిలో కాదు. పక్కన పడుకో. లేకుంటే దెబ్బలు పడతాయి’ అనంటే ఆ ఏనుగు ఆమె పక్కన మెల్లగా ఒత్తిగిలి పడుకోవడం ముచ్చట గొలుపుతుంది. అమ్ముకు బెల్లి రెండు జడలు వేసి నవ్వుకుంటూ ఉన్నప్పుడు ఈ డాక్యుమెంటరీ ముగుస్తుంది.

అయితే బొమ్మన్‌ వల్ల, అమ్ము వల్ల, ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన కార్తికి వల్ల దేశంలో ఇప్పుడు ఏనుగుల సంరక్షణ గురించి చర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు సి.ఎం స్టాలిన్‌ వెంటనే స్పందించి బొమ్మన్, బెల్లిలను పిలిచి చెరొక లక్ష డబ్బు ఇచ్చి సన్మానం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న 91 మంది మావటీలకు కూడా మనిషికో లక్ష ఇవ్వనున్నారు. వీరి నివాసాల కోసం 9 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఏనుగుల క్యాంపుల కోసం 13 కోట్లు మంజూరయ్యాయి.
ప్రేమ, ఆదరణల వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుంది. బొమ్మన్, బెల్లిలతో అది మరోసారి రుజువయ్యింది.

మరిన్ని వార్తలు