Laya Mathikshara: ఈమెకు లక్షల్లో డబ్బు... అతడు ఏకంగా 7 కోట్లు సంపాదించాడు! ఇదెలా సాధ్యవుతోందంటే!

16 Feb, 2022 12:02 IST|Sakshi

Laya Mathikshara- Non Fungible Tokens: ‘తన సెల్ఫీలు అమ్మకానికి పెట్టి కోట్లు గడించాడు’ అని ఎవరైనా అంటే– ‘అయ్యా! తమరికి నేనే దొరికానా’ అని అనుమానంగా చూసేవాళ్లే ఎక్కువ. కానీ ‘సెల్ఫీ’ కోట్లు గడించింది అనేది అబద్ధం కాదు... అతిశయోక్తి అంతకన్నా కాదు..

అద్భుతమైన నిజం.. లాక్‌డౌన్‌ సమయంలో చెన్నైకి చెందిన లయ మతిక్షర తన సోదరి దగ్గర సరదాగా పైథాన్‌ లాంటి ప్రోగ్రామ్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకుంది. అలా రకరకాల సైట్లు చూస్తూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ తన ఆర్ట్‌ను మెరుగు పరుచుకునే క్రమంలో ‘ఎన్‌ఎఫ్‌టీ’ గురించి విన్నది.

ఒక ప్రయత్నం చేసి చూద్దామని రంగంలోకి దిగింది. తన ఫస్ట్‌ ఎన్‌ఎఫ్‌టీ ‘వాట్‌ ఇఫ్, మూన్‌ హ్యాడ్‌ లైఫ్‌?’ యానిమేటెడ్‌ ఆర్ట్‌వర్క్‌ మంచి ధరకు అమ్ముడు పోయింది. ‘మా పేరెంట్స్‌కు ఎన్‌ఎఫ్‌టీపై పెద్దగా నమ్మకం లేదు. మొదట్లో నాకు కూడా అంతే. మొదటి ఎన్‌ఎఫ్‌టీకీ మంచి ఆదరణ లభించడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అంటుంది లయ. అంతరిక్షం, భౌతికశాస్త్రం తదితర రంగాలకు చెందిన ఆర్ట్‌లతో లక్షల్లో ఆర్జిస్తోంది. 

వీళ్లు కూడా సక్సెస్‌ కొట్టారు..
సౌత్‌లో రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్‌ ఇంతా అంతా కాదు కదా. ఈ క్రేజ్‌ను ‘ఎన్‌ఎఫ్‌టీ’లోకి మళ్లించి సక్సెస్‌ కొట్టారు చెన్నై టీన్స్‌ షామిల్‌ కరీమ్, యశ్‌ రాథోడ్‌లు. రజనీకాంత్‌ డైలాగ్స్, కబాలీ సినిమాలో ఆయన సూట్, ఏఆర్‌ రెహమాన్‌ పాటలను ‘ఎన్‌ఎఫ్‌టీ’లోకి తీసుకువచ్చి హిట్‌ కొట్టారు. అంతేకాదు...‘డిజినూర్‌’ అనే ఎన్‌ఎఫ్‌టీ ప్లాట్‌ఫామ్‌ మొదలుపెట్టి ఏవీయం ప్రొడక్షన్, రిలియన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లాంటి అగ్రగామి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే స్థాయికి ఎదిగారు.

చండీగఢ్‌లో ఆమె సైతం..
ఇప్పుడు చెన్నై నుంచి చండీగఢ్‌కు వద్దాం... అడపాదడపా పెయింటింగ్స్‌ వేసే స్వర్ణాళిసింగ్‌కు ఎన్‌ఎఫ్‌టీపై ఆసక్తి పెరిగిన తరువాత క్రిస్టో–కమ్యూనిటీల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. తన మార్క్‌ ప్రతిబింబించేలా సగటు భారతీయ గృహిణి చిత్రాలను ఎన్‌ఎఫ్‌టీలోకి తీసుకువచ్చింది. పెద్దగా ప్రమోట్‌ చేయకపోయినా సింగ్‌ ‘దుర్గాదేవి’ ఎన్‌ఎఫ్‌టీకి బాగా గుర్తింపు వచ్చింది,

నిజంగానే కాసులు కురిపిస్తాయా?
చిత్రాలు సరే, సెల్ఫీలు సైతం ఎన్‌ఎఫ్‌టీలుగా మారి లక్షలు కురిపిస్తాయా? ఇండోనేసియాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల గుస్తాఫ్‌ అల్‌ ఘోజాలి దగ్గరకు వెళితే ‘అవును. నిజమే’ అనక తప్పదు. కంప్యూటర్‌ సైన్స్‌ స్టూడెంట్‌ అయిన ఘోజాలికి రోజుకు ఒక సెల్ఫీ తీసుకోవడం అలవాటు. ఒక ఎన్‌ఎఫ్‌టీ వెబ్‌సైట్‌లో ‘ఘోజాలి ఎవ్రీడే’ పేరుతో 933 సెల్ఫీలను అమ్మకానికి పెట్టాడు.

‘ఘోజాలి సెల్ఫీని ఎన్‌ఎఫ్‌టీగా కొన్నాను’ అని ఒక ప్రముఖుడు ట్విట్‌ చేశాడో లేదో అతడి సెల్ఫీలకు మహర్దశ పట్టుకుంది. అలా ఒకటి కాదు... రెండు కాదు ఎథెర్‌ (బిట్‌కాయిన్‌ లాంటిది)ల రూపంలో  ఏడు కోట్లు సంపాదించాడు. ‘తమదైన సిగ్నేచర్‌ స్టైల్‌ను ఏర్పాటు చేసుకుంటే ఎన్‌ఎఫ్‌టీలో విజయం సులభం అవుతుంది’ అంటోంది యాక్టర్, డిజైనర్, ఆర్టిస్ట్‌ లేఖ వాషింగ్టన్‌.

ఇంతకీ ఎన్‌ఎఫ్‌టీ అంటే?
నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌. వాస్తవిక ప్రపంచానికి చెందిన ఆర్ట్, మ్యూజిక్, వీడియో... మొదలైన వాటికి ప్రాతినిధ్యం వహించే డిజిటల్‌ ఆస్తి. వీటి అమ్మకాలు, కొనుగోళ్ల కోసం వజీర్‌ ఎక్స్, కళమింట్, ఓపెన్‌ సీలాంటి మార్కెట్‌ప్లేస్‌లు ఉన్నాయి.

చదవండి: తొడలు, నడము, పొట్ట వంటి భాగాల్లో కొవ్వు సులభంగా తగ్గించుకోవచ్చు.. ఈ డివైజ్‌ ధర 9 వేలు


  

A post shared by Laya Mathikshara (@laya_mathikshara)

A post shared by Laya Mathikshara (@laya_mathikshara)

A post shared by Laya Mathikshara (@laya_mathikshara)

మరిన్ని వార్తలు