ఇలకు దిగిన ప్రేమ

25 Dec, 2020 00:00 IST|Sakshi

క్రిస్మస్‌ సమయంలో చర్చిలపై, ఇండ్లపై, వీధులలో, క్రిస్మస్‌ ట్రీలపై ప్రజలు ఆనందోత్సాహాలతో స్టార్స్‌ అలంకరిస్తారు. దీనికి కారణం యేసు ప్రభువు 2020 సంవత్సరాల క్రితం బెత్లెహేములో జన్మించి, స్థలం లేక పశువుల తొట్టిలో పరుండబెట్టిన రాత్రి ఆకాశంలో ఒక దేదీప్య తార వెలిసింది. దేవుడే మానవావతారుడై భూమిపై వెలశాడు. క్రిస్మస్‌లో వెలిగించే రంగురంగుల విద్యుత్‌ దీపాల ప్రకాశం, నక్షత్రం, పెద్ద చిన్న తారలతో చాలా ఆత్మీయ భావాలు ఇమిడి ఉన్నాయి. కోట్లాది లెక్కించలేని నక్షత్రాలు గగనంలో ఉన్నప్పటికీ ఈ నక్షత్రం ప్రత్యేకం. దేవుని నమ్మిన అబ్రహాం సంతానం ఆకాశంలో నక్షత్రాల వలె విస్తరిస్తారని, ఆయన సంతతి నుండి లోక రక్షకుడు ఉదయిస్తాడని నిర్ధారణ అయింది. ఈ తార మిగిలిన వాటి నుండి తగ్గించుకుని కిందకి దిగి వచ్చాడు. మనం కూడా పాపం నుండి, చెడు నుండి వేరు కావాలి. యేసు సాత్వికుడై దాసుని రూపం ధరించాడు. మనుష్యులు పరలోకానికి దారి చూడాలంటే తగ్గింపు కలిగి ఉండాలి. మోసగాడైన యాకోబులో ఉదయించిన నక్షత్రం రాజును పోలిన ఇశ్రాయేలీయులనుగా మనుష్యులను మార్చడానికి క్రీస్తు వచ్చాడు. దేవుని దూతలు వేరు, మోసం చేసే తేజోనక్షత్రం సాతాను వేరు. నేను దావీదు వేరు చిగురును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను’ అని యేసు చెప్పాడు (ప్రకట:22:16).

దారి చూపు వెలుగును వెంబడించు వారు గుంటలో పడరు. పాపమున్న చోటను నడువరు. అందువలన యేసు శిశువు నుండి సిలువ వరకు అక్కడి నుండి పునరుత్థానుడై వెళ్లువరకు ‘నేను లోకానికి వెలుగునై ఉన్నాను‘ అని తెలిపాడు. యేసు నుండి రక్షించబడిన వారు నక్షత్రాలు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశిస్తారు. నీతి మార్గాన్ని అననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు’ (దానియేలు 12:3) మరణించినా జీవించునట్లు దారి చూపు వారు వీరే. మోషే, దానియేలు, బాప్తిస్మమిచ్చు యోహాను, పౌలు, ఎస్తేరు లాంటి బైబిలు వ్యక్తులు అట్టివారే.

ఏ నక్షత్రాన పుట్టామనేది ప్రాముఖ్యం కాదు. కాని క్రిస్మస్‌ నక్షత్రాన్ని వెంబడిస్తే ప్రేమ, నీతి, పరిశుద్ధత, మంచి తండ్రిగా, తల్లిగా, నాయకుడి మాదిరిగా, మదర్‌ థెరిస్సావలె ప్రకాశిస్తారు. ‘కాంతి గల నక్షత్రాల్లారా, మీరందరూ ఆయనను స్తుతించండి (కీర్తనలు 148:3) అని కీర్తనకారులు పాడినారు. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా మారరాదని బైబిలు హెచ్చరిస్తుంది.


బైబిల్‌ ఎవరి చేతిలో ఎవరి హృదయంలో ఉండునో వారు ప్రకాశించే దివిటీలు. జాలరి నుండి శిష్యునిగా మారిన పేతురు ‘తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాలలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచితే మీకు మేలు’ (2 పేతురు 1:19) అని రాశారు. లోకం హత్యలతో, అత్యాచారాలతో, ధనాశతో, దుర్వ్యసనాలతో, అసమాధానంతో చీకటిలో ఉన్నప్పుడు, అట్టి జనం మధ్యకు మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుతున్నారు (ఫిలిప్పీ 2:16) అని పరిశుద్ధ పౌలు తెలిపాడు. విద్యలో, నీతిలో, మాదిరిలో, ప్రావీణ్యతలో గొప్ప తారలుగా మనుషుల్ని మార్చాలి. 

అమెరికా అంతర్యుద్ధంలోనికి తమ పిల్లలను పంపేవారు, వారు చనిపోయినప్పుడు ఒక ఎర్రటి నక్షత్రం కట్టుకొనేవారట. అయితే ఒక తండ్రి, కుమారుని నడిపిస్తూ, రెండు ఎత్తైన కట్టడాల మధ్య ఆకాశంలో బంగారు వర్ణ నక్షత్రం చూచి కుమారుడు, ‘నాన్న! దేవుడు తన కుమారుని యుద్ధానికి పంపాడు’ అన్నాడు.‘ఈ స్టార్‌ వార్‌లో సిలువలో సాతాను ఓడిపోయాడు. యేసు మృత్యుంజయుుడై గెలిచాడు గనుక నేటికీ వెలుగుల క్రిస్మస్‌. ‘దేవుడు తానే మనలను ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన కుమారుని పంపాడు’. (1 యోహాను 4:10). ఇది సజీవ క్రిస్మస్‌ తార, నేటికీ ప్రకాశించి అనేకులకు దారి చూపుతోంది. ఈ లోకం శాశ్వతం కాదు. ధనం, గౌరవం, సంపద, ప్రఖ్యాతి ఎంత ఉన్నా, రెండవ రాకడ ఆసన్నమయే సమయంలో ఏవీ ఎన్నతగినవి కావు. యేసు మొదటి రాక క్రిస్మస్‌ పాపులను రక్షించడానికి ప్రభువు రెండవ రాకడ తను నమ్మిన పరిశుద్ధులను నిత్య రాజ్యంలోనికి తీసుకొని వెళ్లడానికి ఆకాశం నుండి నక్షత్రాలు రాలతాయి (మత్తయి 24: 29) అని ప్రభువే తెలిపాడు. ఎంత గొప్పవాడైనా బెత్లహేం నక్షత్రం వలె పని అయిన తరువాత కనుమరుగవుతుంది. ఇది సత్యం.

క్రిస్మస్‌ నక్షత్రాలు, పండుగ సందడి, వ్యాపార సమయం అయిన తరువాత పాతబడి పనికి రాకపోవచ్చు గాని, కుటుంబం, కుమారులు, కుమార్తెలు, సత్ప్రవర్తన, పరిశుద్ధత, ఇతరులకు దారి చూపుతూ బతికితే... నిరంతరం నిలుచు నక్షత్రాలుగా ఉంటారు. ‘నీతిమంతులైతే తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు’ అదే నిత్య క్రిస్మస్‌ ఆనందం.   – తంటిపూడి ప్రభాకరరావు 

మరిన్ని వార్తలు