చిన్న మెసేజ్‌‌ పంపించాలన్నా హైరానా..!

27 Jan, 2021 09:04 IST|Sakshi

టీనేజ్‌ టెక్‌ టీచర్‌!

పెద్దల నుంచి పిల్లలు నేర్చుకోవడం ఒకప్పటి మాట. టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ఇప్పటి జనరేషన్‌ వాళ్లు ఏదైనా ఇట్టే పట్టేస్తున్నారు. అంతేగాకుండా టెక్నాలజీ పట్ల కనీస అవగాహన లేని ముసలి వాళ్లకు సైతం నేర్పించేస్తున్నారు. ఈ కోవకు చెందిన అమ్మాయే చెన్నైకు చెందిన ‘తాన్వి అర్వింద్‌’. 14 ఏళ్ల తాన్వి.. అవ్వాతాతలకు ఆన్‌లైన్‌లో టెక్నాలజీ పాఠాలు చెబుతోంది.

అది 2018.. తాన్వి తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు.. వేసవి సెలవులకు బెంగళూరులోని వాళ్ల గ్రాండ్‌ పేరెంట్స్‌ దగ్గరకు వెళ్లింది. ఆ సయంలో వాళ్ల గ్రాండ్‌ పేరెంట్స్‌..స్మార్ట్‌ఫోన్‌ వాడడానికి ఇబ్బంది పడడం గమనించింది. చిన్నపాటి మెసెజ్‌ పంపించాలన్నా వాళ్లు తెగ హైరానా పడడం దగ్గరగా చూసి, స్మార్ట్‌ఫోన్‌ ఎలా వాడాలో అర్థమయ్యేలా ఓపిగ్గా  నేర్పించింది. ఈ ఏడాదిలోనే తాన్వి యంగ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ అకాడమీ(వైఈఏ) నిర్వహించే 25 రోజుల ఈవెంట్‌కు వెళ్లింది. ఈవెంట్‌లో తను నేర్చుకున్న అంశాల ఆధారంగా సీనియర్‌ సిటిజన్స్‌కు స్మార్ట్‌ఫోన్స్‌ ఎలా వాడాలో నేర్పించే ఆన్‌లైన్‌ క్లాస్‌లు ప్రారంభించాలనుకుంది. అనుకుందే తడవుగా ‘టెక్‌ఎడ్యుకేషన్‌’ (TechEdEn)-పేరుతో క్లాస్‌లు ప్రారంభించింది.

ఆన్‌లైన్‌లోనే గాక తాన్వి వాళ్ల సిస్టర్‌తో కలిసి క్లైంట్ల ఇళ్లకు కూడా వెళ్లి నేర్పించేది. తాన్వి క్లాసుల్లో ముఖ్యంగా మెస్సేజ్‌లు ఎలా పంపాలి? యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం, వీడియోలు స్ట్రీమ్‌ చేయడం వంటివి నేర్పిస్తుంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌ క్లాస్‌ల ద్వారా 25 మందికి, ఇంటికి వెళ్లి చెప్పడం ద్వారా 68 మందికి క్లాస్‌లు చెప్పింది. కాగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ ద్వారా తన టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు ప్రచారం కల్పిస్తున్నానని, ఇంకా ఎటువంటి ప్రకటనలూ ఇవ్వడంలేదని తాన్వి చెప్పింది. నేను నేర్పించేది టెక్నాలజీ తెలియని వాళ్లకు గనుక వాళ్లు సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌గాని చూడరు. అందువల్ల ప్రచారం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అందుకే తెలిసిన వారి ద్వారా తన టెక్‌ ఎడ్యుకేషన్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు తాన్వి చెప్పుకొచ్చింది.  

మరిన్ని వార్తలు