తార కథ నుంచి తెలుసుకోవాల్సిన నీతి ఏంటో తెలుసా?

3 Apr, 2021 06:44 IST|Sakshi

అహల్య, ద్రౌపదీ, సీత, తార, మండోదరి అనే ఐదు పేర్లను స్త్రీలు ప్రతిరోజూ స్మరించడం వల్ల అన్ని పాతకాలూ నశించి దీర్ఘ సుమంగళిగా జీవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. 
పైన మనం చెప్పుకున్న పేర్లన్నీ వివాహితలవే. అయితే వీరిని కన్యలుగా చెప్పుకోవడమంటే  వినడానికీ వింతగా ఉండవచ్చు. నిజానికి వీరందరూ దేవతలే. అయితే, వివిధ రకాల శాపాల కారణంగా మానవ జన్మ ఎత్తి, తిరిగి వారు చేసుకున్న పుణ్యకర్మల ఫలితంగా దేవతల వరాలను పొంది పంచకన్యలుగా పేరు పొందారు. వారిలో మనం ముందుగా తార గురించి తెలుసుకుందాం.  తార వానర రాజైన వాలి భార్య. వీరి కుమారుడు అంగదుడు. కిష్కింధ కాండలో వాలిసుగ్రీవులతో తార పాత్ర ప్రముఖంగానే కనిపిస్తుంది.

రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. వారిరువురూ ఒకే విధంగా ఉండడంతో వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరమాడాడు సుగ్రీవుడు. అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. ఈసారి మళ్లీ వెళ్లి నీ అన్నని యుద్ధానికి పిలవమని చెప్పాడు.

సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని రెండవసారి యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బుసలు కొడుతూ బయలుదేరిన వాలిని తార వారించేందుకు ప్రయత్నించింది. ‘ఇంతక్రితమే నీ చేతిలో చావు దెబ్బలు తిని ఎలాగో ప్రాణాలు దక్కించుకుని వెళ్లిన నీ తమ్ముడు ఇంతట్లోనే మళ్లీ వచ్చి నీపై కయ్యానికి కాలు దువ్వుతున్నాడంటే, దానివెనక ఏదో మర్మం ఉండి వుంటుంది. అంతేకాదు, పైగా ఇది రాత్రి సమయం. మీరు ఇప్పటివరకు శయ్యాసుఖాలు అనుభవించి ఉన్నారు. నాకు అపశకునాన్ని సూచిస్తూ, కుడికన్ను, కుడి భుజం అదురుతున్నది. మనసు కీడు శంకిస్తోంది. 

ఈ సమయంలో యుద్ధం అంత మంచిది కాదని నా మనసు చెబుతోంది. కాబట్టి అతను కవ్వించినంత మాత్రాన మీరు ఆవేశపడవద్దు. దయచేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి. అతనిలో కలిగిన ధైర్యానికి కారణం తెలుసుకుని, అతనికి అండగా ఉన్నదెవరో కనుక్కుని, అందుకు తగ్గట్టుగా వ్యూహాన్ని రచించుకుని, అప్పుడు యుద్ధం చేద్దురుగాని, ఇప్పుడు మీరు అతన్ని పట్టించుకోవద్దు, చూసీ చూడనట్లుగా, వినిపించుకోనట్లుగా ఉండండి నాథా!’’ అని ఎంతగానో నచ్చజెప్పింది. అయితే, పోగాలం దాపురించినప్పుడు మంచిమాటలు చెవికెక్కవు కదా, కాని వాలి ఆమె మాట చెవిని వేసుకోలేదు. యుద్ధానికి బయలుదేరాడు. 

అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచన మాల వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించ సాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై నాటాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.

తరువాత వాలి సుగ్రీవుని పిలిచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు. పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని నేలకు ఒరిగాడు. మేరు పర్వతం వంటి భర్త నిస్సహాయంగా నేల కూలినందుకు తార ఎంతగానో బాధపడింది. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని  రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడూ, యువరాజుగా అంగదుడూ అభిషిక్తులయ్యారు. 

ఇక్కడ మనం తార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అవేమంటే, ఆమె తొలుత వాలి భార్య. వాలి మరణానంతరం వానర రాజనీతిని అనుసరించి సుగ్రీవుడి భార్య అయింది... అదీ కూడా వాలి మరణంతో భరించరాని దుఃఖంతో ఉన్న తారకు కుమారుడైన అంగదుణ్ణి కాపాడుకోవాలంటే, అండ అవసరం. అందుకే రాముడి సలహాను అనుసరించి వాలితో సహగమనం చేయకుండా సుగ్రీవుడికి భార్యగా సహజీవనం చేయవలసి రావడం. (ఇది నేటి రోజుల్లో వాడే సహజీవనం కాదు) 
రాజ్యాభిషేకానంతరం సుగ్రీవుడు ధర్మార్ధవిముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతూ, రామునికిచ్చిన మాటను దాదాపు మరచిపోయాడు. దాంతో లక్ష్మణుడు ఆగ్రహంతో సుగ్రీవుని సంహరించడానికి వెళ్లబోగా, తార సుగ్రీవుని హెచ్చరించడంతో సుగ్రీవుడు తన అపరాధాన్ని మన్నించమని వేడుకుని, తన సేనాగణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని చెంతకు వెళ్ళి రాముని పాదాలపై బడ్డాడు. రాముడు అతన్ని  క్షమించి ఆలింగనం చేసుకొన్నాడు. అనంతరం సుగ్రీవుడు ఆలస్యం చేయకుండా సీతాన్వేషణకు పథకాన్ని సిద్ధం చేసి రాముని అభిమానాన్ని చూరగొన్నాడు. 

హితవు కోరిన చెప్పిన మాటలను వినకపోవడం వల్ల వాలికి కలిగిన చేటును, హితురాలు, వివేకవతి, సౌశీల్యవతి, పతివ్రత అయిన తార మాట వినడం వల్ల సుగ్రీవునికి తప్పిన ముప్పును తలచుకుంటే ‘‘కార్యేషు మంత్రి’’ అనే సూక్తికి తార ఎంత న్యాయం చేసిందో గ్రహించవచ్చు. తార కథ నుంచి మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, భార్య ఎల్లప్పుడూ లౌకిక పరిస్థితులను గురించి భర్తకు తెలియజెబుతూ, కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. అంతేకానీ, కర్తవ్య విముఖుణ్ణి చేయరాదు. 
 – డి.వి.ఆర్‌. భాస్కర్‌

మరిన్ని వార్తలు