వేస్ట్‌ నుంచి బెస్ట్‌ డిజైన్‌

23 Jan, 2021 08:34 IST|Sakshi

షాపింగ్‌ బ్యాగ్స్‌

షాపింగ్‌కు నుంచి వచ్చేటప్పుడు వెంట అక్కడి బ్యాగ్‌ కూడా మనతో పాటు వచ్చేస్తుంది. అలా ఒక్కోటిగా పేరుకుపోయిన బ్యాగులను మూలన పడేయడం లేదా చెత్తబుట్ట పాలు చేయడం సాధారణంగా చూస్తుంటాం. 22 ఏళ్ల టీచా ఏరియల్‌ మాత్రం వినూత్నంగా ఆలోచించింది. రకరకాల షాపింగ్‌ బ్యాగులతో డిజైనర్‌ డ్రెస్సులను రూపొందిస్తుంది. ఆ డ్రెస్సులను ధరించి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంది. ఆమె ఆలోచనను యూజర్స్‌ తెగ ప్రశంసిస్తున్నారు.

వేస్టేజ్‌ను ఎలా తిరిగి వాడుకోవచ్చో ఈ విధానం భేషుగ్గా తెలియజేస్తుందని లైక్‌ల మీద లైకులు ఇస్తున్నారు. ఏరియల్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ విద్యార్థి. తను చేసిన ఆలోచన మాత్రం ప్రపంచమంతా ఆకట్టుకునేలా ఉంది. షాపింగ్‌ బ్యాగుల నుండి అధిక మొత్తంలో ఫ్యాషన్‌ దుస్తులను సృష్టించిన ఘనత ఏరియల్‌ సొంతం. ఆమె తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు సరదాగా వచ్చిన ఆలోచనను ఇలా ఆచరణలో పెట్టేసింది. ఆధునిక కాలంలో వస్తున్న మార్పులకు తగ్గట్టు చేసే ఆలోచనల్లో షాపింగ్‌ బ్యాగ్‌ డ్రెస్సులు క్లిక్‌ అయ్యాయి.

ఒక్కో  బ్యాగ్‌ కట్‌ చేసి..
వినూత్నంగా డ్రెస్సులు తయారు చేయడానికి ఇంట్లో స్టోర్‌ రూమ్‌లో ఉంచిన బ్యాగ్‌లను బయటకు తీసుకువచ్చింది. లాక్‌డౌన్‌ టైమ్‌ ఈ సృజనకు కొంత ఊతమిచ్చింది. ‘మొదట్లో ఖాళీ సమయం బాగా విసుగ్గా అనిపించేది. ఎప్పుడైతే షాపింగ్‌ బ్యాగుల నుండి ఫ్యాషన్‌ డ్రెస్సులను తయారుచేయాలనే ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి సమయమే తెలియలేదంటుంది’ ఏరియల్‌. డ్రెస్సుల కోసం వాల్‌మార్ట్, టార్గెట్, వేన్స్, ట్రేడర్‌ జో బ్రాండ్‌ బ్యాగ్‌లను ఉపయోగించింది. ఆమె తన ఫ్రెండ్‌తో కలిసి ప్రతి సంచిని జాగ్రత్తగా కట్‌ చేసి, అమరిక ప్రకారం కుట్టింది.

మిగిలిన సంచుల మెటీరియల్‌ నుండి అందమైన ఉపకరణాలనూ తయారు చేసింది. మనం ఉపయోగించి, పడేసే వస్తువులను తిరిగి ఎన్నిసార్లు వాడదగినవి రూపొందించుకోవచ్చో తన ప్రయత్నంతో తెలియజేస్తుంది. ఏరియల్‌ డ్రెస్‌ డిజైన్స్‌ చూసినవారు తాము కూడా అలాంటి దుస్తులు డిజైన్‌ చేస్తామని తెలిపారు. ఈ షాపింగ్‌ సంచుల నుండి కర్టెన్లు, రగ్గులు, ఇతర వాడదగిన వస్తువులను ఎలా ఉపయోగించాలో ప్రజలు నేర్చుకోవాలని ఈ అమ్మాయి కోరుతుంది. 

మరిన్ని వార్తలు