స్కూల్‌ టీచర్‌.. ఒక్కరోజులోనే సెలబ్రిటీ అయిపోయారు

27 Jan, 2021 11:13 IST|Sakshi

ఆమె ఈ మెయిల్‌కి ఒకే రోజు పదమూడు వేల మెయిల్స్‌ వచ్చాయి. రోజంతా ఫోన్‌లో మెయిల్‌ బాక్స్‌ మోగుతూనే ఉంది. మెయిల్స్‌ అందుకున్న మహిళ ఓ సాధారణ స్కూల్‌ టీచర్‌. ఒక్కరోజులోనే సెలబ్రిటీగా మారిపోయారు. అమెరికన్‌ సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌ చేతికి వేసుకున్న మిటెన్స్‌ (ఊలుతోతయారు చేసిన తొడుగులు, గ్లౌజ్‌ కాదు) ఆమెను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆ మహిళ పేరు జెన్నిఫర్‌ ఎలీస్‌.

అమెరికాలోని వెర్మాంట్‌ టౌన్, ఎసెక్స్‌ జంక్షన్‌లో ఒక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పని చేస్తున్నారు జెన్నిఫర్‌ ఎలీస్‌. జనవరి 20, 2021 బుధవారం నాడు తన ఈమెయిల్‌కి లెక్కలేకుండా టెక్ట్స్‌ మెయిల్స్‌ వస్తుండటం చూసి ఆశ్చర్యపోయారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణ స్వీకారణం చేస్తుంటే జెన్నిఫర్‌ ఎలీస్‌ మెయిల్‌ బాక్స్‌ టకటక ధ్వనులు చేసింది. సరిగ్గా అదే సమయంలో అమెరికన్‌ సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌కి సంబంధించిన ఒక వీడియో వైరల్‌ అవ్వడం మొదలైంది. ఆయన చేతులకు వేసుకున్న మిటెన్స్‌ (చేతి తొడుగులు) గురించి ట్వీట్‌ చేయటం ప్రారంభించారు. వాటిని నాలుగేళ్ల క్రితం జెన్నిఫర్‌ తయారు చేసి ఆయనకు పంపారు. వాస్తవానికి బెర్నీ శాండర్స్‌ని జెన్నిఫర్‌ ఎన్నడూ కలవలేదు. 

సాధారణ టీచర్‌...
42 సంవత్సరాల జెన్నిఫర్‌ ఎలీస్‌ ఒక ఎలిమెంటరీ స్కూల్‌ టీచర్‌. వెర్మాంట్‌లో ప్రశాంత జీవనం గడుపుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి కనుక, జెన్నిఫర్‌ ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతున్నారు. ఆ రోజు కూడా అలాగే పాఠాలు చెబుతున్నారు. ఒక పక్కన బైడెన్‌ ప్రమాణ స్వీకారం, మరో పక్క జెన్నిఫర్‌ ఫోన్‌ నుంచి చిన్న చిన్న శబ్దాలు. అన్నీ టెక్ట్స్‌ మెసేజ్‌లే. అన్ని మెసేజ్‌లలోని అంశం ఒకటే. ‘‘బెర్నీ శాండర్స్‌ మీరు తయారు చేసిన మిటెన్స్‌ చేతులకు వేసుకున్నారు’’ అని. వాస్తవానికి ఆ మిటెన్స్‌ చేతులకు వెచ్చదనం కలిగించటానికి. అయితే వాటిని జెన్నిఫర్‌ వ్యర్థాలతో తయారు చేశారు. పనికిరాని ప్లాస్టిక్‌ సీసాలతో మిటెన్స్‌ లోపలి పొరను తయారు చేశారు. పాడైపోయిన స్వెటర్లను కట్‌ చేసి, మంచిమంచి రంగుల కాంటినేషన్‌తో పై తొడుగు భాగం తయారుచేశారు. 

మిటెన్స్‌ కథ..
శాండర్స్‌ చేతికి వేసుకున్న మిటెన్స్‌... ముదురు గోధుమ రంగు, లేత గోధుమ రంగు, తెలుపు రంగుల కాంబినేషన్‌లో ఉన్నాయి. వీటి వెనుక ఒక కథే ఉంది. ఎలీస్‌కి శాండర్స్‌ అంటే గౌరవంతో కూడిన అభిమానం. 2016లో మిటెన్స్‌ తయారు చేసి శాండర్స్‌కి పంపారు. ఆయనకు అవి నచ్చినట్లుగా తెలిసినవాళ్ల ద్వారా తెలుసుకున్నారు జెన్నిఫర్‌. చాలా సంతోష పడ్డారు. కిందటి సంవత్సరం శాండర్స్‌ ప్రెసిడెంట్‌గా నిలబడటానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ మిటెన్స్‌ వేసుకున్నారు. అది చూసిన సోషల్‌ మీడియా ఆయనను ‘అల్లికల మెటిన్‌’ అంటూ కామెంట్స్‌ చేశారు. అది చూసిన జెన్నిఫర్‌కి సంతోషం కలిగింది. వెంటనే మరో పది జతలు తయారుచేసి శాండర్స్‌కి పంపారు ఎలీస్‌. శాండర్స్‌ వాటిని ధరించటం చూసిన తరవాతే ఇప్పుడు ఇంత హడావుడి మొదలైంది.

శాండర్స్‌ ఇలా ఉన్నారు..
శాండర్స్‌... మందంగా ఉంటే చలి కోటు ధరించారు. చేతులకు మిటెన్స్‌ వేసుకుని, కాలి మీద కాలు, చేతి మీద చేయి వేసుకుని కూర్చున్నారు. ఏ మాత్రం గ్లామర్‌ లేదు ఆయనలో. ఈ వేషధారణనే అందరూ హాయిగా ఆనందించేలా మీమ్‌ కూడా తయారు చేశారు నెటిజన్లు. ఇంకేముంది జెన్నిఫర్‌ ఫోన్‌ ఆగకుండా మెసెజ్‌లతో మోగటం మొదలైంది. 

చాలాకాలం క్రితం..
జెన్నిఫర్‌ తన స్నేహితురాలితో కలిసి అదనపు ఆదాయం కోసం చాలాకాలం క్రితం మిటెన్స్‌ తయారు చేయటం ప్రారంభించారు. పాత ఉన్ని స్వెట్లర్లను కట్‌ చేసి, రకరకాల రంగుల కాంబినేషన్లలో తన తల్లి ఇచ్చిన కుట్టు మిషన్‌ మీద మిటెన్స్‌ కుడుతుండేవారు. ఒక్కో జత కుట్టడానికి గంట  పట్టేది. అమ్మాయి పుట్టిన తరవాత ఇంక అవకాశం లేకపోవటంతో జెన్నిఫర్‌ కుట్టడం మానేశారు. ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు సెలవు రోజుల్లో కుట్టేవారు జెన్నిఫర్‌. 

అన్నిటికీ దూరంగా..
జెన్ఫిఫర్‌ అందుకున్న మెయిల్స్‌కి ఆవిడ కావలసినంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఒక్క జత కాదు, చాలా జతలు కావాలంటూ వచ్చిన మెయిల్స్‌ డిమాండ్‌కు తగ్గట్టు జెన్నిఫర్‌ తయారుచేయటం చాలా కష్టం. ఆవిడ దగ్గర తల్లి ఇచ్చిన 30 ఏళ్లనాటి కుట్టు మిషన్‌ ఉంది. జెన్నిఫర్‌కి వ్యాపారం చేసే ఆలోచనే లేదు. ‘‘నేను వ్యాపారం చేయటం మొదలుపెడితే, ఆ మిటెన్స్‌కి దక్కిన గౌరవం పోతుంది’’ అంటారు జెన్నిఫర్‌. ఆవిడకు తన కుటుంబంతో హాయిగా, ఐదేళ్ల కుమార్తెతో సంతోషంగా ఉండాలని కోరిక. 

వెర్మాంట్‌ సెనేటర్‌ బెర్నీ శాండర్‌ కోడలైన లిజా డ్రిస్కాల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రీస్కూల్‌లో జెన్నిఫర్‌ కూతురు చదువుకునేది. అయినా ఎన్నడూ లిజాను జెన్నిఫర్‌ కలవలేదు. ‘‘2016లో డెమొక్రటిక్‌ నామినేషన్‌ పోవటం నా మనసును గాయపరచింది. శాండర్స్‌ మళ్లీ నిలబడకపోతే బావుంటుంది అనుకున్నాను. నేను బహుమతిగా ఇచ్చిన మిటెన్స్‌ను ఆయన ధరించటం నన్ను ఆదరించినట్లుగా భావిస్తున్నాను. నేను నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన వాటిని ఈ రోజు ధరించటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో సాధారణంగా ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన వాటినే ధరిస్తారు. కాని బెర్నీ శాండర్‌ నేను ఇచ్చిన మిటెన్స్‌ వేసుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులకి, స్నేహితులకి అందరికీ ఇటువంటి మిటెన్సే ఉన్నాయి. వారంతా వీటిని చూసుకుని, ఇవే కదా బెర్నీ ధరించినవి అని మురిసిపోతూ ఉంటారు. – జెన్నిఫర్‌ ఎలీస్‌

>
మరిన్ని వార్తలు