నువ్వేమైనా అందగత్తెవా?!.. విపరీతమైన కామెంట్లు రావడంతో..

10 Jun, 2021 01:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సోబర్‌ క్రైమ్‌

దీపిక (పేరు మార్చడమైనది) ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ చదువుతోంది. తమది దిగువ మధ్యతరగతి కుటుంబమైన కూతురును బాగా చదివించాలన్నది తండ్రి ప్రసాద్‌(పేరుమార్చడమైనది) కల. అందుకు తగినట్టుగానే దీపిక బాగానే చదువుతుంది. ఫ్యాషన్‌ అంటే ఆసక్తి ఉండే దీపిక తన డ్రెస్సింగ్‌ పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. తన డ్రెస్సింగ్‌ను నలుగురూ మెచ్చుకోవాలన్న ఆలోచనతో రకరకాల మోడళ్లలో డ్రెస్సులు ధరించి, సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసేది. వచ్చిన లైక్స్, మెచ్చుకోలు కామెంట్స్‌ చూసుకొని మురిసిపోయేది. టిక్‌టాక్‌ వీడియోలు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది దీపిక. ఆరు నెలలు గడిచిపోయాయి. ఓ రోజు మెసేజ్‌లు చూసుకుంటున్న దీపిక ఉన్నట్టుండి ఫోన్‌ విసిరికొట్టింది. అది చూసిన తల్లి దీపికను మందలించింది. తల్లివైపు కోపంగా చూసి తన రూమ్‌కి వెళ్లిపోయింది దీపిక.

ముంచుకొచ్చే కోపం
రాత్రి భోజనానికి రమ్మని ఎంత చెప్పినా కూతురు బయటకు రాలేదు. ఈ మధ్య దీపిక చాలా ముభావంగా ఉంటోందని, ఏదడిగినా త్వరగా కోపం తెచ్చుకుంటుందని భర్తకు చెప్పింది. ‘ఆ వయసు అలాంటిది. అవేమీ పట్టించుకోకు. కొన్ని రోజులు పోయాక తనే తెలుసుకుంటుందిలే’ అన్నాడు ప్రసాద్‌. ‘అన్నింటికీ కూతురును ఇలాగే వెనకేసుకొస్తారు. అన్నం తినమన్నా అదేదో తిట్టులాగే వినపడుతోంది మీ కూతురుకి’ అంటూ తన అసహనాన్ని తెలియజేస్తూ గిన్నెలు సర్ది పడుకుంది.

ఊహించని సంఘటన
 మరుసటి రోజు పది దాటుతున్నా దీపక రూమ్‌లోంచి ఎలాంటి అలికిడి లేదు. రాత్రి భోజనం కూడా చేయకుండా గది తలుపులు వేసుకొని పడుకుంది. ఇప్పటికీ లేవలేదు. ఎన్ని సార్లు డోర్‌ కొట్టినా తలుపు తెరవలేదు. తల్లి ఎంత పిలుస్తున్నా కూతురు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి, దీపికను అదేపనిగా పిలిచాడు ప్రసాద్‌. అయినా ఎలాంటి అలికిడి లేదు. ఇంటి వెనకాల నుంచి వెళ్లి, కిటికీ డోర్‌ తీసి చూశాడు. కూతురు ఉరివేసుకొని కనపడటంతో ప్రసాద్‌ గుండె ఆగిపోయినంత పనయ్యింది.

ముంచేసిన కామెంట్స్‌
పోలీసులు దీపిక తల్లి తండ్రులనూ, ఇంటి చుట్టుపక్కల వారినీ విచారించారు. దీపిక ఆత్మహత్యకు కారణమేంటనేది తెలియలేదు. పోలీసులు దృష్టి దీపిక వాడుతున్న ఫోన్‌ మీద పడింది. పూర్తి డేటా తీసిన పోలీసులు దీపిక సోషల్‌ మీడియా పేజీలను కూడా చూశారు. దాంట్లో నెల రోజులుగా దీపిక పోస్టులకు అనుచితమైన కామెంట్స్‌ రావడం, దానికి దీపిక ఎదురు సమాధానాలు ఉండటం చూశారు. పాతికమందికి పైగానే దీపిక అప్‌లోడ్‌ చేసిన ఫొటోలకు ‘నువ్వో పెద్ద అందగత్తెవా!’ అని ఒకరు, ‘నీకంత సీన్‌ లేదు’ అంటూ ... ఎన్నో విపరీతార్థాలతో ఉన్న కామెంట్స్‌ ఉన్నాయి. కొన్నాళ్లుగా నెగిటివ్‌ కామెంట్స్‌కు తట్టుకోలేని దీపిక, వారికి ఘాటుగానే సమాధానాలు ఇచ్చేది. దీంతో దీపికను ఏడిపించేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది.

వాళ్లు ఎవరో, ఎక్కడ ఉంటారో కూడా తెలియని దీపిక ఈ నెగిటివ్‌ కామెంట్స్‌కి తనలో తనే కుమిలిపోతూ వచ్చింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే బాధపడతారని మౌనంగానే ఉండిపోయింది. మెసెంజర్‌ లో వచ్చే మెసేజ్‌లలో తప్పుడు కామెంట్స్‌ వచ్చేవి. వాటిని ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతూ ఉండేది. రోజు రోజుకీ దీపికలో అసహనం, కోపం తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తనపైన వచ్చే విమర్శలను తట్టుకోలేక దిగులుగా ఉండేది. తండ్రి అడిగితే ‘ఒంట్లో బాగోలేదని’ చెప్పేది. తల్లి అడిగితే మాత్రం కోపంగా విరుచుకుపడేది. విపరీతమైన ఒత్తిడికి లోనైన దీపిక ఆత్మహత్యా యత్నం చేసింది. పూర్తిగా శోధించిన పోలీసులకు వాళ్ల  కాలనీలోని అబ్బాయిలే ఆమెను టార్గెట్‌ చేశారని తెలిసింది.

ఆత్మహత్యకు రెండవ ప్రధాన కారణం..
ఏ తల్లిదండ్రులకైనా వారి అతి పెద్ద పీడకల ఏంటంటే తమ పిల్లల మరణానికి సాక్ష్యం ఇవ్వడం. ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం 2018లో 10,159 విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడితే 2019కి ఆ సంఖ్య 3.4 శాతం పెరిగిందని తన నివేదికలో పొందుపరిచింది. ప్రతి రోజూ 381 టీనేజర్లు ఆత్మహత్య లు చోటుచేసుకుంటున్నట్టు, దీంట్లో పరీక్షల్లో ఫెయిలవడం ఇతరత్రా కారణాలు మొదటి కారణంగా ఉంటే, సోషల్‌ మీడియానే రెండవ ప్రధాన కారణంగా ఉంటోందని పేర్కొంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉండే 67 శాతం టీనేజర్ల జీవితాలు అధ్వానంగా ఉన్నట్టు, 73 శాతం మంది ఇతరులకు తమ రూపాన్ని చూపించుకునే ఫొటోలు పోస్ట్‌ చేయడం పట్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు, 60 శాతం జనాదరణ కోసం, 80 శాతం మంది సోషల్‌ మీడియా డ్రామా ద్వారా ప్రభావితమవుతున్నారని పేర్కొన్నారు.

పది నుండి 14 ఏళ్ల వయసు గల బాలికలలో ఆత్మహత్య శాతం మూడు రెట్లు పెరిగిందని, సోషల్‌మీడియా వాడకం రోజుకు 2–3 గంటలపాటు ఏకధాటిగా ఉపయోగించే టీనేజర్లలో బాధ, ఆత్మహత్య టెండెన్సీ వంటి మానసిక  సమస్యలు పెరుగుతున్నాయని అమెరికా పిట్స్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు తమ నివేదికలో పొందుపరిచారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టీనేజర్లు ఉన్న తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.  

బ్లాక్‌ చేయడం మేలు
సోషల్‌ మీడియాలో అందరి మెప్పు పొందడం అనేది అసాధ్యం. వ్యతిరేక వ్యాఖ్యలు రావచ్చు అనే అవగాహన కూడా ఉండాలి. అలా వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. కావాలని రెచ్చగొట్టే వాఖ్యలకు పాల్పడుతున్నవారి అకౌంట్‌ను బ్లాక్‌ చేయడం అనేది మేలైన, సులువైన ఆప్షన్‌. లేదంటే, పట్టించుకోకుండా వదిలేయవచ్చు. కామెంట్స్‌ డిలీట్‌ చేసే ఆప్షనూ ఉంటుంది. దీనిని ఉపయోగించుకోవచ్చు. వచ్చిన ప్రతి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేయకుండా నిరోధించవచ్చు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉన్నట్టే వ్యతిరేక కామెంట్స్‌ పట్ల కూడా సరైన నిర్ణయం తీసుకునే సమర్థత మీ చేతుల్లోనే ఉంది. ఇతర వ్యక్తులు ఎలాగూ అగ్నికి ఆజ్యం పోయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి, వ్యతిరేక వ్యాఖ్యల çపట్ల మరింతగా  ప్రోత్సహించేవారిని కూడా అకౌంట్‌లో లేని విధంగా నియంత్రించుకునే అధికారం మన చేతుల్లోనే ఉందని గ్రహించాలి. 

– అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ  ఫౌండేషన్, హైదరాబాద్‌

గైడెన్స్‌ అవసరం
టీనేజర్స్‌లో ఒత్తిడి పెంచే వాటిలో సోషల్‌మీడియా వాడకం ప్రధానంగా ఉంటోంది. వీటిలో జరిగే రకరకాల నేరాలు ముఖ్యంగా అమ్మాయిలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నేరం జరిగేంత వరకు చూడకుండా తల్లిదండ్రులే ముందస్తు గైడెన్స్‌ ఇవ్వడం మంచిది. సోషల్‌మీడియా ప్రభావం గురించి టీనేజర్స్‌తో తల్లితండ్రులూ తరచూ సంభాషిస్తూ ఉండటం, వారి అకౌంట్స్‌ను గమనిస్తూ ఉంటే సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

దీపికా పాటిల్, స్పెషల్‌ ఆఫీసర్, (దిశా చట్టం అమలు విభాగం), ఆంధ్రప్రదేశ్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు