మానస స్వప్నం నిరుపేదలకు ఓపాడ్‌ ఇళ్లు

10 Apr, 2021 00:18 IST|Sakshi

సొంతింట్లో నివసించాలని కోరుకునే వారు మన సమాజంలో చాలామంది ఉంటారు. పేద, మధ్యతరగతి వారి  సొంతింటి కలను సాకారం చేసేందుకు 23 ఏళ్ల పేరాల మానస రెడ్డి సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. డ్రైనేజి నీటి పారుదల కోసం ఉపయోగించే.. పైపుల్లో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను అతి తక్కువ ఖర్చుకే అందించనున్నట్లు మానస ప్రకటించింది. ప్రకటించినట్లుగానే రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్‌ పైపు (తూము)లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్‌ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇల్లును నిర్మించి ఔరా అనిపిస్తోంది.

కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించింది మానస. తను మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మరణించడంతో మానసను, ఆమె చెల్లిని తల్లి ఎంతో కష్టపడి పెంచింది. చిన్నప్పటి నుంచి తల్లి పడుతోన్న కష్టాలను దగ్గర నుంచి చూస్తూ పెరిగిన మానస... తల్లి ప్రోత్సాహంతో ‘లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ’లో సివిల్‌ ఇంజనీరింగ్‌లో బి.టెక్‌ పూర్తిచేసింది. ఇంజినీరింగ్‌ అయిన తరువాత మరో ఆరు నెలలపాటు కొత్త కొత్త ఇళ్ల నిర్మాణ నమూనాలపై ఆమె పరిశోధనలు చేసింది. పరిశోధనలో భాగంగా జపాన్, హాంగ్‌కాంగ్, ఇతర ప్రదేశాల్లో అక్కడి వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా నిర్మించిన ఇళ్ల నమూనాలపై లోతుగా అధ్యయనం చేసింది. వీటి ఆధారంగా మన దేశంలోని వాతావరణానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో ఎలాంటి ఇంటిని నిర్మించవచ్చో నిర్ణయించుకుని కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పెట్టడానికి రిజిస్టర్‌ చేసుకుంది. నిరుపేద కుటుంబాల కోసం 12 రకాల డిజైన్లు రూపొందించగా... ఇప్పుడు ఒక నమూనాతో ‘ఓపాడ్‌’ ఇంటిని నిర్మించింది.

 ఓపాడ్‌..
సిమెంటు తూములు (పైపు)ల్లో నిర్మించే ఈ ఇళ్లు చిన్నగా... చూడముచ్చటగా కనిపిస్తాయి. ఓపాడ్‌ లో ఒక బెడ్‌రూమ్, కిచెన్, హాల్, వాష్‌రూమ్‌లు ఉంటాయి. వస్తువులను పెట్టుకునేందుకు అల్మారాలు, ఎలక్ట్రిసిటీæ, వాటర్, డ్రైనేజీ సదుపాయాలు ఉంటాయి. పైపు పైన లాంజ్‌ లాంటి బాల్కనీ కూడా ఉంది. ఈ ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు సౌకర్యంగా జీవించవచ్చు. ఇండియాలోనే తొలిసారి నిర్మించే ఈ ఓపాడ్‌ ఇళ్లు 40 నుంచి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 రోజుల్లో నివసించడానికి వీలుగా తయారవుతుంది. ‘‘అన్ని వాతావరణ పరిస్థితుల్లో అటూ ఇటూ కదపగల ఈ ఇళ్లæజీవిత కాలం వందేళ్లు అని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని మానస చెప్పింది. సరికొత్త ఓపాడ్‌ ఇళ్లలో డబుల్, త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను త్వరలో నిర్మించనున్నట్లు తెలిపింది.

ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ..‘‘పట్టణాలు, గ్రామాలు, స్లమ్స్‌లో నివసించే వారు ఎక్కువగా పూరి గుడిసె ల్లో నివసిస్తుంటారు. వర్షం పడిందంటే ఇళ్లలోకి నీరు చేరడం, పైకప్పు నుంచి వర్షం కురవడం, కొన్నిసార్లు నీటి ప్రవాహానికి ఇళ్లు కొట్టుకుపోవడం వంటివి సంభవిస్తుంటాయి. నేను బి.టెక్‌ చదివేటప్పుడు ఇటువంటి సందర్భాలెన్నింటినో దగ్గరగా గమనించాను. సమస్యలు ఏవీ ఎదురుకాని ఇళ్లను నిర్మించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో తయారయ్యే ఓపాడ్‌ ఇళ్లను నిర్మిస్తున్నాను. ఈ ఇళ్లు ఎంతో చల్లగా ఉండడంతో పాటు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. నిరుపేదలకోసం రూపొందించిన ఈ డిజైన్లలో కొన్ని రెస్టారెంట్లు, రిసార్టులు, మొబైల్‌ హోమ్స్, మొబైల్‌ క్లినిక్‌లు, గెస్ట్‌ హౌస్, గార్డులు నివసించే రూములుగా కూడా ఉపయోగపడతాయి’’ అని వివరించింది.

 మానస తల్లి రమాదేవి మాట్లాడుతూ.. మా అమ్మాయి మానసకు వచ్చిన ఐడియాను మొదట్లో ఎవరూ ప్రోత్సహించలేదు. కానీ ఇప్పుడు ఎంతోమంది తన డిజైన్స్‌ గురించి మెచ్చుకోవడం నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. మానస నిరుపేదలు ఖర్చుచేయగల సరసమైన ధరలకు ఇళ్లను నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అని రమాదేవి చెప్పారు.

తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ అండ్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ కార్యదర్శి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ... మానసకు వచ్చిన ఆలోచన కొత్త ఆవిష్కరణలకు పునాది వేసేదిగా ఉంది. ఇది తన విజయ ప్రస్థానంలో కేవలం ప్రారంభం మాత్రమే. ముందుముందు తను మంచి విజయాలను అందుకుంటుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. మానస  చెంగిచెర్లలో డెమో కోసం నిర్మించిన ఓపాడ్‌ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.                    

తల్లి రమాదేవితో మానస

మరిన్ని వార్తలు