కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా!

13 Dec, 2022 12:48 IST|Sakshi

‘ఊరు గాదు అడవి గాదు మాట్లాడే మనిషి లేడు ఒంటరి బతుకై పాయే ఒంటెలతో చావాయే దిక్కు మొక్కు లేని గల్ఫ్ బతుకవాయెనే కొడుకు చితికి పాయెనే!' అంటూ 'ఎడారి బతుకులు' కవితలో వాపోయాను. నిజమే కాని మన ఊర్లో మన కళ్ళ ముందు మన పశువుల కాపర్లు పడే కష్టాలు తక్కువేం కాదు సుమా!

ఇంత చద్దన్నం కట్టుకొని వెళ్లిన వారు పొద్దంతా ఆ నోరులేని జీవాలతో వేగడం,రాత్రికి గాని ఇల్లు చేరలేకపోవడం అత్యంత కష్టమైన పనే కదా! ఒకప్పుడు సంపదంటే పశువులే. వాటితోనే పాడి, వ్యవసాయం, ప్రయాణాలు కూడా. అలాంటి పశువులు, వాటి పోషణే నేటికీ చాలా మంది బతుకు దెరువు మరి.

అలా పశువులు కాస్తూ మంద నుండి తప్పిపోయిన ఒక గేదెను వెతుకుతూ కొండపైకి వెళ్లిన, ప్రస్తుత జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన సింగం సంజీవుడికి పొదల్లో హనుమంతుడి విగ్రహం కనబడిందట. మరునాడు భార్య ఆశమ్మతో కలిసి వచ్చి ఆ స్వయంభూ స్వామిని వెలుగులోకి తెచ్చి, దానికో చిన్న గుడికట్టి, అందరికన్నా ముందు కొండగట్టు ఆంజనేయుడికి మొక్కిన వారు ఆ గొల్ల దంపతులు.

ఇది దాదాపు నాలుగైదు వందల సంవత్సరాల నాటి మాట. ఆ తర్వాతి కాలంలో కృష్ణారావు దేశముఖ్ అనే దొరవారు ఆ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడంవల్ల స్వామివారి దర్శనానికి వచ్చి పోయే భక్తుల సంఖ్య పెరగడం, 1968 లో దాని నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖవారు చేపట్టడం జరిగింది. చాత్తాద వైష్ణవులే ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించేది.

జగిత్యాల జిల్లా కేంద్రానికి 15 కి మీ దూరంలో, కరీంనగర్ హైవే పైనున్న కొండగట్టు దేవస్థానం ఏడాది పొడుగునా వచ్చిపోయే హనుమాన్ భక్తులతో కళకళలాడుతుంటుంది. 'ఆంజనేయ స్వామి దీక్ష'ల కాలంలో ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత భక్త జనం. అయితే ఇక్కడ సరియైన రోడ్లు లేకనే చాలా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలకు జవాబా అన్నట్లుగా ఇటీవలే జగిత్యాల జిల్లా సందర్శనకు వచ్చిన రాష్ట్ర ముఖ్య మంత్రి కేసిఆర్ ఈ ఆలయ అభివృద్ధికి వంద కోట్లు ప్రకటించడం విశేషం.

'బల్మూరి కొండాలరాయుడా నీ చరిత పౌరుషానికి మారు పేరురా!' అని ఇక్కడ జానపదులు పాడుకునే పాట. మానాల, పొలవాస, ఎలగందుల నుండి గోల్కొండ వరకు పేరు గాంచిన కొండాలరాయుడు ఈ గట్టును తన స్థావరంగా వాడుకున్నాడని అందుకే దీన్ని కొండగట్టు అన్నారని కొందరంటారు.

సంజీవుడు ఆశమ్మలు ఆంజనేయస్వామికి చేసిన సేవలకు శాసనాధారం కూడా చూపుతున్నారు కాబట్టి ఆ గొల్ల దంపతుల విగ్రహాలు, పౌరుషానికి మారు పెరైన కొండలరాయుడి విగ్రహము కూడా కొండగట్టుపై పెట్టడం సమంజసంగా ఉంటుంది.


-వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ నుంచి...
చదవండి: Sagubadi: అల్సర్‌ని తగ్గించిన అరటి! బేబీ ఫుడ్‌ రకాలు! 10 పిలకల ధర 4,200! సాగు చేస్తే..

మరిన్ని వార్తలు