Sirisha Bandla: అంతరిక్షంలో తెలుగు ధీర

3 Jul, 2021 02:59 IST|Sakshi

అంతరిక్షం అచ్చ తెలుగులో ‘నమస్కారం’ అనే పలకరింపు విననుంది. కోట్లాదిమంది తెలుగువారి చారిత్రక, జీవన పరంపరకు ప్రతినిధిగా ఒకరు తన వద్దకు వచ్చినందుకు అది విస్మయపు ముచ్చటపడనుంది. యుగాలుగా తల ఎత్తి తెలుగువారు దిగంతాలలో చూపు గుచ్చి ఉంటారు. ఇవాళ పై నుంచి ఒక తెలుగమ్మాయి మనకు చేయి ఊపి హాయ్‌ చెప్పనుంది. అవును. చరిత్రలో తొలిసారిగా తెలుగు ధీర శిరీష బండ్ల అంతరిక్ష ప్రయాణం కట్టనుంది.

అంతరిక్షయానం చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఇది సామాన్యుల ఊహకు అందేది కాదు. శ్రీమంతులు అందుకోగల ఆలోచనా కాదు. అంతరిక్ష శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు మాత్రమే సాధ్యమయ్యే ఈ జాబితాలో ‘కమర్షియల్‌ స్పేస్‌క్రాఫ్ట్‌’ ద్వారా ఇటీవల అత్యంత సంపన్నులు చేరుతున్నారు. టెస్లా సి.ఇ.ఓ ఎలాన్‌ మస్క్‌ నుంచి అమెజాన్‌ వ్యవస్థాపకులు జెఫ్‌ బెజోస్‌ వరకూ అంతరిక్షం అంచులు తాకాలనువారు ఈ రేస్‌లో ఉన్నారు. అటువంటిది– ఈ అద్భుత ప్రయాణం చేసే అవకాశం మన తెలుగింటి అమ్మాయి బండ్ల శిరీషకు దక్కింది. ఇది ఒక చరిత్రాత్మక అవకాశం. తెలుగువారి చరిత్రలో తొలి అంతరిక్ష యానం చేసిన వ్యక్తిగా/మహిళగా బండ్ల శిరీష ఎప్పటికీ నిలిచిపోతుంది. వర్జిన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత రిచర్డ్‌ బ్రాన్సన్‌తో కలిసి మరో తొమ్మిదిరోజుల్లో శిరీష రోదసిలో అడుగుపెట్టబోతోంది.

చీరాలలో పుట్టింది
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాపర్ల వెంకట నరసయ్య, రమాదేవిల కుమార్తె అనూరాధ సంతానం శిరీష. అనురాధ భర్త డాక్టర్‌ బండ్ల మురళీధర్‌ ఒక్లహామా స్టేట్‌ యూనివర్సిటీలో ప్లాంట్‌ వైరాలజీలో పీహెచ్‌డీ చేసి అమెరికాలో స్థిరపడడంతో చీరాలలో పుట్టిన శిరీష నాలుగేళ్ల వయసులో తన అక్క ప్రత్యూషతో అమెరికా వెళ్లింది. శిరీష విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. చిన్నప్పటి నుంచి స్పేస్‌సైన్స్‌ను అమితంగా ఇష్టపడే శిరీష పర్డ్యూ యూనివర్సిటిలో ఏరోనాటికల్‌ అండ్‌ అస్ట్రోనాటికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ అయ్యాక కమర్షియల్‌ స్పేస్‌ఫ్లైట్‌ ఫెడరేషన్‌ (సీఎస్‌ఎఫ్‌)లో ఏరోస్పేస్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ అధునాతన విమాన విడిభాగాలను రూపొందించేది.

మరోపక్క జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది.‡ఈ క్రమంలోనే  2015లో రిచర్డ్‌ బాన్సన్‌ ‘స్పేస్‌ఫ్లైట్‌’ సంస్థ ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా చేరిన  అంచెలంచెలుగా ఎదిగి పరిశోధనా విభాగంలో వైస్‌ప్రెసిడెంట్‌ బాధ్యతలు నిర్వహిస్తోంది. వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తో్తన్న వర్జిన్‌ ఆర్బిట్‌ వ్యహారాలను చూస్తూ, మరోపక్క అమెరికన్‌ ఆస్ట్రోనాటికల్‌ అండ్‌ ఫ్యూచర్‌ స్పేస్‌ లీడర్స్‌ ఫౌండేషన్‌ బోర్డు డైరెక్టర్లలో సభ్యురాలిగా, పర్డ్యూ యూనివర్సిటీ యంగ్‌ ప్రొఫెషనల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ సభ్యురాలిగా ఉంది. ఫలితంగా ఆమెకు అంతరిక్షయానం అవకాశం దక్కింది.

బ్రాన్సన్‌తో కలిసి
వర్జిన్‌ గెలాక్టిక్‌ నిర్వహించనున్న నాలుగో స్పేస్‌ ట్రిప్పులో వర్జిన్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ తనతో కలిపి మొత్తం ఆరుగురు టీమ్‌తో పాల్గొననున్నాడు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు స్పేస్‌ స్పెషలిస్టులు ఉన్నారు. శిరీష ఈ స్పేస్‌ స్పెషలిస్టుల్లో ఉంది. ఈ నెల 11వ తేదీన  తెల్లవారుజామున వీరి స్పేస్‌క్రాఫ్ట్‌ న్యూమెక్సికో నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనితో అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి ప్రైవేటు ధనిక వ్యక్తిగా రిచర్డ్‌ బ్రాన్సన్, స్పేస్‌లో అడుగుపెట్టిన తొట్టతొలి తెలుగమ్మాయిగా శిరీషలు చరిత్ర సృష్టించనున్నారు. కల్పనా చావ్లా తర్వాత భారత్‌లో పుట్టి స్పేస్‌లో అడుగుపెట్టబోతున్న రెండో మహిళగానూ, రాకేష్‌ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ తరువాత భారత సంతతి నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న నాలుగో వ్యోమగామిగా శిరీష నిలవడమే గాక  ఈ మిషన్‌లో వెన్నెముకగా పనిచేయనుంది. ఈ క్రూ టీమ్‌లో శిరీషతోపాటు బెత్‌ మోసెస్‌ అనే మరో మహిళ కూడా ఉన్నారు.
 
నా మనసంతా అంతరిక్షమే
‘‘నేను చిన్నప్పటి నుంచి వ్యోమగామి అయి అంతరిక్షంలోకి వెళ్లాలని అనుకునేదాన్ని. ఎప్పుడూ అందుకు సంబంధించిన ఆలోచనలతో నా మనసు నిండిపోయి ఉండేది. హ్యూస్టన్‌లో మా ఇంటికి దగ్గర్లో జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌ ఉండేది. ఆ సెంటర్‌ను సందర్శించినప్పుడల్లా నా కోరిక మరింత బలపడేది. ముందు పైలట్‌ అవ్వాలి ఆ తర్వాత నాసాలో వ్యోమగామి అవ్వాలి  అనుకుని ఆ దిశగా అడుగులు వేద్దామనుకున్నాను. కానీ స్కూల్లో ఉన్నప్పుడే నా కంటి చూపు సరిగా ఉండేది కాదు. దీంతో పైలట్టే కాదు ... ఆస్ట్రోనాట్‌ కూడా కాలేను అనుకున్నాను.

అయితే 2004లో తొలి ప్రైవేటు వాహనం అంతరిక్షంలోకి వెళ్లిందని తెలిసి నాసా ద్వారానే కాదు వ్యోమగామి అయ్యేందుకు మరో మార్గం ఉందనిపించింది. దీంతో అప్పుడు ఏరో స్పేస్‌ ఇంజినీర్‌ అయ్యి వాణిజ్య స్పేస్‌ సెక్టార్‌లో పని చేయవచ్చని అనుకున్నాను. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు మైక్రో గ్రావిటీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఆ తరువాత నేను సీఎస్‌ఎఫ్‌లో చేసిన  ఉద్యోగానుభవం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నా చిన్ననాటి కల ఈరోజు తీరనున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ శిరీష గతంల ఒక ఇంటర్వ్యూలో  చెప్పింది.

తాతయ్య మాట
‘శిరీషకు ఊహ తెలిసినప్పటి నుంచి అంతరిక్షంపై ఆసక్తి కనపరిచేది. వయసుతోపాటు, ఆకాశం, విమానాలు, రాకెట్లపై ఆసక్తి పెరుగుతూనే వచ్చింది. నాలుగేళ్ల వయసులో ఓ రోజు ఇంట్లో కరెంటు పోతే ఒంటరిగా భయపడుతోన్న అమ్మమ్మకు ధైర్యం చెప్పింది’ అని తాతయ్య నరసయ్య సాక్షితో చెప్పారు. ‘2016లో మా వివాహ స్వర్ణోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి శిరీష ఇక్కడకు వచ్చింది. చదువు, ఉద్యోగంతో ఎంత బిజీగా ఉన్నా తరచూ ఫోనులో మా యోగక్షేమాలు తెలుసుకునేది. చిన్నపిల్లగానే మాకు తెలిసిన శిరీష ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లనుందని చెబుతుంటే ఆశ్చర్యంగా, అంతకుమించిన సంతోషంగా ఉంది’ అన్నారు.

– పి.విజయ, సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌
ఇన్‌పుట్స్‌: బి.ఎల్‌. నారాయణ, సాక్షి, తెనాలి

మరిన్ని వార్తలు