సెకనున్నర మాత్రమే శిష్యరికం చేశా.. చల్తాహై!

12 Nov, 2022 20:24 IST|Sakshi

అన్వర్

నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగారు ఒక కుటుంబం. ఆ ఇంట్లోని అబ్బాయే రాము. నా వయసు వాడే. మాటా మాటా కలిశాకా తెలిసింది తనూ ఆర్టిస్ట్ అని, బొమ్మలు వేస్తాడని. చూపించాడు కూడా. బోలెడంత పద్దతైన ప్రాక్టీసు, పోస్టర్ కలర్స్ తో వేసిన చక్కని పెయింటింగ్స్. నేను థ్రిల్లై పోయా ఆ బొమ్మలు చూసి. 

నన్ను నేనూ ఆర్టిస్ట్ అని చెప్పుకునే వాణ్ణే కానీ, రామూలా నా దగ్గర వేసిన బొమ్మల ఆధారాలు ఏమీ ఉండేవి. ఊరికే  హృదయం ఆర్టిస్ట్ అని ఉన్నదంటే ఉన్నది అంతే. అప్పుడే కాదూ. ఇప్పుడూ అంతే. మరప్పుడయితే రామూని అడిగా ఇంత బాగా బొమ్మలు ఎట్లా వేస్తావు రామూ అని. నంద్యాలలో గుడిపాటి గడ్డ వీధిలో గణేష్ బాబు అనే ఆర్ట్ టీచర్ ఉన్నారు ఆయన దగ్గర నేర్చుకున్నా అన్నాడు. సరేని నేను మా ఇంకో ప్రెండ్ వీర శేఖర్ ఇద్దరం కలిసి గురువు గణేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళామో, లేదా రామూనే తీసుకెళ్ళాడో కూడా నాకిప్పుడు గుర్తు లేదు. ఆ ఇంట్లో బొమ్మలు నేర్చుకునే నిమిత్తం ఇంకా మావంటి వాళ్ళు బొలెడు మంది ఉన్నారు.

ఆయన మా ఇద్దర్ని ఒక మూలలో కూర్చోపెట్టి మా నోట్ పుస్తకంలో ఒక ఏనుగు  బొమ్మ గీసి ఇచ్చి దాన్ని దిద్దమన్నాడు. నేను దాన్ని దిద్దనవసరం లేకుండా ఆ పక్క పేజీలో మరో ఏనుగు  బొమ్మని సెకనున్నరలో వేసి ఆయనకు చూపించా. ఆయన అరే! భలే! అని  నన్ను మెచ్చుకోకుండా, అలా స్వంతంగా బొమ్మలు వేయకూడదు. ఒక వారం పాటు నేను గీసి ఇచ్చిన బొమ్మ మీదే దిద్దుతూ ఉండాలి అని చెప్పాడు. నేను ఊరికే సరేనని ఆయన వేపు తల ఊపి ఆ ఇంటి గుమ్మం వేపుగా బయటికి వచ్చేసా. అప్పుడు లోపల శేఖర్ ఏమయ్యాడో తెలియదు. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మేమిద్దరం ఆ క్రాష్ కోర్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆ సెకనున్నర శిష్యరికం తరువాత నేనెవరిని ఇక నా  గురువుగా అపాయింట్ చేసుకోలేదు. అనగననగ -తినగ తినగ పథకం కింద నా బొమ్మలు నేనే వేసుకుంటూ,  వాటిని దిద్దుకుంటూ చల్తాహై. 

ఆ విధంగా రుద్దుడూ దిద్దుడూ అనేది  బొమ్మల్లోనే కాదు. కుట్టు పని అనే టైలరింగ్ లో కూడా ఉంటుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకనో, బడి మీద, చదువు మీద ఆసక్తి లేకనోఉండే పిల్లలు ఖాళీగా ఉండి నాశనం పట్టకూడదని కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలని ఏ టైలర్ దగ్గరో పని నేర్చుకోవడానికో పెడతారు. కొంతమంది పిల్లలయితే రాత్రింబవళ్ళు  కష్టపడి పని చేసి జీవిత వృద్దిలోకి వద్దామనే పూనికతో  కూడా వాళ్లకై వాళ్ళే ఏ టైలర్ మాస్టర్ దగ్గరో కుదురుకుంటారు. ముఫై రోజుల్లో మిషిన్ కుట్టుడు నేర్చెసుకుని, తమ కాలి క్రింద తిరిగే మిషిను చక్రం అలా తిరుగుతూ తిరుగుతూ అంబాసిడర్ కారు చక్రంలా మారి తమ గుడిసే ముందు బ్రేకు వేసి ఆగుతుందనే తెలుగు సినిమా భ్రమలో ఉంటారు.

తెలుగు సినిమా కాదు కదా కనీస తెలుగు కథల్లో మాదిరిగానైనా దర్జి జోగారావు దగ్గర శిష్యరికం చేసిన బాబిగాడు తన గాళ్ ప్రెండు పోలికి చాలని జాకెట్టు మాదిరి తుంట రవిక కుట్టడం కూడా వారికి కుదరదు. ఎందుకంటే టైలరింగ్ నేర్చుకోడానికి నువ్వు అందరికంటే ముందుగా పొద్దున్నే షాపు దగ్గరికి చేరాలా, మూలనున్న చీపురు పట్టి అంగడి లోపలా ఆపై బయట చీలికలు పీలికలైన గుడ్డ ముక్కలన్నీ శుభ్రంగా ఊడ్చేసి ఆపై వంగిన నడుముని అమ్మాయ్యా అని పట్టు దొరికించుకునేలోగా కటింగ్ మాష్టరు వస్తాడు. ఓనామహా శివాయహా అనే ఒక పాత బట్ట ముక్కకి కత్తిరతో ఒక గాటు పెట్టి దానిని నీ చేతిలో పెట్టి  కాజాలు ప్రాక్టీస్ చెయ్యమంటాడు. కాజాలు కుట్టి కుట్టి వేలికి కన్నాలు వేసుకోవడం ఎలాగూ ప్రాక్టీస్ అయ్యేలోగా మళ్ళీ గుడ్డ ముక్కల చీలికలు పీలికలు షాపు నిండా చేరుతాయి. వాటిని చీపురు పట్టి శుభ్రం చేసి మళ్ళీ నువ్వు కాజాలకు కూచోవాలా! అనగనగా ఆ కాలానికి గడియారంలో రెండే ముల్లులు. ఒకటి పీలికలు- రెండు కాజాలు. గడియారం అలా గడిచి గడిచి నీకు ఎప్పుడో  ఒకప్పుడు, ఒక  మంచి కాలం వచ్చే వరకు నువ్వు గురువుగారి దగ్గరే ఓపిగ్గా పడి ఉంటే అప్పుడు గడియారంలో సెకన్ల ముల్లు కూడా చేరి అంగీలకు, ప్యాంట్లకు, నిక్కర్లకు గుండీలు కుట్టే పని దగ్గరకు నెట్టబడతావు . 

అయితే  నే చెప్పబోయేది ఇదంతా బొమ్మలు వేయడం, కాజాలు కుట్టడం గురించి కథలూ, గాథలు కబుర్లు కావు. ఇంటి గోడమీద వేలాడే క్యాలెండర్ కు గుచ్చబడి ఉండే ఒక సూది పుల్ల కథ. ఈ రోజుల సంగతి నాకు తెలీదు. నా చిన్ననాటి రోజులలో కుట్టు మిషన్ షాపు దాక నడక పడకుండానే చిరుగులు పడ్డ బట్టలపై చిన్నా చితక కుట్టు సంగతులు వేసేంత జ్ఞానం ఇంట్లో ఆడవాళ్లందరికీ వచ్చి ఉండేది. మగవాళ్ళకు కూడా తెలిసి ఉండేది. అయితే ఈ పనులన్నీ ఎక్కువగా ఇళ్ళల్లో ఉండే అమ్మమ్మలో, నాయనమ్మలో చక్కగా ముచ్చటలు చెప్పుకుంటూ సాగించేవారు. పని నడిపించడం సులువే! అయితే వారి కష్టమంతా సూదిలోకి దారం ఎక్కించడమే కష్టంగా ఉండేది. పెరిగిన వయసులో కంటి చూపుకు, సూది బెజ్జానికి, దారపుమొనకు ఎక్కడా సామరస్యం కుదిరేది కాదు.

ఎప్పుడెప్పుడు సూదిలో దారం ఎక్కించమని జేజి అడిగేనా, దారం ఎక్కించేందుకు పిల్లలు పోటా పోటీగా సిద్దం. దారం ఎక్కిద్దామని సూది దారం తీసుకున్న అన్నకో చెల్లాయికో ఒక నిముషమన్నా సమయమివ్వాలా? వాడి గురి కాస్త తప్పితే చాలు ఇలా తేని మరొకడు ఆ సూద్దారం లాక్కుని ఎంగిలితో దారం తడి చేసుకుని, నోట్లో నాలుక మొన బయటపెట్టి, ఒక కన్ను మూసి మరో కన్నుతో చెట్టుమీద పిట్టకన్ను దీక్షతో చూసే అర్జునుడయ్యేవాడు. నాలుక మొన అంటే గుర్తుకు వస్తుంది పిల్లలని చక్కగా తమ ముందు కూర్చో పెట్టుకుని నోట్లో నాలుకని చాపి తమ సూది ముక్కుల అంచులకు తాకించి నీకు చాతనవునా ఇలా తగిలించడం అని గేలి చేసే మేనత్తల సంతతి ఇంకా ఎక్కడైనా మిగిలే  ఉందా?  మొబైల్ ఫోన్ ల కేలండర్ ఆప్ లకు గుచ్చ జాలని సూదులని ఏ గడ్డి వాములోనో వెతికి పట్టుకుని ఆ సూది తొర్ర గూండా చూపు పోనిస్తే బెజ్జానికి ఆవల సెలవంటూ వెళ్ళి పోయిన వేలాది అమ్మమ్మా నానమ్మల తమ మనవ సంతానంతో పకపకల వికవికల వివశమవుతు కనపడుతున్నారు. పిల్లల చేతుల్లో మొబైలు గేముల పలకలు కాదు. తెల్లని సూదులు చురుక్కుమని మెరుస్తున్నాయి. వేలాది దారపు ఉండలు రంగు రంగుల గాలి పటాల వలే గాలిలోకి ఎగురుతున్నాయి. జ్ఞాపకం ఎంత విలువైనది. జీవితం ఎంత అందమైనది.  

మరిన్ని వార్తలు