105 రోజుల వినోద క్వారంటైన్‌

6 Sep, 2020 00:46 IST|Sakshi

కరోనా వచ్చినా, వస్తుందనే సందేహం వచ్చినా క్వారంటైన్‌కి వెళ్లాలి. ఆ క్వారంటైన్‌ పద్నాలుగు రోజులే. కాని పదహారు మంది కంటెస్టెంట్‌లు 105 రోజుల క్వారెంటైన్‌కి వెళ్లే సీజన్‌ వచ్చింది. బిగ్‌బాస్‌ 4 సీజన్‌. ఇక వీరి ఆటలు, పాటలు, తగువులు, తీర్పులు, ఎంట్రీలు, ఎగ్జిట్‌లు అన్నీ ప్రేక్షకులవి కూడా కాబోతున్నాయి. కరోనా చికాకును కాస్తయినా దూరం చేసే భారీ డైలీ డ్రామా బిగ్‌బాస్‌ 4.

కెమెరా కళ్లున్న ఇల్లు. అనుక్షణం నిఘా. ప్రతి కదలికను వెంటాడే చూపు. ప్రవర్తనపై తీర్పు. అంతలోనే స్నేహం. అంతలోనే వైరం. ఇంట్లోకి అడుగు పెడుతుంటే స్వాగతం. వీడ్కోలు తీసుకుంటూ ఉంటే దుఃఖం. స్టార్‌ మాలో ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ షోలో లేని డ్రామా లేదు. అంత వరకూ ముక్కూముఖం అంతా తెలియని వారు, పాత స్నేహం ఉన్నవారు పూర్తిగా కొత్తగా మారి కొత్త జీవితం జీవించడమే ఈ షో విశేషం. అందరి లక్ష్యం ఒక్కటే. అంతిమ విజేతగా నిలవడం. కాని ఆ ప్రయాణం అంత సులువు కాదు. మనుషులను ఓడించి, జయించి, బాధించి, సంతోషపరిచి ఆ స్థానానికి వెళ్లాలి. ప్రతి సందర్భంలోనూ ఒకటే సవాల్‌. లోపల ఉన్న మంచిని బయటకు తేవాలా.. చెడును బయటకు తేవాలా. ఆ ప్రవర్తనకే ఓట్లు పడతాయి. ఆ వ్యక్తిత్వాన్నే ప్రేక్షకులు గెలిపిస్తారు. ఇదంతా ప్రతి రోజూ గుక్క తిప్పుకోనివ్వకుండా కొనసాగుతుంది.

ఈసారి హోస్ట్‌ ఎవరు?
బిగ్‌బాస్‌ షో నిర్వహణ ఎంత ముఖ్యమో హోస్ట్‌ను నియమించడం కూడా అంతే ముఖ్యం. ఎన్‌.టి.ఆర్‌ హోస్ట్‌గా పెద్ద బ్యాంగ్‌తో మొదలైన ఈ షో ఆ తర్వాత నాని, నాగార్జునలతో అదే మీటర్‌ను కొనసాగించింది. బిగ్‌బాస్‌ 4కు మళ్లీ ఎన్‌.టి.ఆర్‌ హోస్ట్‌ కావచ్చన్న వార్తలొచ్చాయి. ఒక దశలో మహేశ్‌బాబు పేరు వినిపించింది. కాని బిగ్‌బాస్‌కు హోస్ట్‌ చేసే చాన్స్‌ మళ్లీ నాగార్జునకే దక్కింది. కరోనా వల్ల సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన నేపథ్యంలో నాగార్జున కూడా మరోసారి ఈ షోను హోస్ట్‌ చేయడం ఒక ఆసక్తికర వృత్తిగత కార్యకలాపంగా భావించి ఉంటారు. నాగార్జున నిర్వహించిన బిగ్‌బాస్‌ 3 విజేతగా గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ నిలిచాడు. ఈసారి ఎవరు నిలుస్తారో చూడాలి.

కంటెస్టెంట్‌లు ఎవరు?
పాల్గొనే వరకు కంటెస్టెంట్‌లు ఎవరు అనే విషయమై సస్పెన్స్‌ ఉంచడం బిగ్‌బాస్‌ షో ఆనవాయితీ. అయితే ఇంతకు ముందు పద్ధతి వేరు. ఇప్పుడు పద్ధతి వేరు. గతంలో కంటెస్టెంట్లను షోకు రెండు మూడు రోజుల ముందు తమ అధీనంలోకి తీసుకునేవారు. కాని ఇప్పుడు కరోనా వల్ల రెండు వారాల ముందు నుంచే వారిని తమ అధీనంలోకి తీసుకోవడం, పరీక్షలు నిర్వహించడం తతిమా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఆగస్టు నెలాఖరుకు టెలికాస్ట్‌ కావాల్సిన షో సెప్టెంబర్‌ 6కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌ల పేర్లు కొన్ని బయటకు తెలియసాగాయి. నటుడు తరుణ్, నటి శ్రద్ధా దాస్, గాయని సునీతల పేర్లు మొదట వినిపించినా వారు తమ పార్టిసిపేషన్‌ను కొట్టి పారేశారు. 

ప్రస్తుతానికైతే వార్తల్లో ఉన్న పేర్లు ఇవి–
1. లాస్య మంజునాథ్‌ (టీవీ నటి), 2. మహాతల్లి జాహ్నవి (యూట్యూబర్‌), 3. గంగవ్వ (యూట్యూబర్‌– విలేజ్‌ స్టార్‌), 4.సుజాత (టివి యాంకర్‌), 5.అవినాష్‌ (స్టాండప్‌ కమెడియన్‌), 6. సత్య (న్యూస్‌ రీడర్‌), 7.సుహైల్‌ రెయాన్‌ 8. సూర్యకిరణ్‌ (డైరెక్టర్‌), 9. అభిజిత్‌ (హీరో), 10. అమ్మ రాజశేఖర్‌ (దర్శకుడు).  11. దివి వైద్య (నటి). మిగిలిన ఐదుగురిలో ఇద్దరు హీరోయిన్లు, ఒక మ్యూజిక్‌ చానెల్‌ యాంకర్‌ ఉంటారని తెలుస్తోంది. ఈ 16 మంది కాకుండా అడిషిషనల్‌ కంటెస్టెంట్‌లను కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. కరోనా ఆటంకాల వల్ల, ఇతరత్రా ఇబ్బందుల వల్ల వీరిలో ఎవరు పాల్గొంటారో కొత్తగా ఎవరు జతవుతారో ఇవాళ సాయంత్రం తెలిసిపోతుంది.

కత్తి మీద సాము
ఏమైనా ఈసారి బిగ్‌బాస్‌ షో నిర్వహణ కత్తి మీద సాము. గెస్ట్‌లు హౌస్‌లోకి రావాలన్నా, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు హౌస్‌లోకి రావాలన్నా అప్పటికప్పుడు అయ్యే పని కాదు. కరోనా ప్రొటోకాల్‌ను పాటించి చేయాలి. అదీగాక బిగ్‌బాస్‌ షో నిర్వహణ లో కనీసం వంద మంది శ్రమించాల్సి ఉంటుంది. వీరంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే హౌస్‌లో ఉన్నవారికి కూడా కరోనా రావచ్చు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రేక్షకులు ఉత్కంఠగా ఉన్నారన్నది వాస్తవం. ఇల్లు అంతగా కదల్లేని ఈ రోజుల్లో, థియేటర్ల మూసివేత కొనసాగుతున్న ఈ రోజుల్లో ఇంట్లోకి రానున్న వినోదం వారిని ఉల్లాసపరుస్తుందనే ఆశిద్దాం.
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

మరిన్ని వార్తలు