పిల్లల కథ: ఎగిరే కొండలు

25 Oct, 2022 19:40 IST|Sakshi

రజిత కొండసాని 

సీతాపురం గ్రామం మొదట్లోనే.. ఒక పెంకుటిల్లు ఉంది. అందులో తన కొడుకు, కోడలుతో బాటుగా చిన్నవాడైన తన మనవడితో కలసి ఒక అవ్వ జీవిస్తోంది. కొడుకు, కోడలు పగలు పనికి వెళితే.. అవ్వ మనవడిని చూసుకునేది. రాత్రి అవగానే ఒక కథైనా చెప్పనిది మనవడు నిద్రపోయేవాడు కాదు. రోజూ రాజుల కథలు చెప్పి మనవడిని నిద్రపుచ్చేది, ఆ రోజు బాగా వెన్నెల కాస్తోంది. మనవడితో బాటు ఆరుబయట తాళ్ళ మంచంపై పడుకుంది అవ్వ. 

‘కొండపైన అనేక రకాల పక్షులు ఉన్నాయి. అవి బాగా ఎగరగలవు. కొండకు కూడా రెక్కలు వుంటే ఎంత బాగుండేదో కదా అవ్వా..’ అన్నాడు మనవడు. మనవడి ప్రశ్నకు అవ్వ ఆశ్చర్యబోయింది ‘అవునూ.. ఎప్పుడూ రాజుల కథలేనా? ఇలాంటి కొత్త కథ ఒకటి చెప్పవ్వా’అంటూ మారాం చేశాడు. అవ్వ తల గీరుకుంది. ఏమి చెప్పాలా అని ఆలోచించింది. టక్కున ముసలి బుర్రకు ఒక కథ తట్టింది. వెంటనే చెప్పడం ప్రారంభించింది. 
 
‘అనగనగా ఒకానొక కాలంలో కొండలకు రెక్కలు ఉండేవట. అవి ఎక్కడబడితే అక్కడ వాలిపోయేవట. మాకన్న బలవంతులు.. ఎత్తు గలవాళ్ళు, ఈ భూమిపై మా అంతటి విశాలమైన రెక్కలు ఏ పక్షికి లేవని చాలా గర్వపడేవట. మాకు ఎదురు లేదు, మేము ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగిపోతాం, ఒకరి ఆజ్ఞతో నడవాల్సిన పని లేదు, ఇంకొకరి సలహా అవసరం లేదు’ అంటూ చాలా గర్వంగా మాట్లాడేవట. ‘ఓ పర్వతమా.. మీరు బాగా ఎగరండి తప్పు లేదు. ఆకాశంలో ఆనందంగా విహరించండి, మాలాగా మీకు రెక్కలొచ్చాయి, కాదనలేదు, కానీ మేము ఏ కొమ్మలపైనో, ఏ రాతిపైనో వాలిపోతాం, ఏ జీవికి హాని చేయం’ అన్నాయట పక్షులు. 

‘ఐతే ఏంటి’ అని వెటకార ధోరణిలో అడిగిందట కొండ. ‘మీరు ఎక్కడ వాలితే అక్కడ మీ బరువు జీవజాలంపై పడి చనిపోతున్నాయి, పైగా మీరు ఇలా స్థాన చలనం కావడం ప్రకృతికే విరుద్ధం’ అని హితవు పలికాయట పక్షులు. ‘ఏమన్నారు.. మేము విరుద్ధమా.. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా?’ అంటూ కొండలు కోప్పడ్డాయట. పక్షులు చేసేది లేక, మిన్నకుండి పోయాయట. కొండలు మాత్రం తమ రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళి, ఎక్కడబడితే అక్కడ వాలి, తమకు ఏ అపకారం చేయని జీవులను చంపేసేవట. ఇలా అయితే భూమిపై గల జీవులన్నీ చనిపోతాయని తలచి, ఎలాగైనా రెక్కల కొండల ఆగడాలను ఆపాలని, భూమిపై నివసించే జీవులన్నీ తమ గోడు వెళ్ళబోసుకోడానికి భగవంతుని దగ్గరకు వెళ్ళాయట’ 

అంటూ కథ మధ్యలో ఆపేసి.. మంచం పక్కనే చెంబులో పెట్టుకున్న నీళ్ళు తాగి, కాస్త ఊపిరి పీల్చుకుంది అవ్వ. ‘తర్వాత ఏం జరిగిందో చెప్పవ్వా ’ అంటూ ఎంతో ఆసక్తిగా అడిగాడు మనవడు. తిరిగి చెప్పడం ప్రారంభించింది అవ్వ.. ‘అలా జీవులన్నీ దేవుని దగ్గరికి వెళ్లి మొర పెట్టుకోగానే.. దేవుడికి కోపం వచ్చిందట. ‘ఆ పర్వతాలకు ఎందుకంత గర్వం. ఒక చోట వుండలేక పోతున్నామంటే, పోనీలే అని కనికరించి రెక్కలు ఇస్తే.. ఇంతటి దారుణానికి ఒడిగడుతున్నాయా.. వెంటనే వాటి పొగరు అణచాల్సిందే ’ అంటూ దేవతలందరూ ఒక నిర్ణయానికి వచ్చారట. 

ఒక మంచి సమయం చూసుకుని పర్వతాల దగ్గరకు వెళ్లి ‘మీరు గౌరవంగా ఉంటారనుకుంటే.. గర్వంతో మసలుతున్నారు. బలముందని బలహీనులను తొక్కేయడం అహంకారానికి చిహ్నం. కాబట్టి మీ రెక్కలు తుంచడమే సరైన ధర్మం’ అంటూ దేవతలు కొండల రెక్కల్ని తెగ నరకడంతో ఊళ్ళకు అవతల పడిపోయాయట. ఉన్నచోటనే ఉండిపోయాయట. అంటూ కథ ముగించి పిల్లాడి వంక చూసింది అవ్వ. మనవడు బాగా నిద్రపోతున్నాడు. (పిల్లల కథ: ఎవరికి విలువ?)

మరిన్ని వార్తలు