వాన చూపిన స్త్రీలు

14 Jul, 2021 01:26 IST|Sakshi

గాలివానలో చిక్కుకున్న ఓ పెద్దమనిషిని గుండెకు పసిపిల్లాడిలా హత్తుకుని కాచుకుంటుంది ప్రఖ్యాత తెలుగు కథ ‘గాలివాన’లోఒక ముష్టామె.దారుణమైన వానలో ఎవడో ఒకడు రాకపోతాడా అని ఎదురుచూస్తుంది ‘ఊరి చివరి ఇల్లు’ కథలో ఒక వేశ్య. తాను ఏ ఇంట అయితే పాలు పిండుతుందో ఆ పాలను తన బిడ్డకు తాపుకోలేకపోతుంది ఒక దీనురాలు ‘పాలు’ కథలో. వానలు పడే కాలం ఇది. వాన అంటే కేవలం దివికి దిగే నీటి దారం కాదు. బతుకును, ముఖ్యంగా స్త్రీ బతుకును కూడా గుచ్చి చూపే సూదిములుకు. తెలుగు కథా సాహిత్యంలో వానతో ముడిపడిన పాత్రలు స్త్రీల జీవితాన్ని చూపుతాయి. ఆ పరిచయం...

ఆ తండ్రి కూతురి పెళ్లి చేశాడు. అతడు రైతు. పత్తి పంట వేసి ఉంటాడు. ఒక్క వాన నిండుగా పడితే ఆ పత్తి పంట గట్టున పడి లాభం వస్తుంది. పెళ్లి అప్పు కొంతైనా తీరుతుంది. కాని వాన పడదు. రైతుగా వానకోసం ఎదురుచూస్తుంటాడు. కాని తండ్రిగా అతడు చేయవలసిన పని ఉంది. అల్లుణ్ణి ఇంటికి ఆహ్వానించి కార్యం జరిపించాలి. మంచి ముహూర్తం లేక ఇన్నాళ్లూ ఆగింది. ఇప్పుడు ముహూర్తం దొరికింది. అల్లుడు వచ్చాడు. కూతురు సంబరపడింది. రాత్రి ఏర్పాట్ల కోసం భార్య ఉన్న మట్టి మిద్దెలోని ఒక గదిని అలంకరించింది. కాని ఇంతలో వర్షం. పెద్ద వర్షం. ఇల్లు మొత్తం ఉరుస్తూ నిలువనీడ లేనంత వర్షం. ఆ వర్షానికి రైతుగా అతడు సంతోషపడాలి. కాని తండ్రిగా బాధపడతాడు. ఈ వర్షం ఇప్పుడే కురవాలా అని తిట్టపోస్తాడు. అప్పుడు కూతురు తండ్రి వద్దకు వస్తుంది. ‘నాన్నా... ఈ వాన వల్ల మన పత్తి చేను పండుతుంది కదా. కార్యందేముంది. వాన పడనీ’ అంటుంది. ‘ఆ సంతోషం ముందు దీని వాయిదా పెద్ద లెక్క కాదు మావయ్యా’ అని అల్లుడు అంటాడు. అందరూ సంతోషంగా వానను చూస్తూ కూచుంటారు. గుంగుల నరసింహారెడ్డి రాసిన ‘వాన కురిసింది’ కథ ఇది. రైతు కూతురంటే అలా ఉంటుంది అని చూపిన కథ అది.

ఇంటి నుంచి పారిపోయిన నిరర్థక సోదరుడు చాలా ఏళ్ల తర్వాత ఆ వాన సాయంత్రం ఇల్లు చేరుకుంటాడు. ఇంట్లో ఎవ్వరికీ పెళ్లయి ఉండదు. పెద్దక్క చిన్నా పెద్దా పనులు చేస్తూ ఒక తమ్ముణ్ణి, ఇద్దరు చెల్లెళ్లనీ సాకుతూ ఉంటుంది. ఘోరమైన పేదరికం. ఇప్పుడు ఇతను ఊడిపడ్డాడు. అన్ని విధాలా ధ్వంసమై వచ్చినవాడు తన తల మీద బరువు కాబోతున్నాడు. అనుబంధం ముఖ్యమా? బతుకు భారం ముఖ్యమా? ఆ అక్క గుండె రాయి చేసుకుని ‘తెల్లారే రైలు ఉంది. రైలు కంటే ముందు బస్సు ఉంది. బయల్దేరు’ అంటుంది. వాడు ఎక్కడికి వెళ్తాడు. ఎక్కడికైనా వెళ్లనీ. అతడు వెళ్లిపోతూ ఉంటే ఆమె వెర్రిగా చూస్తూ ఉంటుంది. గుమ్మా ప్రసన్న కుమార్‌ రాసిన ‘ముసురు పట్టిన రాత్రి’ కథలోని స్త్రీ పాత్ర ఇది. కుటుంబం స్త్రీ మీద వేసే బరువును మోయలేక ఆమె చేసిన ఆక్రందన అది.

తెలుగు కథల్లో వాననూ వానతో ముడిపడిన స్త్రీలనూ చాలామంది రచయితలు చూపించారు. బి.ఎస్‌.రాములు రాసిన ‘పాలు’ కథ ఉంటుంది. అందులో భూస్వామి దగ్గర పని చేసే ఒక ఆడ పాలేరు మూడు బర్రెలకు రోజూ పాలు పిండుతూ ఉంటుంది. కాని ఒక్క రోజు కూడా ఆ పాలలో చుక్క కూడా తన బిడ్డకు తాగించలేని పరిస్థితికి బాధ పడుతుంది. చంటి పాప ఇంట్లో జ్వరంతో ఉన్నా ఆ రోజు వాన కురుస్తూ ఉన్నా తాను పనికి తప్పనిసరిగా వచ్చే వెట్టి బతుకు ఏమిటా అని ఆమె ఆలోచనలో పడుతుంది. భూస్వామి పాలు తాగి తిరిగి ఇచ్చిన గ్లాసును కడిగి పెట్టకుండా అలాగే వదిలి రావడమే ఆమె చూపగలిగిన అతి పెద్ద ప్రతిఘటన.

దేవరకొండ బాల గంగాధర తిలక్‌ ‘ఊరి చివరి ఇల్లు’లో ఒక వేశ్య ఉంటుంది. ఆమెను కనిపెట్టుకుని ఒక ముసలామె ఉంటుంది. ఆమెకు ఆ జీవితం ఇష్టం లేదు. అప్పుడే ఒక పుణ్యాత్ముడు ఆ వర్షం కురిసిన రాత్రి ఆమె ఇంటికి వచ్చాడు. ఆమెను చూశాడు. మెచ్చాడు. ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆమె తన జీవితం ధన్యం కానుంది. కాని ఆమె ఆ పెళ్లి చేసుకుని వెళితే ముసలామె ఎలా బతకాలి. అందుకే ఆ ముసలామె ఆ పుణ్యాత్ముడి మనసు విరిచేస్తుంది. వేశ్యది అంతా నాటకం అంటుంది. ఆమె మోసగత్తె అని చెబుతుంది. అతడు హతాశుడై ఆ ఇంటి నుంచి వెళ్లిపోతాడు. ఇక అలాంటి వాన రాత్రి గాని, అలాంటి పుణ్యాత్ముడుగాని ఆమె జీవితంలో మళ్లీ వచ్చే అవకాశం లేదు. స్త్రీల దేహాలపై బతికే పరాన్నభుక్కుల విషకౌగిలింత ఇలా ఉంటుంది... దానిలో నలిగే స్త్రీలు ఇలా ఉంటారు అని చూపిన కథ అది.

పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘గాలి వాన’ సుప్రసిద్ధం. అందులో ఒక పెద్దమనిషి ఒక అతి పెద్ద గాలివానలో ఎవరూ లేని ఒక చిన్న రైల్వేస్టేషన్‌ వెయిటింగ్‌ రూమ్‌లో చిక్కుకుంటారు. ఆయనకు అప్పటి వరకూ పేదలన్నా, సరిగా బతకని వారన్నా, సంఘంలో ఏ గౌరవం లేని వారన్నా చిన్నచూపు. కాని ఇప్పుడు అలాంటి పెద్దమనిషికి ఆ వెయిటింగ్‌ రూమ్‌లో ఒక ముష్టిది మాత్రమే తోడు. ఆమెకు ఆ పెద్దమనిషికి ఉన్నంత చదువు, తెలివి, గొప్పతనం లేవు. తను మనిషి అని తెలుసు. సాటి మనిషికి సాయం చేయాలి అని తెలుసు. ఆ పెద్ద మనిషి భయంతో వొణకుతూ ఉంటే ‘ఇల్రా బాబూ... ఎచ్చగుంటది’ అని దగ్గరకు తీసుకుని ధైర్యం చెబుతుంది. ఆ క్షణంలో ఆ స్త్రీ ఆ పెద్ద మనిషికి ఎంతో గొప్పదిగా అనిపిస్తుంది. ఆయన పరివర్తన చెందుతాడు. కాని ఆ ముష్టిది తెల్లారే సరికి చనిపోతుంది. పాఠకులకు ఆ పాత్ర గుర్తుండిపోతుంది.

ఇవి వాన పడే రోజులు కదా. ఇల్లు కదలక పుస్తకాలు చదవండి. వాన ఉన్న కథలు అవి చూపిన స్త్రీల పాత్రలు గమనించండి. బయట పరిసరాలు తడుస్తుంటే ఇంట్లో సాహిత్యం చూపిన జీవితాల్లో తడవండి.
– ఫీచర్స్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు