గురువాణి: పంచెకట్టు కట్టి పై కండువాతో నడిచొస్తుంటే...

22 Aug, 2022 00:24 IST|Sakshi

ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది. దాన్ని చూడగానే అది ఫలానా ప్రాంతపు సంప్రదాయం అని ఠక్కున గుర్తుపట్టేస్తాం. అది ఏ ప్రాంతానిదయినా అభినందించవలసిందే. దానిపై అక్కడి వాళ్ళకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. అయితే అదే సమయంలో ఇతరుల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. తమ ప్రాంతంలోని ఆచార వ్యవహారాలను, అలవాట్లను, కట్టూబొట్టూను... వీటిని జ్ఞాపకం ఉంచుకోవడం, గౌరవించడం, అనుసరించడం... ఇది మాది ...అని చెప్పుకొని పొంగిపోవడం... ఉండవలసిన లక్షణం.

తెలుగువాడు ఎలా ఉంటాడు...అన్నదానికి... అల్లూరి వేంకట నరసింహరాజు గారనే ఒక కవి ఏమంటున్నాడంటే....‘‘ పంచెకట్టు కట్టి పైమీది కండువా వేసికొనిన తెలుగువేషమగును, అటుల సుందరము, శృతిపేయమైనట్టి భాషయన్న తెలుగు భాషయగును’’ అని వర్ణించాడు. పంచెకట్టు తెలుగువాడి వస్త్రధారణ. అదికూడా...కుచ్చిళ్ళు వచ్చేటట్లుగా దాని అంచు నిలువుగా నిలబడేటట్లుగా ఎడం పక్కకు పెట్టుకొని ..ఒక్కోసారి ఇంకా అందంగా కనబడడానికి అర్ధవృత్తాకారంలో కట్టుకొని, వెనక ప్రత్యేకించి కుచ్చిళ్ళతో గోచీపోసి కట్టుకుని ..అటువంటి అలంకరణతో నడుస్తుంటే ఆ వస్త్రధారణ అందమే వేరు... ఇంతకంటే అందమైన మరొక వస్త్రధారణ ఉంటుందా..అనే అనుమానం కూడా కలుగుతుంది.

ఇక పంచెకట్టుతోపాటూ పైన ఉత్తరీయం.. కండువా. కనీసంలో కనీసం ఒక తువ్వాలు... అది లేనిదే తెలుగువాడు ఒకప్పుడు బయట అడుగుపెట్టేవాడు కాడు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, సంప్రదాయ కుటుంబాల్లో, శుభాశుభాల్లో ఈ వేషధారణ తప్పనిసరిగా కనిపిస్తున్నది. నవతరం కూడా ఈ సంప్రదాయాలను గౌరవిస్తున్నది. ఈ రెంటికీ అదనంగా భాష.. తెలుగు ఎంత మధురమైన భాషంటే... దానిని చెవులతో జుర్రుకోవచ్చు.. అనేంత మధురంగా ఉంటుంది. ఈ భాష రానివాడు కూడా దానిని వింటూ మైమరిచిపోతాడు. ఇది ప్రతి తెలుగువారూ తమది అని గొప్పగా చెప్పుకొని పరవశించే సంస్కృతి.

వేదం కూడా ప్రత్యేకించి ఈ రకమైన వస్త్రధారణ చాలా గొప్పది.. అంటుంది. స్వాధ్యాయచ... వేదం చదువుకోవాలన్నా, హోమం చేయాలన్నా, దానం చేయాలన్నా, భోజనం చేయాలన్నా, ఆచమనం చేయాలన్నా...ఈ అయిదింటికీ  పంచెకట్టే కట్టుకోవాలి. ‘‘విగచ్ఛః అనుత్తరీయశ్చ నగ్నస్య అవస్త్రేయచ’’ అంటుంది. అంటే వెనుక గోచీ పోసి కట్టుకోకపోతే, ఉత్తరీయం వేసుకొని ఉండకపోతే వాడు నగ్నంగా ఉన్నవాడితో సమానం అంటుంది.

తెరమీద రకరకాల వేషాలతో నవయవ్వనులుగా కనిపించినా.. బహిరంగంగా సభలకు వచ్చేటప్పడు  ఎటువంటి భేషజాలకు పోకుండా నందరమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్‌.వి. రంగారావుగార్లలాంటి వారు, అలాగే ప్రభుత్వంలోని అత్యంత ఉన్నతస్థానాల్లో ఉన్న అధికారులు కూడా కొన్నిరకాల సభలకు, సమావేశాలకు పంచెకట్టుతోనే వచ్చేవారు. వారలా కనిపిస్తుంటే పంచెకట్టులో వెలిగిపోతుండేవారు. వై.ఎస్‌. రాజశేఖర రెడ్డిగారు అందంగా గోచీపోసి అంచులు ఆకర్షణీయంగా కనబడేట్టుకట్టి.. అలా వేదికలమీద, జనం మధ్యన నడిచిపోతుంటే అందరి దృష్టి వారిమీదే. వీళ్ళు పై ఉత్తరీయాన్ని కూడా తలపాగా లాగా ఎంత వేగంగా తలకు చుట్టినా అది అంత అదనపు ఆకర్షణగా నిలిచేది.

అంత గొప్ప కట్టుబొట్టూ ఉన్నచోట పుట్టే అదృష్టం, అంత మధురమైన తెలుగు భాషను నోరారా మాట్లాడుకొనే అవకాశం ఇచ్చిన పరమేశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకోకుండా ఎలా ఉండగలం!!! మనదైన సంస్కృతిని కొత్త తరం అందిపుచ్చుకొని మరింత వ్యాప్తిలోకి తీసుకురావాలి.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు