కథ: సామ్రాజ్యపు దండయాత్రలో...

18 Apr, 2021 14:07 IST|Sakshi

ఈ వారం కథ

కూనిరాగం తీస్తున్న సుబ్బారావు కొయ్యబారిపోయాడు... కారణం ఏమీ లేదు.. జస్ట్‌.. బ్రహ్మానందాన్ని చూశాడు.. అంతే. సుబ్బారావు బ్రహ్మానందాన్ని యథాలాపంగా చూసి ఎప్పటిలాగానే వెకిలిగా నవ్వబోయి చిన్నగా పిచ్చికేక వేశాడు. నోటమాట నోట్లోనే ఆగిపోయింది. ‘ఏందిది? ఈయన మన బ్రమ్మం పంతులేనా? ఇంత ఉషారుగా ఉన్నాడే.. ఎప్పుడూ ఈసురోమని ఏడుపు ముఖంతో తిరిగే బ్రమ్మం.. ఇయ్యాల.. అబ్బో.. కిర్రెక్కిపోతన్నాడే..’ అది గాయత్రీనగర్‌లో ఐదోవార్డు. బ్రమ్మం అనే కూచిపూడి వీరవెంకట లక్ష్మీ బ్రహ్మానందం అదే ప్రాంతంలో బతుకుతున్న ఓ ప్రాణి. ఐదోవార్డు మునిసిపాలిటీ పిల్లల బళ్ళో పంతులు.

మానవుడే కాని పెద్దగా గుర్తింపుకు నోచుకోని ప్రాణి. డ్రైనేజీ మీద తిరిగే పురుగు. రోడ్డుపక్కన గజ్జి కుక్కపిల్ల. గాలికి దొర్లే ఎండుటాకు. ఇది ఊర్లో బ్రహ్మానందానికి ఉన్న హోదా.. నలభై ఏళ్ల బ్రహ్మం ఇంకో పదేళ్ళు మీదేసుకున్న శరీరుడు. అంత పొడుగూకాదు, పొట్టీ కాదు... అర్భకుడూ కాదూ దృఢకాయుడూ కాదు... అందగాడు కాదు, మరీ తీసిపారేసే రకమా..ఏమో! నవ్వకపోయినా పళ్లు బయటే ఉంటాయి. వాటి ఎత్తుపల్లాలు పళ్లమధ్య దూరాలు అందరికీ దర్శనభాగ్యం కలిగిస్తాయి. అప్పుడపుడు తల దువ్వుతాడు. ఎప్పుడన్నా పౌడర్రాస్తాడు. అప్పుడప్పుడు చొక్కాగుండీలు ఎగుడుదిగుడుగా పెట్టుకుంటాడు. ఎప్పుడన్నా ప్యాంట్‌ జిప్పు మర్చిపోతుంటాడు. ప్రశ్నవేస్తే కంగారు పడతాడు. జవాబు చెప్పలేడు. అప్పుడే ఏవిటో నత్తి వస్తుంది. నోట్లోంచి చొంగ కారిపోతుంది. అడిగినవాడు ఎందుకు అడిగాన్రా అని బాధపడతాడు. కూరగాయలవాడు బ్రహ్మంతో కామెడీ ఆడతాడు. రిక్షావాడు ఆయనతో బేరాలాట ఆడతాడు. కారణం? ఆ పర్సనాలిటీ, అ యాటిట్యూడ్‌ అలాంటిది!

అలాంటి బ్రహ్మం ఇవ్వాళ అపరసూర్యుడిలా వెలిగిపోతున్నాడు. నిండుచందమామలా కాంతులీనుతున్నాడు. రజనీకాంత్‌లా ఆత్మవిశ్వాసంతో నడుస్తున్నాడు. చిరంజీవిలా షర్ట్‌ గుండీలు తీసి అడుగేస్తున్నాడు. కమల్‌ హాసన్‌లా మృదువుగా నవ్వులు రువ్వుతున్నాడు. ‘‘ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు’’ అన్నట్లు మూర్తీభవించిన తెలుగు తేజంలా తేజరిల్లుతున్నాడు. ఆ ఊపూ.. చూపు.. తట్టుకోలేనట్లుగా ఉంది. సుబ్బారావే కాదు, బడ్డీకొట్టు సుందర్రావ్, ఎస్టీడీ బూత్‌ రంగనాయకులు, టిఫిన్‌ సెంటర్‌ వెంకటరావు, మిల్క్‌ సెంటర్‌ ప్రభావతి.. ఇలా అందరూ ఆయన స్టైల్‌ను తట్టుకోలేక షాకింగ్‌గా చూస్తూ ఉండిపోయారు.

ఇది ఊర్లో సన్నివేశమైతే, ఇంట్లో సన్నివేశం మరింత షాకింగ్‌గా ఉంది.
బ్రహ్మం భార్య రాజ్యం.. పొద్దున్నే ట్రిమ్ముగా తయారైన భర్త కొత్త అవతారం చూసి పక్షవాతం వచ్చినట్లు గిలగిల కొట్టుకుంది. ఎన్టీఆర్‌లా పంచకట్టి కొంగు జేబులో దోపాడు. పౌడరే కాదు, సెంటు కూడా కొట్టాడు. తల దువ్వాడు. దువ్వుతూ కూనిరాగాలు తీశాడు. మురికి హవాయ్‌ చెప్పులు వొదిలేసి, షూ తీసి పాలిష్‌ చేసి తొడిగాడు. వెళుతూ వెళుతూ రాజ్యం బుగ్గమీద చిటికె వేశాడు. రొమాంటిక్‌గా నవ్వాడు. ఆవిడ తేరుకోడానికి మినిమం అరగంట పట్టింది. కాలేజీ నుంచి వచ్చిన కొడుకు ఫణి తల్లిని చూడగానే బిత్తరపోయాడు. ‘‘ఏంటమ్మా.. వొంట్లో బాలేదా.. విరోచనాలా..ఎన్ని?’’ అన్నాడు ఆమెనుచూసి. చెప్పేలోపే ఇంట్లోకొచ్చిన బ్రహ్మం ఆమె బుగ్గపై చిటికె వేసి లోపలికెళ్ళాడు. తల్లి చెప్పకుండానే తండ్రి చేసిన పనిచూసి బిర్ర బిగుసుకు పోయాడు ఫణి. 
‘‘అమ్మా.. నాన్నేనా.. నేను చూస్తోంది నిజమేనా?’’.. ఆమె జవాబివ్వలేనట్లు వెర్రిచూపులు చూసింది. 

నిజానికి పెళ్లిచూపుల సమయానికి బ్రహ్మం నిజమైన బ్రహ్మానందంలా నిత్యం నవ్వులు చిందిస్తూ రొమాంటిక్‌గా కనపడ్డాడు రాజ్యానికి. ‘‘అబ్బాయి నచ్చాడామ్మా?’’ అని తండ్రి అడిగినప్పుడు నిజంగానే సిగ్గుపడిపోయింది. బుగ్గలు ఎరుపెక్కి పెదాలు వొణికాయి. ‘‘ఊ..సరే..ఆ..ఊ’’ అంది తియ్యతియ్యగా. పెళ్లినాటి ఆ హీరోయిజం బ్రహ్మంలో మధ్యాహ్న సూర్యకాంతిలా చాలాకాలం ప్రకాశించింది. రాజ్యాన్ని సంసారమనే ఆనంద లోకాలలో వోలలాడించింది. అప్పుడే ఫణి పుట్టాడు. తొలి కాన్పు కొడుకు పుట్టడం ఇద్దరికీ స్వర్గం చేతి కందినట్లయ్యింది. బ్రహ్మం ఉద్యోగం సజ్యోగం, డబ్బులు గిబ్బులు బయట గొడవలు రాజ్యానికి తెలియవు. పట్టవు. కాని బ్రహ్మం ఆమెకు ఏమీ చెప్పకపోయినా అన్నీ సమకూర్చేవాడు. ఏ లోటూ లేకుండా చూసుకునేవాడు.

అలాంటివాడు రానురానూ తనలోతాను ముభావంగా.. అంతర్ముఖుడుగా.. మాటలు తగ్గి సణుగుడు ఎక్కువై.. దిక్కులు చూడటం.. తిండి ఏంటో..బట్టలేంటో.. పట్టించుకోనంతగా నత్త గుల్లలోకి ముడుచుకు పోయినట్లు ముడుచుకుపోయాడు. ఆమె సాధారణ ఇల్లాలు. దాంపత్యంలో వొకరు మెతక అయితే మరొకరు డామినేట్‌ చేస్తారు. అదే జరిగింది. ఆమె తనకు తెలియకుండానే కొంగు బిగించాల్సి వచ్చింది. కుటుంబ పగ్గాలు చేతికి తీసుకోవాల్సి వచ్చింది. ఏదో మొగుడనే వాడు ఉన్నాడు. రెండోతారీఖు జేబులో జీతం డబ్బులు ఉంటున్నాయి. అది చాలు.. ప్చ్‌.. 
అలా బ్రహ్మం రానురానూ ఇంటా బయటా బాగా చులకనైపోయాడు..
ఈ నేపథ్యంలో పుట్టిపెరిగిన ఫణి కూడా డిటోనే. 

ఫణికి ఊహ తెలిసేటప్పటికే మునగదీసుకుని సైలెంటుగా ఉండేవాడు బ్రహ్మం. అందుకని ఫణికి కూడా తండ్రిపై సదభిప్రాయం లేదు. ఇద్దరూ బ్రహ్మాన్ని చులకనగా సూటిపోటి మాటలతో ఆటపట్టించడం.. ఆడుకోవడం.. అలాంటిది ఇప్పుడు ఇలా బ్రహ్మంలో ఈ మార్పు వాళ్లకు ఊహాతీతం.
హఠాత్తుగా తండ్రి పిలుపు విని అలా నిలబడిపోయాడు. ‘‘వొరేయ్‌.. ఫణి..’’ రెండు నిమిషాలు నిశ్శబ్దం.. మళ్లీ పిలిచాడు. ఈసారి గట్టిగా.. మరింత దృఢంగా.. ‘‘నిన్నేరా ఫణీ..’’ ఏవనాలో ఆలోచించేలోపే చెంప పేలిపోయింది. జరిగింది అర్థంకాలేదు వాడికి. తనను.. తండ్రి కొట్టాడు.. ఫణే కాదు రాజ్యనికి కూడా మతిపోయింది.
‘‘నాన్నా.. నే.. నేనే.. ఇక్కడే ఉన్నా.. చెప్పు నాన్నా’’ అన్నాడు వణుకుతూ.. ‘‘ముందు పిలవగానే పలకాలి.. నా ముందు నిలబడాలి.. 
ఓ కే..? ’’ 

భర్తలో రజనీకాంత్‌ కనిపించాడు రాజ్యానికి. సౌండు స్పష్టంగా ఉంది. ఇంతకు ముందు ఫణికి ఏ పనీ చెప్పలేక పోయేవాడు బ్రహ్మం. చెబితే వాడు కామెడీ విన్నట్లు విని ఊరుకునేవాడు. ఒక తల్లిగా ఆమెకు ఫణి ప్రవర్తన తప్పేనని తోచినా, బ్రహ్మం తీరు నచ్చక కొడుకును ఏమీ అనలేక పోయేది. ఇప్పుడు బ్రహ్మం అసలు సిసలు తండ్రిలా కొడుకుపై తన అధికారాన్ని ప్రదర్శించడం ఆమెకు లోలోన నచ్చేసింది. ‘ఇలా ఉంటే పిల్లాడు ఇక చెడిపోడు’ అనిపించి భర్తపై హఠాత్తుగా గౌరవం, అభిమానంలాంటి భావాలతోపాటు భర్త అనే తీయని భావన ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి మొలకెత్తింది. భర్తకు గ్లాసుతో మంచినీళ్లు స్వయంగా ఇచ్చింది. వచ్చేముందు చీర కుచ్చిళ్లు సవరించుకుంది. ఇచ్చేముందు తల, పైట సర్దుకుంది. ఇచ్చినవి నీళ్లే అయినా భర్తకు ఆమె ఇలా ఇచ్చింది ఎన్నో ఏళ్ల తర్వాత. భార్యలో కలిగిన ఈ మార్పును బ్రహ్మం చిరునవ్వుతో స్వీకరించి, థాంక్స్‌ చెప్పి ఆమె ముఖంలో నవ్వుల్నీ, బుగ్గల్లో లైట్‌గా ఎర్రెర్రని రొమాంటిక్‌ మందారాల్ని పూయించాడు.

ఇక స్కూల్లో సన్నివేశం చూద్దాం..
ఐదోవార్డులోనే పుట్టిన బ్రహ్మం అదేస్కూల్లో చదివాడు. ఇప్పుడు అదే స్కూల్లో టీచరుగా ఉద్యోగం సంపాదించాడు. తర్వాత పెళ్లి.. ఆ తర్వాత కొడుకు పుట్టడం... ఇక్కడి వరకు బ్రహ్మానికి అన్నీ జాతకంలో ఉన్నట్లు చకచకా జరిగాయి. ఆదర్శ టీచర్‌గా కూడా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి సడన్‌గా ఆతనిలో పెద్ద మార్పు..  
ఐదో తరగతి సోషల్‌ పాఠం రెండో తరగతిలో చెప్పాడు. ఇది స్కూల్‌ అంతా గంట మోగినట్లు మోగిపోయింది. మరో రెండు రోజుల తర్వాత తెలుగు క్లాసులో లెక్కలు చెప్పాడట. తర్వాత ఐదో తరగతి పిల్లలతో  అ ఆ లు దిద్దించాడట. కొత్తబట్టలతో వచ్చి హ్యాపీ బర్త్‌డే చెప్పిన పిల్లాడిని యూనీఫాం వేసుకు రాలేదని చితక్కొట్టాడట. పిల్లాడి బంధువులు ఆయుధాలతో వచ్చేసరికి బ్రహ్మం ఇంటికెళ్ళిపోవడం.. బంధువులు హెడ్మాస్టర్ని వాళ్ళ శక్తి కొద్దీ పేపర్లో వార్త వచ్చే స్థాయిలో ఆడుకోవడం జరిగింది. ఇలాంటి మధుర స్మృతులు ఎన్నో!
అలా బ్రహ్మం ఇంటా బయటా సెంటర్‌ పాయింట్‌ అయిపోయాడు.

అలాంటి బ్రహ్మం తిరిగి బ్రహ్మానందంలా అఖండ తేజస్సుతో వెలిగిపోతూ అందరికీ షాకిస్తున్నాడు. 
ఆ ఉదయం స్కూలు చదువుల తల్లిని ప్రార్థించబోయే వేళ.. స్కూలు ఆవరణలోకి అడుగుపెట్టిన బ్రహ్మాన్ని చూసి స్కూలు స్కూలంతా స్తంభించిపోయింది. రోజూ బ్రహ్మం లోపలికొస్తే ఏదో ఆవో గేదో కుక్కపిల్లో దారితప్పి లోపలి కొచ్చినట్లు ప్రార్థన ఆపేవారు కాదు. ఇవ్వాళ మాత్రం ట్రిమ్ముగా తయారై అచ్చ తెలుగు పంతులులా ఎంటర్‌ అయిన బ్రహ్మానందం మాష్టారు ధీమాగా విలాసంగా ప్రార్థన జరిగే చోటుకు వచ్చాడు. అంతా.. హెడ్‌ మాస్టార్తో సహా నోరుతెరిచి చూస్తుండిపోయారు. బ్రహ్మం గొంతు సవరించుకుని, మైక్‌ ముందుకొచ్చాడు. ‘మా తెలుగు తల్లికీ.. మల్లెపూదండ..’ అంటూ శ్రావ్యంగా, గంభీరంగా గొంతెత్తి హాయిగా అందరూ థ్రిల్లయ్యేలా పాడాడు. అంతా పిచ్చెక్కినట్లు చప్పట్లే చప్పట్లు.. ఎవ్వరివంకా చూడకుండా స్టైల్‌గా క్లాసు వైపు నడిచాడు. ఆరోజు స్కూల్లో అంతా బ్రహ్మం గురించే చర్చ. ఇలా ఎలా సడన్‌గా చేంజ్‌ అయ్యాడో అర్థం కావడం లేదు. 

బ్రహ్మం.. ఇప్పుడు ఆ పేటలో హాట్‌ టాపిక్‌.. 
అతనిలో వచ్చిన సడన్‌ మార్పు చూసి ఇరుగు పొరుగు పాతమిత్రులు, స్కూలు సహచరులు, బంధువులు అందరిలోనూ గగుర్పాటు, సంభ్రమం... మంచిబాలుడు అనిపించుకున్న బ్రహ్మం మెంటల్‌ బ్రహ్మంగా ఎందుకు తయారయ్యాడో, మళ్ళీ అసలు సిసలు బ్రహ్మానందంగా ఎలా మారాడో అందరికీ మిష్టరీగా మారింది. 
అందరి సంగతి వేరు. భార్య, కొడుకు సంగతి వేరు. వాళ్ళిద్దరూ కూడా బ్రహ్మంలో వచ్చిన ఈ మార్పులకు కారణం ఏమిటో అర్థంకాక ఆలోచించి ఆలోచించి గందరగోళపడి చివరికి శవాన్ని మోస్తున్న విక్రమాదిత్యుడి లాంటి బ్రహ్మాన్నే అడిగారు.
‘‘అసలు అలా ఎందుకు తయారయ్యావు నాన్నా.. మళ్ళీ ఎలా ఇలా మారిపోయావు.. చెప్పాలి’’ అన్నాడు కొడుకు ఫణి. ‘‘చెప్పి తీరాలి’’ అంది భార్య రాజ్యం. ఆహ్లాదంగా నవ్వాడు బ్రహ్మం. ‘‘చెప్పాల్సిందేనా?’’ అన్నాడు రిలాక్స్‌డ్‌గా. చూస్తున్న టీవీని రిమోట్‌తో ఆపాడు. అర్ధ నిమీలితంగా చూస్తూ మెల్లగా మొదలెట్టాడు.
‘‘రామదాసు తెలుసుగా.. వాడే నాకు ద్రోహం చేశాడు..’’ ఉపోద్ఘాతంగా అన్నాడు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. 

‘‘తెలీక పోవడం ఏంటి.. రామదాసు అన్నయ్యగారు మీ క్లోజు ఫ్రెండేగా’’ అంది రాజ్యం. ‘‘ఈమధ్య అంకుల్‌కేదో..’’ అంటున్న ఫణిని ఆపమన్నట్లు చెయ్యెత్తాడు..
‘‘ఆమధ్య టౌన్‌ హాల్లో జరిగిన మీటింగ్‌ లో రామదాసుగాడ్ని రాయితో తల మీద కొట్టాను’’.. రావణాసురుడ్ని చంపిన రాముడిలా, దుర్యోధనుడ్ని చంపిన భీముడిలా, జలియన్‌ వాలాబాగ్‌ లో జనాన్ని చంపిన డయ్యర్‌లా, కోర్టులో స్టేట్‌మెంట్‌లా చెప్పాడు. 
అర్థంకాలేదు ఇద్దరికీ. ‘‘వాడు నాకు ద్రోహం చేశాడు. చేశాడంటే వొక్కసారి చేశాడని కాదు. చేస్తూనే ఉన్నాడు.. నా చిన్న బతుకును చిదిమేశాడు. నాప్రాణాల్ని తనజేబులో పెట్టుకుని, వాడికి ఎప్పుడు సరదా అనిపిస్తే అప్పుడు నా పీకనొక్కుతూ ఆనందిస్తుండేవాడు. అందుకే ఆరోజు మీటింగ్‌లో రాయట్టుకుని పుచ్చె పగిలేలా కొట్టాను’’ 
ఆనందంగా కోరిక తీరినట్లు తృప్తిగా మెరిసేకళ్లతో చెప్పాడు. 

ఇద్దరికీ డౌట్స్‌ పెరిగాయేగాని, తగ్గలేదు. ‘వాడు ద్రోహంచేశాడు సరే, చాలాకాలంగా ఈయన బాధపడుతున్నాడు సరే.. అయితే చిన్న రాయితో కొట్టి అదేదో ఘనకార్యం చేసినట్లు ఈ బిల్డప్‌ ఏంటి?’ 
‘‘వాడ్ని అసలు చంపేసెయ్యలని ఉంది. కాని నేను వాడ్ని  ఏమీచెయ్యలేనని, మనకు అన్యాయం చేసే ప్రభుత్వాలను, మోసంచేసే మినిష్టర్లను, వొక్క కలంపోటుతో మన బతుకుల్ని ఛిద్రంచేసే ఆఫీసర్లని మనం ఏమీ చెయ్యలేక పోతున్నాం. అలాగే నేనూ వాడిని ఏమీ చెయ్యలేనని అర్థమై నాలోనేను ముడుచుకు పోయాను. కాని రాక రాక చిన్న అవకాశం వచ్చింది. నా కసి తీర్చుకున్నా’’ కసిగా చెప్పాడు బ్రహ్మం.   
‘‘రామదాసుగాడూ నేనూ ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. బాల్య స్నేహితులం. చెడ్డీలులేని రోజుల నుంచే వాడు నాకు ద్రోహం చెయ్యడం ప్రారంభించాడు. మేమిద్దరం ఓ కుక్కపిల్లను పెంచాం. అదంటే నాకెంతో పిచ్చి. కాని వాడు దానికేం పెట్టేవాడుకాడు. నేనే తిండి మానేసి దానికి పెట్టేవాడ్ని. వొకసారి కుక్కపిల్ల కాలు వాడి సైకిల్‌ చక్రంలో పడి విరిగింది. అది కుయ్యో కుయ్యోమని ఏడవటం ఇప్పటికీ నాచెవుల్లో అలా ఉండిపోయింది. వాడు దాన్ని కాపాడతానని అందరికీ చెప్పి దొడ్లో ఓ మూల వొదిలేశాడు. నాకు నిద్రపట్టక దాన్ని చూద్దామని వాళ్లింటికి వెళ్లాను. అది వర్షంలో వణుకుతూ ఏడుస్తోంది. నేను విలవిల్లాడిపోయా.

వాడ్నిలేపి ఇదేంట్రా అని అడిగా. వాడు నిద్రలేపిన కోపంతో ఆ కుక్కపిల్లను అప్పటికప్పుడు పెద్ద రాయితో కొట్టి కొట్టి చంపాడు. నా కళ్ళముందే అది గిలగిలకొట్టుకుని చచ్చిపోయింది. ఇదే వాడి నైజం. అప్పటికీ ఇప్పటికీ ఇదే వాడి ప్రవర్తన. అదెప్పుడో నా పదేళ్ల వయస్సులో జరిగింది. ఇప్పటికీ నా గుండెల్లో చెరగకుండా ఉండిపోయింది. రామదాసు విషప్పురుగు. పుట్టినప్పటి నుంచి నామీద ఎప్పుడూ వాడి విషపు పడగనీడ.. వాడు ఏనాడూ చదివి పాసవ్వలేదు. అన్నీ నా దాంట్లో చూసి రాసి పాసయ్యేవాడు. స్కూల్లో ఎలా మేనేజ్‌ చేసేవాడో.. ఎప్పుడూ నా వెనకే నెంబర్‌ వచ్చేది.. ఏడో తరగతిలో నన్ను డిబార్‌ చేశారు. వాడు చూసి రాసినందుకు కాదు, నేను చూపించినందుకట. హెడ్‌ మాస్టర్‌ మళ్లీ ఇలా జరిగితే టీసీ ఇచ్చి పంపేస్తానన్నాడు. అదిమొదలు నాకు చూపించకపోతే టీసీ ఇప్పించేస్తా అని బ్లాక్‌ మెయిల్‌ చేసేవాడు. అలా టెన్త్‌ అయ్యాక మళ్లీ ఇంటర్‌లోనూ ఒకే కాలేజీ. మళ్లీ పరీక్షల్లో నా పక్కనే వాడి నెంబరు.

ఫస్ట్‌ ఇయర్‌లో మళ్లీ నేనే డిబార్‌. నా ఆన్సర్‌ పేపర్‌ వాడి ఆన్సర్‌ పేపర్లతో కలసి కుట్టి ఉంది. రామదాసు అంటే మా నాన్నకు మహా గురి. ఎలాంటి సమస్యనైనా ఈజీగా సాల్వ్‌ చేస్తాడని ఆయన నమ్మకం. ఆయన రిక్వెస్టుపై నా డిబార్‌ కాన్సిల్‌ చేయించి, మళ్లీ బ్లాక్‌ మెయిల్‌. అలా ఇంటర్‌ అయ్యింది. డిగ్రీ బందరులో చదవడం వల్ల క్లాసులో లేడు. వారం వారం ఇంటికొచ్చినప్పుడు వదిలేవాడు కాదు.  ‘ఒరే బ్రమ్మీ.. నన్ను మర్చిపోయావ్‌బే..’ అంటూ వచ్చేవాడు. చుట్టూ పెద్ద బేచ్‌.. ‘నా చిన్ననాటి క్లోజ్‌ ఫ్రెండ్‌’ అని పరిచయం చేశాడు. నోరు తెరిస్తే బూతులు. వినకూడదనుకున్నా వినేటట్లు చెప్పేవాడు. అన్నీ గొడవలే.. ‘అదిగో పంపుదగ్గర నీళ్లు పట్టుకుంటోందే ఆ చిట్టిబాబుపెళ్లాం.. పెద్ద కేసు.. వంద ఇస్తే పక్కలోకి వచ్చేస్తుంది. మీ పక్కింటి సుందర్రావు.. వడ్డీకిచ్చి ఆడోళ్లని పక్కలోకి రమ్మంటాడు’..

వీళ్లందరితోనూ రామదాసుకి సంబంధాలు.. వాడి ఫ్రెండ్స్‌ అందరూ ఏవేవో అల్లర్లలో ఉంటారు.. అన్నీ సెటిల్‌మెంట్లు.. ఇరువైపులా డబ్బువసూళ్లు.. వొకరోజు నా గుండెల్లో బాంబు పేల్చాడు. ‘ఎంట్రోయ్‌ బ్రెమ్మీ.. చూస్తే డొక్కు పర్సనాలిటీగాని అమ్మాయిలు నీకే పడిపోతున్నార్రోయ్‌’ అన్నాడు. నేను అయోమయంగా చూశా. ‘గీత.. రామాచారి కూతురు.. నువ్వంటే ఫిదా.. తెల్సా’ అన్నాడు. మావూరి రామాలయం పూజారి కూతురు. చిన్నప్పటినుంచి ఇద్దరికీ తెల్సు. నేను ఉక్కిరిబిక్కిరయ్యా. గీత నన్ను ప్రేమిస్తోందా? గీత గీతలా నాజుగ్గా ఉంటుంది. ధ్వజస్తంభంలా పవిత్రంగా ఉంటుంది. ‘ఏంట్రా నీడౌటు.. తనే నాతో చెబితేనూ’.. నేను బాగా దెబ్బతినేశా.

‘నీతో చెప్పలేక నాతో అంది. నువ్వు మూలి వెధవ్వి.. చెప్పలేవ్‌.. లెటర్‌ రాసి నాకివ్వు.. నేజూసుకుంటా’... నాకూ గీతకుమధ్య వాడే పోస్టుమేన్‌. ఏదేదో కవిత్వం రాసేసేవాడిని తనూ ఏదేదో రాసేది. వందసార్లు అక్షరం అక్షరం చదువుకునేవాడిని. వోరోజు పోలీసులు నన్ను అరెస్ట్‌ చేశారు. గీత కడుపు తీయించుకోవడానికి ఏదో తాగి చచ్చిపోయింది. నా లెటర్స్‌ దొరకడంవల్ల నేనే కారణం. అసలు కారణం రామదాసు. వాడు తప్పుకుని నన్ను సాక్ష్యాధారాలతో పట్టించాడు. ఆమె తల్లిదండ్రులు గుళ్లో ఉరివేసుకుని చనిపోయారు. నా నవనాడులూ కుంగిపోయాయి. ఇంత ద్రోహమా! మొదటిసారి పిచ్చివాడినయ్యా. మా నాన్న పొలం అమ్మి వాడి చేతిలో పెట్టి కన్నీటితో కాళ్లు కడిగాడు. వాడు కేసులోంచి బయట పడేశాడు. అర్థమయ్యిందా.. మళ్లీ బ్లాక్‌ మెయిల్‌.. ‘నోరెత్తావో ఉరికంబమే’.. నాన్న మిగిలిన పొలం అమ్మేశాక వాడు నాకు ఉద్యోగం వేయించాడు.

అటు వాడు పెద్ద లీడర్‌గా ఎదిగిపోతున్నాడు.. తగువులు..సెటిల్మెంట్లు.. చిట్టిబాబు తన పెళ్లాన్ని చంపేశాడు. సుందర్రావ్‌ను జనం రోడ్డుమీద ఈడ్చిఈడ్చి కొట్టారు. కొన్నివడ్డీలు మాఫీచేసి రామదాసుగాడు  కేసులు సెటిల్‌ చేశాడు. పోలీసొకడు.. వొక జర్నలిస్టు. వీడి బాచ్‌లో ప్రముఖ వ్యక్తులు. హమ్మయ్య.. నన్ను వొదిలేసి ఊరుమీద పడ్డాడు అనుకుని ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుంటే మళ్లీ పడగ విప్పాడు. ‘పదో తరగతి పాస్‌ చేయిస్తానని బ్రహ్మం మాష్టారు పాతికమంది దగ్గర డబ్బువసూలు’.. ఓరోజు పేపర్లో న్యూస్‌. నా మీద ఎంక్వైరీ. సస్పెన్షన్‌. వాడిబృందం అందరూ చేశారు. నామీద పెట్టారు. నాన్న ఇల్లు అమ్మాడు. నాకు మళ్లీ పోస్టింగ్‌. ఈసారి ఐదో వార్డు స్కూల్లోనే. ‘మన దగ్గరుంటే మరీ మంచిది. నువ్వేం భయపడకు బాబాయ్‌. నేనున్నాగా..’ నాన్నకు వాడిచ్చిన భరోసాతో ఆయన తృప్తిగా చనిపోయాడు. 
ఇదీ నా బతుకు. నాకేం దారిలేదు.. వాడి పడగనీడ నుంచి తప్పుకోలేను.. రోజురోజుకూ మరీ విషపు కోరలు దగ్గరగా నాతలపై తాండవమాడుతున్నట్లు ఫీలింగ్స్‌.. నాకు మరోదారి లేదు.. అలాఅలా నిస్పృహలో కూరుకుపోయాను. అలాంటి స్థితిలో నాకో సువర్ణావకాశం వచ్చింది. 

ఆరోజు ఎక్సై్సజ్‌ మంత్రి గిరిధర్‌గారికి టౌన్‌హాల్లో సన్మానం. ఆయన మరో మంత్రి శివశంకరాన్ని తప్పించి ఆ మినిస్ట్రీ సంపాదించాడు. దోచుకోడానికే మినిస్ట్రీ మారాడని పేపర్లు టీవీలు ఘోషించాయి. మరో పక్క అపోజిషన్‌ పార్టీ వాళ్లు ఇదే సమయమని ఎటాక్‌ బాగా పెంచేశారు. రోజూ పేపర్లో చూస్తున్నారుగా ఊర్లో అల్లర్లు.. రెండు పార్టీలు.. నాలుగు గ్రూపులు.. తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. చంపుకునే స్థాయికి వెళ్లినట్లు ఊరంతా చెప్పుకుంటున్నారు. అనుకోకుండా హాల్లోకి వెళ్లా.. మీటింగు మొదలవ్వకముందే గొడవ.. అసలు అంతా కొట్టుకోవడానికే వచ్చారా అన్నట్లుంది ఆ వాతావరణం. నాయకులు ఒక్కొక్కరూ స్టేజిమీదకు వస్తున్నారు. చూస్తున్న నా కళ్లు బైర్లుకమ్మాయి. మనపాపి రామదాసుగాడు కూడా స్టేజి ఎక్కాడు. ఇదేంటి.. ఈడు ఆ పార్టీలో ఉన్నాడుగా.. ఈ పార్టీ మీటింగులో.. అంటే మళ్లీ పార్టీ మారుతున్నాడా.. వోరి ద్రోహీ.. ఆ పార్టీ వల్ల కౌన్సిలర్‌వయ్యావ్‌గా.. ఈ పార్టీలో దూరి చైర్మన్‌ అయిపోదామనుకుంటున్నావా.. ద్రోహి.. ఎంత మోసం.. నాలో కోపం ఉద్వేగం పెరిగిపోతున్నాయ్‌.

క్షణ క్షణానికీ కోపంతో కసితో వొళ్ళంతా వణుకుతోంది.. ఎన్నో రోజులనుంచి వాణ్ణి  చంపాలనుకున్న నా భావాలు.. ఏమీ చెయ్యలేని నా నిస్సహాయత.. నా చేతకానితనం.. పిచ్చివాడిగా మిగిలిన నా బతుకు.. చిన్ననాటి నుంచి వాడుచేసిన ద్రోహాలు.. కుక్కపిల్ల.. అమాయకంగా నమ్మి ఆత్మహత్య చేసుకున్న గీత.. ఉరి వేసుకున్న గుళ్లో పంతులు కుటుంబం.. సుందర్రావ్‌.. చిట్టిబాబు..ఇలా అందరూ నా కళ్లముందు.. నాలో క్రోధం.. బాధ.. వాడున్న ఆ హాల్లో వంద పాముల మధ్య నిలబడినట్లు.. వందగద్దలు నన్ను పొడుచుకు తింటున్నట్లు.. కుమిలిపోతున్నా.. ఏం చెయ్యాలి..లోలోన అల్లకల్లోలమైపోతున్నా.. అప్పుడు జరిగింది.. ఎలా జరిగిందో.. ఎక్కడ మొదలైందో.. ఓ కుర్చీ ఎగిరి స్టేజ్‌ వైపు వెళ్లి మినిస్టర్‌ ముందుపడింది.. ఎవరో అరిచారు.. మరొకరు బూతులు.. స్లోగన్లు.. ఇంకొకరు పక్కవాడ్ని ఈడ్చి తన్నాడు.. గాల్లో కుర్చీలు కర్రలు.. హాకీ స్టిక్కులు.. క్షణాల్లో యుద్ధభూమిగా మారిపోయింది..

రక్తం.. హాహాకారాలు.. స్టేజ్‌పై గెస్టులు ఎవ్వరూ లేరు.. ఏమయ్యారు.. ఈ పాపిగాడెక్కడ.. అంత గోలలోనూ నా చూపు వాడి కోసమే.. అంతా స్టేజి వెనక్కిపోయి దాక్కున్నారు.. వొంగొని వెనక్కి చూశాను.. ఓ కుర్చీ చాటుగా పెట్టుకుని చావు భయంతో నిక్కి నిక్కి చూస్తున్నాడు రామదాసుగాడు. నాబుర్రలో మెరుపు.. వేగంగా బయటకు పరిగెత్తి ఓ రాయిని.. చేతిలో అమిరే రాయిని తీసుకుని గిరుక్కున తిరిగొచ్చా.. నా గురి తెలుసుగా.. అటూఇటూ చూశా.. ఎవ్వరూ నన్ను చూడటంలేదు..స్టేజ్‌ వెనక్కువెళ్లా.. వాడు అక్కడే ఓ కుర్చీ వెనగ్గా.. క్షణంలో వెయ్యోవంతు.. నా చేతిలోని రాయి.. వాడి తలకు గురిపెట్టి విసిరా. ఫర్ఫెక్ట్‌గా తగిలింది. మరుక్షణం.. ఎర్రెర్రగా ఎగసిన రక్తం.. వాడి తలలోంచి.. నా లోలోపల మండుతున్న నిప్పు మీదకి చిమ్మినట్లు.. ఆ చిమ్మిన రక్తం.. నాలోని నిప్పును ఆర్పేసినట్లు.. నేను పారిపోలేదు రాజ్యం!

అక్కడే నిలబడి ధైర్యంగా.. ఆనందంగా.. తృప్తిగా చూస్తున్నా.. వాడు.. ఆ పాపి రామదాసుగాడు నన్ను చూశాడు. నన్ను.. నా విజయగర్వాన్ని.. నా ముఖంలో తృప్తిని చూసాడ్రా ఫణి! వాడి ముఖంలో దిగ్భ్రమ.. ‘నువ్వా..బ్రహ్మీ..నువ్వు? నన్ను?’.. అంతే.. కుప్పకూలిపోయాడు.. చాలు.. నా వొళ్ళంతా జలదరించింది.. నన్నెవ్వరూ గుర్తుపట్టలేదు. అంతా గోల గోల.. ఎగురుతున్న కుర్చీలు.. పడిపోతున్న శరీరాలు.. ఎవరు చస్తున్నారో ఎవరు చంపుతున్నారో నాకు అనవసరం.. ఆ యుద్ధభూమిలో నా శత్రువును నేను కొట్టగలిగిన దెబ్బ.. నా కసి తీరేటట్లుకొట్టా.. చాలు.’’
నవ్వుతున్నాడు బ్రహ్మానందం.. లేచి నిలబడి జేబులో చేతులుపెట్టుకుని.. ఆనందంగా.. తృప్తిగా.. పగలబడి నవ్వుతున్నాడు.. రెండు క్షణాలు ఆయనవంక ఆశ్చర్యంగా.. సంభ్రమంగా చూశారు భార్య, కొడుకు. 

‘‘ఐదోవార్డు కౌన్సిలర్‌ రామదాసు టౌన్‌హాల్లో జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా దెబ్బతిని కోమాలో ఉన్నారు’’  
అని టీవీలు ఊదరగొట్టిన సంగతి ఇద్దరికీ సుపరిచితమే.. వాళ్లిద్దరికీ పూర్తిగా అర్థమయ్యాక నవ్వొచ్చింది. ఆయనతో కలసి ముగ్గురూ నవ్వారు.. ఆ రాత్రంతా... గుండెలు నిండిన విశ్వాసంతో నవ్వుతూనే ఉన్నారు.,, జీవితమంతా...
- మత్తి భానుమూర్తి

మరిన్ని వార్తలు