P Satyavathi: కళ్లు తెరిపించే కథా రచయిత్రి 

31 Dec, 2021 15:56 IST|Sakshi

పి. సత్యవతితో ముఖాముఖి 

సమకాలీన తెలుగు సాహిత్యంలో రచయిత్రిగా పి.సత్యవతి స్థానం ప్రత్యేకమైనది. కథలు, నవలలు, సాహిత్య సమీక్ష వ్యాసాలు వ్రాశారు. అనువాదాలు కూడా చేశారు. ఏ ప్రక్రియ చేపట్టినా, స్త్రీ జీవితమే ప్రధానంగా రచనలు చేస్తూ వచ్చారు. ఆమె వ్రాసిన  ‘ఇల్లలకగానే’ కథ తెలుగు కథాసాహిత్యంలోనే మైలురాయిగా నిలిచిపోతుంది. రచయిత్రిగా పలు అవార్డులు, సత్కారాలు పొందిన పి.సత్యవతికి ఇటీవల ‘కువెంపు జాతీయ పురస్కారం’ లభించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’ పాఠకుల కోసం ఆమెను ప్రముఖ రచయిత్రి కాత్యాయనీ విద్మహే ప్రత్యేకంగా చేసిన ఇంటర్వ్యూ...

పి. సత్యవతి ప్రధానంగా కథా రచయిత్రి. నవలలు వ్రాశారు. అనువాదాలు చేశారు. సాహిత్య సమీక్షా వ్యాసాలు ప్రచురించారు. ప్రక్రియ ఏదైనా స్త్రీ జీవితమే అన్నిటికీ కేంద్రబిందువు. కుటుంబం మొదలుకొని ప్రపంచీకరణ సంస్కృతి వరకు స్త్రీల జీవితాన్ని హింసామయం చేస్తున్న వ్యవస్థలను గుర్తించి గురిచూడటమే ఆమె సాహిత్యతత్వం. తల్లి చదువుకోటానికి లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తీసుకొచ్చే అలవాటు, తండ్రి శిక్షణ హైస్కూల్‌ చదువులనాటికే ఆమెలో సాహిత్య అధ్యయన ఆసక్తులు స్థిరపడటానికి కారణం అయ్యాయి. మాలతీ చందూర్, కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి వంటి రచయితలను ఇష్టంగా చదువుకొన్నారు.

హైదరాబాద్‌లో మేనమామగారింట ఉండి చదువుకొన్న కాలంలో ఇంగ్లీష్‌ సాహిత్య అధ్యయనం పెరిగింది. నిరంతర అధ్యయనం వల్ల ఏర్పడిన కొత్త చూపు, తన జీవితంతో సహా చుట్టూ జీవితాలను నిశితంగా పరిశీలించే గుణం వల్ల సాంద్రమైన అనుభవ కోణం ఆమె కథా బలం. జీవితం, ఘటనలు, మనుషులు, ప్రవృత్తులు, ప్రవర్తనలు, పరిణామాలు ఒత్తిడి పెడితే తప్ప వ్రాయని రచయిత కనుక ఆమె కథలలో గాఢత ఉంటుంది. జీవితాన్ని ప్రేమించే మనిషి కనుక కథను నిర్మించటంలో, నిర్వహించటంలో సున్నితత్వం ఉంటుంది. జీవితం ఎంత కష్టభూయిష్టం అయింది అయినప్పటికీ మంచికి దానిని మార్చుకొనే చేవ పొందటానికి మనుషులు ఎవరి పరిధిలో వాళ్ళు ప్రయత్నపరులు కావాలనే సందేశాన్ని ఇస్తుంటాయి అవి.

ఇరవైఏళ్ల వయసులో ప్రారంభమైన సత్యవతి సాహితీ సృజన శక్తుల విన్యాసం షష్టిపూర్తి వేళ కూడా నవయౌవన ఆరోగ్యంతో తళతళ లాడుతూనే ఉంది. అప్పటికి ఎనిమిదేళ్లుగా మహిళా జనజీవన సమస్యల అధ్యయన, ఆచరణ మార్గంలో నడుస్తున్న నేను 1990 ఇల్లలకగానే కథ చదివి సహజంగానే సత్యవతి గారితో ప్రేమలో పడ్డాను. ఆ తరువాత మంచి స్నేహితులమూ అయ్యాము. స్త్రీ తనను తాను తెలుసుకొని తనను తాను నిర్వచించుకొనే స్వీయ సత్తా సంపాదించు కొనాలనే విషయం పట్ల  అవగాహన కలిగించటానికి ఎన్ని సభలలో , ఎన్ని తరగతి గదులలో ఇల్లలకగానే  కథను పాఠంగా చెప్పానో లెక్కలేదు. తెలుగు కథా సాహిత్యంలో అది ఒక మాగ్నమ్‌ ఓపస్‌. ఈ కథకు ముప్ఫయి ఏళ్ల  ముందు  ముప్ఫయి ఏళ్ల తరువాత  సత్యవతి కథా ప్రపంచం విస్తరించి ఉంది. ప్రతిష్ఠాత్మక కువెంపు జాతీయ పురస్కారం అందుకొంటున్నవేళ ‘సాక్షి’ పక్షాన ఆమెతో స్నేహ సంభాషణ నాకు సంతోషకరం.  

సత్యవతిగారూ నమస్కారమండీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దాదాపు ఆరు దశాబ్దాల సాహిత్య జీవితం మీది. ఈ కృషికి గాను మీరు ఇదివరకు ఎన్నో పురస్కారాలను అందుకొన్నారు. ఇప్పుడు  కువెంపు జాతీయ పురస్కారం వరించిన సందర్భంలో మీ అనుభూతి ఏమిటి?

చాలా సంతోషం కలిగింది. ఈ సందర్భంగా కువెంపు గారు సంచరిచిన ప్రదేశం చూడడం, అక్కడి గాలి పీల్చడం నా కొచ్చిన అద్భుతమైన అవకాశంగా భావిస్తునాను. ఒక గొప్ప కవి పేరుమీద  పురస్కారం అందుకోడం చాలా ఆనందం కదా!

వ్యక్తిగతం అంతా రాజకీయమే అన్న స్త్రీవాద సూత్రం తెలిసి రాసినట్లు ఉంటాయి మీ కథలు. స్త్రీవాదం మీ కథల చోదకశక్తి ఎప్పటినుండి అయింది? ఎలా? 

ముందు నుంచి నేను  స్త్రీ కేంద్రక కథలే ఎక్కువ వ్రాశాను. నాకు తెలిసిన, నేను చూసిన స్త్రీల అనుభవాలు కథలుగా రాశాను. అయితే  స్త్రీవాదం నాకు సిద్ధాంతంగా తెలిసి వచ్చింది మాత్రం ఆంధ్ర దేశంలో అంటే తెలుగు లో స్త్రీ వాద సాహిత్యం ఒక అలలాగా వచ్చిన 80 వ దశకంలోనే. నేను ఆ కవితలనీ కథలనూ చదివి స్త్రీవాద  సిద్ధాంతాలను అధ్యయనం చెయ్యడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి నేను స్త్రీల జీవితాల మీద దృష్టి పెట్టాను. సమస్యల మూలాలను తెలుసుకోడం మొదలు పెట్టాను.

స్త్రీల జీవితాన్ని హక్కుల స్పృహతో కథా వస్తువును చేయటానికి మిమ్మల్ని ప్రభావితం చేసినది స్త్రీవాదమే కదా! స్త్రీవాదంతో మీ పరిచయం ఎప్పటినుండి? అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసింది? 

ఇందాక చెప్పినట్లు స్త్రీ వాదంతో నా పరిచయం అధ్యయనం 80ల తరువాతే. అయితే 90లో నేను ద సెకండ్‌ సెక్స్‌ చదివాను. ఆ తరువాత వరుసగా సెకండ్‌ వేవ్‌ ఫెమినిజంలో ప్రఖ్యాతమైన పుస్తకాలు కొనుక్కుని చదివాను.  సెకండ్‌ సెక్స్‌ చాలా ప్రభావవంతమైన పుస్తకం. ఇప్పుడు ఫెమినిజం ఆ స్థాయిలన్నీ గడిచింది. ఇంటర్‌ సెక్షనాలిటీ  మొదలైన అంశాలన్నీ ముందుకొచ్చాయి. ఏది ఏమైనా హక్కులతో పాటు తనను గురించిన బాధ్యత కూడా తను తీసుకోగల స్థాయికి స్త్రీలు ఎదగడానికి పోరాడాలి. తనను తను ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి.

ఇల్లలకగానే కథ ద సెకండ్‌ సెక్స్‌ చదివాక వ్రాశారా? సెకండ్‌ సెక్స్‌ ప్రభావవంతమైన పుస్తకం అన్నారు. ఆ ప్రభావశీలత గురించి కాస్త వివరిస్తారా? 

ఈ కథ నిజానికి చదవక ముందు వ్రాసినదే. అనేకమంది స్త్రీలను చూసి వ్రాసినది. 90లో వచ్చింది. 

మీ కథలలో  స్త్రీవాదానికి ప్రాతినిధ్య కథలు ఏవని మీరనుకొంటారు?

ఇల్లలకగానే, సూపర్‌ మామ్‌ సిండ్రోం, దమయంతి కూతురు, గాంధారి రాగం  ఇట్లా ... 

మధ్యతరగతి స్త్రీ కేంద్రంగా భిన్న వ్యాసార్ధాలతో గీసిన చైతన్య వృత్తాలు మీ కథలు అనిపిస్తుంది. ఆ దృష్ట్యా వాటిలో మీరు ఉత్తమం అనుకొనేవి ఏవి? 

నేను నాకు తెలిసిన జీవితాలనే నాకున్న పరిధి మేరకే  వ్రాశాను. స్థల కాలాలకు అతీతంగా వ్రాయలేదు. పాఠకులు ఎక్కువగా కనెక్ట్‌ అయిన కథే నాకూ బాగా నచ్చిన కథ. ప్రత్యేకంగా ఇదీ అని చెప్పలేను. ఎవరి కథలు వారికి ముద్దు కదా? 

మీ కథలు కొన్నిటిలో  శ్రామిక వర్గ స్త్రీల జీవితాలు కనిపిస్తాయి. వాటికి అవి స్వతంత్రాలా లేక మధ్యతరగతి స్త్రీల జీవిత సాపేక్షతలో భాగమా? 

వాటికి అవి ప్రత్యేకమే. స్వర్ణ అనే అమ్మాయి ప్రధాన పాత్రగా వ్రాసిన కథలన్నీ శ్రామిక వర్గానికి చెందినవే . సమాజంలో ఒక వర్గం ఎప్పటికీ  ఒక్క అడుగు కూడా ముందుకు సాగకుండా వుంటుంది. అనేక పథకాలు వున్నా ఆ  వర్గపు ఆడపిల్లల జీవితం మెరుగు పడటం లేదు. అందుకు కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి. కొన్ని అంటే, సీపురు, సప్తవర్ణ సమ్మిశ్రితం లాంటివి మధ్యతరగతి జీవిత సాపేక్షతలో భాగం కావచ్చు.

మీరు ఏడు నవలలు వ్రాశారు కదా? వాటిలో గొడుగు నవలను తప్ప మరి దేనినీ మీరు ఓన్‌ చేసుకోరు అన్న మాట ఎక్కడో చదివాను. అది నిజమేనా? ఎందువల్ల? కాస్త వివరిస్తారా?

ఆ నవలలన్నీ 90ల ముందువి. నవలా రచన గురించి ఏ మాత్రం తెలుసుకోని సందర్భం... వాటిని ఇంకా బాగా వ్రాయొచ్చు అనిపిస్తుంది.

గొడుగు నవల కూడా 1990 కి ముందుదే కదా! 

అవును. 1978 లో వచ్చింది. గొడుగు కూడా ఇప్పుడు వ్రాస్తే ఇంకొంచెం మంచిగా వ్రాయగలనేమో! అప్పటికి  ఆ వస్తువు, ఆ జీవితం నేను దగ్గరగా చూసినది కనుక ఆ నవలన్నా అందులో ప్రధాన పాత్ర అన్నా నాకు చాలా ఇష్టం. స్త్రీల జీవితాలలోని అసంతృప్తుల ఒత్తిడి , వాటి నుండి విముక్తికి వెతుక్కొనే దోవలు, వేసే తప్పటడుగులు, అన్నీ తెలిసి పరువు కోసం నిలుపుకొనే కాపురాలు ఎన్నో ఉన్నాయి. అవి కావ్యవస్తువు కాలేకపోయాయి. గొడుగు నవలలో దానిని చూపించగలిగాను. 1990ల తరువాత కూడా దాని ప్రాసంగికత వుంది అనిపిస్తుంది. అప్ప టికీ ఇప్పటికీ  స్త్రీలు కొంచమైనా మారారు. సమాజంలో కూడా మార్పు వచ్చింది. నాకు క్లుప్తత అలవాటు. అందుకే కథ వ్రాయడం సులువు. నవల వ్రాయలేను.

మీరు  ఇస్మత్‌ చుగ్తాయ్, ఒక హిజ్రా ఆత్మకథ వంటి అనేక అనువాదాలు చేశారు. ప్రపంచ వ్యాపిత  స్త్రీవాద సిద్ధాంతకర్తలను తెలుగువాళ్ళకు సరళ సుందరంగా పరిచయం చేశారు. సాహిత్య విమర్శలు వ్రాశారు. 

ఇలా భిన్నప్రక్రియలలో అభినివేశం మీ ఆంగ్ల అధ్యాపక వృత్తి లక్షణమా కాక నిర్దిష్ట సాహిత్య ప్రయోజన లక్షితమా ?
అనువాదాలు ఇష్టపడి చేశాను. ఆంగ్ల అధ్యాపక వృత్తికీ నా సాహిత్య సృజనకీ సంబంధం లేదు. మొదటినుంచీ నాకు ఇంగ్లీష్‌ అంటే ఇష్టం. నేను నా మేనమామ ఇంట్లో వుండి చదువుకున్నాను. ఆయన ఇంగ్లీష్‌ అధ్యాపకుడు. మంచి చదువరి. అప్పటినుంచీ నేను ఇంగ్లీష్‌ నవలలు అవీ ఎక్కువ చదివేదాన్ని. స్త్రీవాద సాహిత్య గ్రంథాలు చదినప్పుడు అవి మన పాఠకులకి పరిచయం చెయ్యాలనిపించింది. భూమిక పత్రికలో వరుసగా వ్రాశాను. సరళంగా చెబితేనే అర్థం అవుతాయని ఆ ప్రత్యేకమైన పరిభాష వాడలేదు.

మీరు స్త్రీవాద సిద్ధాంత రచనలు పరిచయం చేయటమే కాదు. తెలుగులో కథలు నవలలు వ్రాసిన స్త్రీలను పరిచయం చేస్తూ వ్యాసాలు కూడా వ్రాసారు.ఇదంతా ‘సిస్టర్‌ హుడ్‌’ భావన ను ఆచరణాత్మకం చేయటం అనవచ్చా? మీ కథలలో కూడా అది అంతర్భాగమే కదా!

అవును. స్త్రీలమధ్య సహకారం స్నేహం వుండాలని నా ఆకాంక్ష. స్త్రీల మధ్యే కాదు, స్త్రీ పురుషుల మధ్య కూడా.

పతిభక్తి  కథలో మతం, ఆచారాలు స్త్రీల మీద ఎంత బరువై కూర్చుంటున్నాయో అలవోకగా చెప్పారు. జెండర్‌ అణచివేతలో కులం, మతం వహిస్తున్న పాత్ర గురించి కాస్త వివరిస్తారా? ఈ కోణం నుండి వ్రాయవలసిన కథల గురించి కూడా సూచించండి. 

ఇళ్ళల్లో సంప్రదాయపరంగా జరిగే క్రతువుల గురించి కూడా స్త్రీలే భారం వహించాలి. సంప్రదాయాలంటూ ఇంకా వాళ్ళమీద అనేక బాధాకరమైన ఆచారాలు రుద్దుతున్నారు. ఇందులో స్త్రీలు కూడా పాత్ర వహించడం చూస్తే వాళ్ళ మెదళ్ళు ఎంతగా నియంత్రించబడ్డాయో అర్థమౌతుంది. 
ఈ మధ్య ప్రవచనాల పేరిట మతపరమైన నమ్మకాలని బాగా ఎక్కిస్తున్నారనిపిస్తున్నది. స్త్రీలు, అందునా మధ్య తరగతి, ఆపై తరగతి స్త్రీలు చేసే వేడుకలు, బాగా ఖర్చుపెట్టి చేసే పెళ్ళిళ్ళూ, అలంకరణలు చూసినప్పుడు, జాతకాలూ జ్యోతిష్యాల వెనక పడుతున్నప్పుడు ఇన్ని వ్రాసిన, ఇంత పోరాడిన అన్ని తరాల స్త్రీల కష్టం తలచుకుంటే బాధ అనిపిస్తుంది. ఈ మాయ నుంచి ఎలా బయట పడతారా అనిపిస్తుంది. మాయపొరలు చీల్చేందుకు ఎన్ని కథలైనా రావాల్సే ఉంది. 

సత్యవతిగారూ  పితృస్వామ్య మాయ దగ్గరనుండి, ప్రపంచీకరణ మాయను, వస్తువినిమయ మాయను, హిందుత్వ మాయను బద్దలు కొట్టటానికి నిరంతర కథా దీప ధారులైన మీతో ఈ  సంభాషణ ఎంతో బాగుందండి. మీ సమయాన్ని ‘సాక్షి’ పాఠకుల కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు.  
 
- కాత్యాయనీ విద్మహే 

మరిన్ని వార్తలు