దేవాలయాలు ఎలా నిర్మిస్తారో తెలుసా?

6 May, 2021 06:43 IST|Sakshi

ఆదిలో దేవాలయాల నిర్మాణం మట్టి, చెక్క వంటి పదార్థాలతో జరిగేది. అయితే ఇవి చాలా త్వరగా రూపుమాసిపోయేవి. కాలక్రమేణా గుహాలయాలు, శిల మీద చెక్కిన భగవంతుని మూర్తులు, ఇటుకలతో కట్టిన కట్టడాలు వాడుకలోకి వచ్చాయి. ఆ తరవాత కాలంలో పెద్ద పెద్ద శిలల మీద చెక్కినవి, ఏక శిలావిగ్రహాలు... వాస్తు శాస్త్రానుసారం దేవాలయ నిర్మాణం మార్పులు చెందింది. ఆ విధానమే నేటికీ ఆచరణలో ఉంది. ఈ నిర్మాణంలో వాస్తు పూర్తిగా శాస్త్రబద్ధంగా, మానవ ఆరోగ్యానికి, మనో వికాసానికి ఉపయోగపడేలా ఉండేది. 

మన దేశం చాలా సువిశాలమైనది. ఇక్కడ భిన్న ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలు నెలకొని ఉన్నాయి. ఆ భిన్నత్వం దేవాలయ నిర్మాణంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్లే ఆలయాల నిర్మాణం భిన్నభిన్న శైలుల్లో దర్శనమిస్తుంది. వీటి వెనుక వేదాంతం, ఆరోగ్య ప్రాధాన్యత ఇమిడి ఉన్నాయి. దేవాలయాల నిర్మాణం అన్ని ప్రాంతాలవారిదీ బయటకు చూడటానికి ఒకేలా కనిపిస్తున్నప్పటికీ, అనుసరించిన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ దేవాలయాలు ఉత్తరాది విధానం, దక్షిణాది విధానం అని రెండు విధాలుగా కనిపిస్తాయి.

ఉత్తరాది వారి శైలి వక్రరేఖావృత్తమైన గోపురం ఉంటుంది. దక్షిణాది వారిది ద్రవిడశైలి. వీరి గోపురాలు తిర్యక్‌ చిహ్న సూచీ స్తంభంలా ఉంటాయి. నగర, ద్రవిడ నిర్మాణాలను మిళితం చేసిన వేసరశైలి కూడా అక్కడక్కడా కనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలోను, మధ్య భారతదేశంలోను దేవాలయ నిర్మాణం గుప్తుల కాలంలో ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. ఉత్తర భారత దేశంలో.. సాంచి, తిగవా (మధ్యప్రదేశ్‌), జబల్‌పూర్, భూమారా (మధ్యప్రదేశ్‌), నాచ (రాజస్థాన్‌), దియోఘర్‌ (ఉత్తరప్రదేశ్‌), దక్షిణ భారతదేశ శైలి... తమిళనాడు, ఉత్తర కర్ణాటక ప్రాంతాలలో కనిపిస్తుంది. ద్రవిడ విధానం తమిళనాడులోనే పురుడు పోసుకుంది. శిలలను శిల్పాలుగా మలిచి బౌద్ధదేవాలయాల నిర్మాణం జరిగింది.

ఆ తరవాత రాతి నిర్మితమైన దేవాలయాల నిర్మాణం ప్రారంభమైంది. ఇవి ముఖ్యంగా వైదిక సంబంధమైనవి కాని జైన సంబంధమైనవి కాని అయి ఉంటా యి. కాంచీపురానికి చెందిన పల్లవులు, బాదామీ చాళుక్యులు, రాష్ట్రకూటులు... వీరి కారణంగా అనేక దేవాలయాలు నిర్మితమయ్యాయి. వారంతా రాజులుగా పట్టాభిషిక్తులయ్యాక దక్షిణ భారతంలో ఆరోగ్యాన్నిచ్చే దేవాలయ వాస్తు ప్రసిద్ధిలోకి వచ్చింది. ఈ విధంగా దేవాలయాల నిర్మాణం ప్రారంభమై, అది మానవ ఆరోగ్య జీవితంలో భాగంగా మారిపోయింది.
– వైజయంతి పురాణపండ 

చదవండి: Chaganti Koteswara Rao: కళ్ల ఎదుటే కైలాసం
 

మరిన్ని వార్తలు