Terrace Garden: ఎవరికి వారు పండించుకొని తినాలి!

17 Aug, 2021 10:25 IST|Sakshi
విద్యాసాగర్‌రెడ్డి మేడ పైన నిర్మించుకున్న ఎత్తుమడుల్లో కూరగాయ పంటలు

‘‘డబ్బు సంపాయించుకుంటే చాలు ఆహారం కొనుక్కొని తింటే సరిపోతుంది అని అందరూ అనుకుంటున్నారు. ప్రజల్లో ఈ ధోరణి పాతుకుపోయింది. ఈ కారణంగానే మార్కెట్లో అమ్మే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సాగులో రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఎక్కువ మోతాదులో వాడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎవరికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను అవకాశం ఉన్న వారంతా తమ ఇళ్లపైన, పెరట్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసుకోవటమే ఈ సమస్యకు సరైన పరిష్కారం. ఈ పని నేను చేస్తూ ఇతరులకూ చెప్పాలనుకున్నాను. మూడేళ్ల క్రితం కొత్త పక్కా భవనం నిర్మించుకునేటప్పుడే మిద్దె తోటలకు తగిన (వాటర్‌ ఫ్రూఫింగ్, సిమెంటు తొట్లు నిర్మించటం..) ఏర్పాట్లు చేసుకున్నాను.. ’’ అంటున్నారు కనుకుంట్ల విద్యాసాగర్‌రెడ్డి.

నల్లగొండ జిల్లా నకరేకల్‌లో స్వగృహంలో తమ ఇద్దరు పిల్లలతో పాటు నివాసం ఉంటున్న విద్యాసాగర్‌ రెడ్డి, కోకిల దంపతులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. సేంద్రియ ఇంటిపంటల సాగుపై చాలా మక్కువ. 2 వేల చదరపు గజాల టెర్రస్‌పై గత మూడేళ్లుగా ఇంటిపంటలు పండించుకొని తింటున్నారు. ఆకుకూరలు కొనటం లేదు. పాలకూర, బచ్చలికూర, పొన్నగంటి, మునగ వంటి ఐదారు రకాలు ఏడాది పొడవునా సాగు చేస్తున్నారు. దొండ, బీర, వంకాయలు వంటి కనీసం మూడు, నాలుగు రకాల కూరగాయలతోపాటు పచ్చిమిర్చి ఇప్పుడు కాపు దశలో ఉన్నాయి.

టమాటో, బెండ, గోకర (గోరుచిక్కుడు).. వంటివి ఇప్పుడు విత్తబోతున్నారు. ప్రణాళికాబద్ధంగా పంటలు దఫ దఫాలుగా విత్తుకోవటం/నాటుతున్నారు. పోషకాల లోపం రాకుండా, చీడపీడల బెడద తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసి, మొక్కలకు అప్పుడప్పుడూ వేస్తుంటారు. మడుల్లో మట్టిని వేసవిలో తీసి.. పశువుల ఎరువు, కొబ్బరి పొట్టు, జీవన ఎరువులు కలుపుతారు. సేంద్రియ పద్ధతుల్లో పండించుకునే ఇంటిపంటలకు చీడపీడలు రాకుండా ముందే∙జాగ్రత్తపడాలంటారు విద్యాసాగర్‌రెడ్డి. నిత్యం మొక్కలను గమనిస్తూ ఉండాలి. పసుపు నీళ్లు, వేపాకు రసం/కషాయం, మిగిలిపోయిన వంట నూనె, వెల్లుల్లి రసం, పుల్లటి మజ్జిగ, పచ్చిమిర్చి రసం వంటి ద్రావణాలను పిచికారీ చేస్తున్నారు. 

అన్ని పట్టణాల్లో సబ్సిడీ ఇవ్వాలి
మిద్దె తోటల్లో దేశవాళీ విత్తనాలు వాడితేనే రుచి బాగుంటుందని ఆయన అంటారు. పిల్లలు, పెద్దలు మిద్దె తోటల పనుల్లో నిమగ్నం కావటం వల్ల టీవీ, ఫోన్ల వాడకం తగ్గిందన్నారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేస్తున్నారు.  డ్రమ్ముల్లో పట్టి ఉంచి మొక్కలకు పోస్తుండటం, ఇంట్లో ఏసీ పెట్టుకోకపోవడం విశేషం. ప్రతి నగరం, పట్టణంలో మిద్దె తోటల సాగుకు అవసరమైన సామగ్రి, పరికరాలు, సంప్రదాయ విత్తనాలను సబ్సిడీపై అందుబాటులోకి తెస్తే మరింత మంది ఇంటి పంపటలు సాగు చేసుకోగలుగుతారని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విద్యాసాగర్‌రెడ్డి (98498 21212) ప్రభుత్వాలకు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు