సేంద్రియ ఇంటిపంటల పితామహుడు!

11 Aug, 2020 08:56 IST|Sakshi

నివాళి

వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసుకోండి. మీకు నచ్చిన పంటలనే మీ ఇంటిపై పండించుకోండి. మీరు పండించుకున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లనే ఇంటిల్లపాదీ తినండి! – దివంగత డా. బి.ఎన్‌. విశ్వనాథ్, భారతీయ సేంద్రియ ఇంటిపంటల పితామహుడు, బెంగళూరు 

నగరాల్లో సేంద్రియ ఇంటిపంటల చరిత్రలో ఒక విచారకరమైన ఘట్టం. భారతీయ ఆర్గానిక్‌ టెర్రస్‌ కిచెన్‌ గార్డెనింగ్‌ పితామహుడు డాక్టర్‌ బి.ఎన్‌.విశ్వనాథ్‌ ఇక లేరు. ఆదివారం బెంగళూరులోని ఆసుపత్రిలో కన్నుమూశారు. గత ఏడాదిన్నరగా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న ఆయనను కరోనా బలితీసుకుంది. బెంగళూరు కేంద్రంగా రసాయనిక అవశేషాల్లేని సేఫ్‌ ఫుడ్‌ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆయన.. టెర్రస్‌లపై సేంద్రియ ఇంటిపంటల సాగును నిరంతర శ్రమతో ఉద్యమంగా విస్తరింపజేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కీటక శాస్త్ర నిపుణుడిగా పనిచేసి రిటైరైన డా. విశ్వనాథ్‌ తమ ఇంటిపై 1995 నుంచి సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయనారంభించారు. అంతేకాదు, నగరాలు, పట్టణాల్లో ఇళ్లు కట్టుకొని స్థిర నివాసం ఉంటున్న వారే కాదు, అపార్ట్‌మెంట్లలో అద్దెకుంటున్న వారు సైతం తమకు ఉన్న కొద్ది గజాల స్థలంలో అయినా సరే.. వంటింటి వ్యర్థాలను కంపోస్టుగా మార్చుకొని సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవటం తమ బాధ్యతగా గుర్తెరగాలని ఎలుగెత్తి చాటిచెప్పారు. 

బెంగళూరు, మైసూరు, మాండ్య, ధార్వాడ్‌–హుబ్లీ తదితర చోట్ల అవిశ్రాంతంగా టెర్రస్‌ గార్డెనింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ పాతికేళ్లలో కనీసం వెయ్యికి పైగా శిక్షణా శిబిరాలు నిర్వహించారు. కనీసం పది వేల మంది ముఖతా ఆయన దగ్గర శిక్షణ పొంది, టెర్రస్‌ గార్డెనింగ్‌ను తమ జీవితాల్లో భాగం చేసుకున్నారు. ముఖాముఖి సంభాషణకు వీలుగా ఉండాలని కేవలం పది, పదిహేను మందికి మాత్రమే ఒకసారి శిక్షణ ఇచ్చేవారు. ఉపన్యసించటం, పీపీటీ ద్వారా మెలకువలను విపులంగా తెలియజెప్పటంతోపాటు శిక్షణ పొందే వారందరికీ మట్టిలో చేతులు పెట్టి పనిచేయటం నేర్పించేవారు. కొన్నేళ్లు ఆయన స్వయంగా నిర్వహించిన శిక్షణా శిబిరాలను గత కొన్నేళ్లుగా ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఎఎంఇ ఫౌండేషన్‌ నిర్వహిస్తుండగా, డా. విశ్వనాథ్‌ రిసోర్స్‌ పర్సన్‌గా శిక్షణ ఇస్తున్నారు. కన్నడంలో, ఆంగ్లంలో టెర్రస్‌ గార్డెనింగ్‌పై పుస్తకాలు రాశారు.

బెంగళూరు సిటీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి చివరి వరకు అధ్యక్షునిగా సేవలందించారు. ఎవరి ఇళ్ల మీద వాళ్లు సేంద్రియ ఇంటిపంటలు పండించుకొని తినటం మొదటి దశ. అమృత సమానమైన మిగులు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇతర ఉత్పత్తులను అమ్మకానికి పెట్టించడం ద్వారా ప్రజలను సేంద్రియ ఇంటిపంటల సాగు వైపు ఆకర్షించే ప్రయత్నం చేయటం డా. విశ్వనాథ్‌ ప్రత్యేకత. ఇందుకోసం ‘ఊట ఫ్రం యువర్‌ తోట’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి.. మూడు నెలలకోసారి బెంగళూరు సిటీలో ఒక్కోచోట సేంద్రియ ఇంటిపంటల సంతలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 35 సంతల(www.ofyt.org)ను నిర్వహించారు. ఇతర నగరాల్లో ఇంటిపంటల సాగుదారులు బెంగళూరు అనుభవాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. 

1995 నుంచి ప్రారంభమైన టెర్రస్‌ ఆర్గానిక్‌ కిచెన్‌ గార్డెనింగ్‌ కార్యకాలాపాల రజతోత్సవాలను ఈనెల 15 నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ లోగా ఆదివారం డా. విశ్వనాథ్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. ఆహారోత్పత్తిలో రైతులతో సహానుభూతి చెందటం కోసం నగర, పట్టణవాసులు సిటీ ఫార్మర్స్‌గా మారి తమ ఇళ్లపైనే పంటలు పండించుకోవాలన్నది ఆయన సందేశం. అందుకోసమే పాతికేళ్లుగా శ్రమించారు. హుబ్లిలో ఏడేళ్ల క్రితం డా. విశ్వనాథ్‌ నిర్వహించిన జాతీయ సదస్సులో ‘సాక్షి’ తరఫున నేను పాల్గొన్నాను. అంతకుముందే బెంగళూరు వెళ్లి మరీ ఆయనను ఇంటర్వ్యూ చేశాను. తాజా పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు స్థానిక ఆహార భద్రతను అందించేవి సేంద్రియ ఇంటిపంటలే అని ఆయన మాటల ద్వారా, చేతల ద్వారా చాటిచెప్పారు. ఇంటిపంటలపై చిన్నచూపు మాని ఆ స్ఫూర్తిని కొనసాగించడమే ఆధునిక సేంద్రియ ఇంటిపంటల పితామహుడికి మనం ఇవ్వదగిన నివాళి. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

24 నుంచి హైడ్రోపోనిక్స్‌పై  కేరళ వర్సిటీ ఆన్‌లైన్‌ శిక్షణ
మట్టి లేకుండా నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో ఆకుకూరలు, కొన్ని రకాల కూరగాయలు, ఔషధ మొక్కలను సాగు చేసే పద్ధతి హైడ్రోపోనిక్స్‌. నీటిలో మొక్కల వేళ్లకు ద్రవపోషకాలు అందించడం హైడ్రోపోనిక్స్‌ ప్రత్యేకత. నగర, పట్టణాల్లో షెడ్లలోనూ సాగు చేయడానికి వీలైన పద్ధతి ఇది. కరోనా కష్టకాలంలో ఈ పద్ధతిపై ఆసక్తి పెరుగుతున్న నేపధ్యంలో కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన త్రిస్సూర్‌లోని హైటెక్‌ పరిశోధన–శిక్షణా కేంద్రం ఆన్‌లైన్‌ శిక్షణా శిబిరం నిర్వహించనుంది. మాధ్యమం ఆంగ్లం. ఆగస్టు 24 నుంచి 28 వరకు ఉ. 10.30 – 12.30 వరకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్‌ ౖసైంటిస్ట్‌ డా. సుశీల తెలిపారు. హైడ్రోపోనిక్స్‌ సాగులో వివిధ పద్ధతులు, డిజైన్, నిర్మాణం, నీటి నాణ్యతా ప్రమాణాలు, పోషకాల నిర్వహణ, చీడపీడల యాజమాన్యం, కృత్రిమ కాంతి సంగతులను శాస్త్రీయంగా వివరిస్తారు. ఫీజు రూ. 4,500. ఈ కింది బ్యాంకు ఖాతాకు డబ్బు పంపిన తర్వాత పేరు, చిరునామా వివరాలను suseela1963palazhy@gmail.com and suseela.p@kau.inకు మెయిల్‌ చెయ్యాలి. తర్వాత ఆన్‌లైన్‌ తరగతుల లింక్‌ పంపుతారు. వివరాలకు.. Name: The Professor & Head, Instructional Farm, Vellanikkara, Account number: 67395972864, Branch:SBI, Ollukkara Branch, IFSE CODE: SBIN0070210

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా