ఎలాన్‌ నెంబర్‌ 1 ఎలా అయ్యాడు?

13 Jan, 2021 00:55 IST|Sakshi

ప్రపంచ కుబేరుల్లో తాజాగా నెం:1 స్థానంలోకి వచ్చిన ఎలాన్‌ మస్క్‌ను ‘రియల్‌ లైఫ్‌ టోనీ స్టార్క్‌’ అంటుంటారు.  హాలీవుడ్‌ సినిమా ‘ఐరన్‌ మ్యాన్‌’ (2008) తెలిసిన వారికి టోనీ స్టార్క్‌ పరిచయం అక్కర్లేదు. తనను అత్యంత ప్రభావితం చేసిన సినిమా ‘ఐరన్‌ మ్యాన్‌’ అని చెబుతాడు మస్క్‌...

ఎలాన్‌ మస్క్‌ పేరు వినబడగానే స్పేస్‌ రాకెట్లు, ఎలక్ట్రిక్‌ కార్లు, సోలార్‌ బ్యాటరీలు....మొదలైనవి కళ్లకు కడతాయి. జీనియస్‌ ఇన్వెంటర్, విజనరీ ఇంజనీర్, కుబేర పారిశ్రామికవేత్తలాంటి ప్రశంసలు చెవులకు వినబడతాయి. దక్షిణ ఆఫ్రీకాలోని ప్రీటోరియాలో పుట్టి పెరిగిన ఎలాన్‌ మస్క్‌ ఎప్పుడూ పగటి కలలు కనేవాడట! ‘అబ్బాయిని డాక్టర్‌కు చూపిస్తే బాగుంటుందేమో’ అని తల్లిదండ్రులు అనుకునేదాకా వెళ్లింది ఆ పగటికలల తీవ్రత. జీవితంలో కలలే లేకపోతే తప్పుగానీ అవి రాత్రి కలలైతేనేమిటి, పగటి కలలైతేనేమిటి!

పది సంవత్సరాల వయసులో కంప్యూటర్‌ కొన్న మస్క్‌... ప్రోగ్రామింగ్‌ కోడ్‌ రాయడం గురించి ఆలోచించాడు. పన్నెండు సంవత్సరాల వయసులో ‘బ్లాస్టర్‌’ అనే వీడియో గేమ్‌కు రూపకల్పన చేసి మంచి లాభానికి అమ్ముకున్నాడు. పెరిగి పెద్దయ్యాక... కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో చేరాడుగానీ చేరిన రెండో రోజే తన కలల దారిని వెదుక్కుంటూ బయటికి వచ్చాడు.

తండ్రి దగ్గర అప్పు చేసి, సోదరుడితో కలిసి ‘జిప్‌2’ అనే ఐటీ కంపెనీ మొదలుపెట్టాడు (తాను ఐటీ కంపెనీ ప్రారంభించడానికి కారణం తనకు ఏ ఐటీ కంపెనీలోనూ ఉద్యోగం దొరక్కపోవడమే అంటాడు మస్క్‌!) ‘జిప్‌2’ తరువాత ఇతరులతో కలిసి ఎక్స్‌.కామ్‌ అనే ఆన్‌లైన్‌ ఫైనాల్సియల్‌ సర్వీస్‌ అండ్‌ ఇమెయిల్‌ పేమెంట్‌ కంపెనీ ప్రారంభించాడు. అక్కడి నుంచి మొదలైంది అతడి ప్రయాణం. టెస్లా ఎలక్ట్రిక్‌ కారు కంపెనీ, స్పేస్‌ ట్రావెల్‌ కంపెనీ ‘స్పేస్‌ ఎక్స్‌’ వరకు అతడి విజయయాత్రకు విరామం లేదు.

తనకు బాగా ఇష్టమైన, ప్రభావితం చేసిన సినిమా ఐరన్‌మ్యాన్‌ (2008) అని చెబుతుంటాడు మస్క్‌. ఈ సినిమాలో ‘టెన్‌ రింగ్స్‌’ అనే దుష్టశక్తులు ఉంటాయి. వాటితో కథానాయకుడు టోనీ స్టార్క్‌ వీరోచితంగా పోరాడతాడు. ఐరన్‌మ్యాన్‌గా మారుతాడు. సినిమాలోనే కాదు మన జీవితంలోనూ ‘టెన్‌ రింగ్స్‌’ అనే దుష్టశక్తులు ఉంటాయి. మస్క్‌ ట్విట్స్‌ను అనుసరించే వారికి అవేమిటో ఈజీగా అర్థమవుతాయి. 

1. పిరికితనం: కాస్త సృజనాత్మకంగా ఆలోచించేవారికి అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా అడ్డుతగిలే శత్రువు. మనల్ని వెనక్కిలాగే  దుష్టశక్తి. ప్రయత్నించకుండానే చేతులెత్తేసేవారు తమను తాము కుంచించుకుంటారు
2. సోమరితనం: మనల్ని చాలా కూల్‌గా నాశనం చేసే దుష్టశక్తి. కాబట్టి ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ప్రతి గంటలో మన కష్టం కనబడాలి 
3. నిరాశ: ఎప్పుడూ ఆశాజనకంగా ఉండేవారి దగ్గరికే విజయం నడిచొస్తుంది. అలా అని వాస్తవిక దృష్టిని వీడవద్దు. నేల విడిచి సాము చేయవద్దు 
4. బావిలో కప్ప జ్ఞానం: బావిలో కప్ప బావే తన ప్రపంచం అనుకుంటుందట. అలా కాకుండా ఈ ప్రపంచం ఎటువైపు నడుస్తుందో, ప్రపంచ పరిణామాలేమిటో, సాంకేతిక మార్పులు ఏమిటో గమనిస్తుండాలి. 
5. చీకటి: పొద్దున మనం కళ్లు తెరవకముందే ‘చీకటి’ మన బెడ్‌ దగ్గరికి వచ్చి నిలుచుంటుంది. ‘ఈరోజు కూడా చీకటి రోజే’ అని చెవిలో ఊదుతుంది. ‘లేదు. ఈరోజు ఉజ్వలమైన రోజు’ అని దానికి చెప్పి తిరిగి పంపించాలి.
6.అతి పొగడ్తలు: పొగడ్తలు అవసరమేగానీ అతి పొగడ్తలు మనల్ని దారి తప్పిస్తాయి. విమర్శలకు కూడా విలువ ఇవ్వాలి. అప్పుడే మనల్ని మనం సవరించుకోగలం. 
7. అగమ్యం: నీ గమ్యం ఏమిటో నీకు తెలియకపోతే అది చీకట్లో చేసే యుద్ధం అవుతుంది. స్పష్టత ఉంటే సంకల్పబలానికి అదనపు బలం చేకూరుతుంది. 
8. అసహనం: కోపం, అసహనం మన కాళ్లకు బంధనాలు వేస్తాయి. కొత్త ఆలోచనలు రాకుండా మెదడును స్తంభింపచేస్తాయి.
9. ససేమిరా: కొందరు మార్పుకు ఎప్పుడూ కాళ్లు అడ్డుపెడతారు. భద్రజీవితంలోనే కూరుకుపోతారు. మార్పును అడ్డుకునే వాళ్లకు మరో మార్గం కనిపించదు.
10. వైరం: మనం పనిచేసే వ్యక్తులతో స్నేహంగా, కలిసికట్టుగా ఉండాలి. వైరం ప్రవేశిస్తే  చేస్తున్న పని మాత్రమే కాదు జీవితం కూడా దయనీయంగా మారుతుంది.

గెలుపు సంతకం
సవాళ్లకు సిద్ధపడడానికి యవ్వనానికి మించిన సరిౖయెన సమయం లేదు. ప్రతి క్షణం సద్వినియోగం చేసుకుంటే విజయం మీ పక్షంలో ఉంటుంది. లేకుంటే పశ్చాత్తాపమే మిగులుతుంది. – ఎలాన్‌ మస్క్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా