ట్రాఫిక్‌ జామ్‌.. నెలకు రూ.2లక్షల ఆదాయం

16 Jan, 2021 08:43 IST|Sakshi

గౌరవ్‌ప్రదమైన ఐడియా.. ట్రాఫిక్‌ వడాపావ్‌

నెలకు రూ. 35 వేల జీతం వచ్చే జాబ్‌ వదిలి వడాపావ్‌ బిజినెస్‌

ప్రస్తుతం నెలకు రూ. 2 లక్షల ఆదాయం

మనం ఎప్పుడైనా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే ఏం చేస్తాం.. ఆలస్యం అవుతుందని సణుగుతూ అక్కడినుంచి తప్పించుకునేందుకు వేరే రూటు ఉందేమోనని వెతుకుతాం. కొందరైతే ఎటూ వెళ్లలేని పరిస్థితిలో అక్కడే ఉండి చిరాకుపడుతూ ఉంటారు. కానీ థానేకు చెందిన గౌరవ్‌ లోండే ఒకసారి ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయినప్పుడు ఒక మంచి బిజినెస్‌ ఐడియాను ఆలోచించి.. నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఓ రోజు గౌరవ్‌ ముంబై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌ జామ్‌ అవ్వడంతో నాలుగు గంటలపాటు ట్రాఫిక్‌లోనే ఉండాల్సి వచ్చింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆ సమయంలో అటుగా వేయించిన బఠానీలు విక్రయిస్తున్న వ్యకిని గౌరవ్‌ చూశాడు. అదిచూసిన గౌరవ్‌కు ఓ ఆలోచన  వచ్చింది. బఠానీలు అమ్మినట్టే ట్రాఫిక్‌జామ్‌లో వడా పావ్‌ అమ్మితే ఎలా ఉంటుంది? అనే ఐడియా తట్టింది తనకు.

అనుకున్నదే తడవుగా తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి 2019 జులైలో ‘ట్రాఫిక్‌ వడా పావ్‌’ బిజినెస్‌ను ప్రారంభించాడు. నాణ్యతే గాకుండా ఫ్రెష్‌గా టేస్టీగా ఉండే వడా పావ్‌ ప్యాకెట్‌తోపాటు ఒక చిన్న వాటర్‌ బాటిల్‌ను కూడా దానికి జతచేసి అమ్మడం ప్రారభించాడు. వడాపావ్‌ ప్యాకెట్‌ ధరను  రూ.20లుగా నిర్ణయించి ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే సాయంకాల సమయంలో 5 గంటల నుంచి 10 గంటల మధ్య వడాపావ్‌ను విక్రయించడం ద్వారా నెలకు 2 రూ లక్షల వరకు సంపాదిస్తున్నాడు. (చదవండి: ట్రాఫిక్‌లో 40 గంటలు నరకయాతన..!)

‘‘2009లో నేను పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడిని. సాయంత్రం 5:30 నుంచి 6 గంటలలోపు నా వర్క్‌ పూర్తయ్యేది. అప్పుడు అక్కడ నుంచి ఇంటికి రావడానికి ఒక గంట సమయం పట్టేది. ఈ క్రమంలో ఎన్నోసార్లు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయేవాడ్ని. ఆ సమయంలో నాకు విపరీతం గా ఆకలి వేసేది. తినడానికి ఏమీ ఉండేది కాదు. 10 ఏళ్ల తరువాత 2019లో ట్రాఫిక్‌ వడా పావ్‌ పెట్టడానికి ఈ అనుభవం కూడా ఒక ప్రేరణ అని 30 ఏళ్ల గౌరవ్‌ చెప్పాడు. ఇంట్లో అమ్మచేసే వడాపావ్‌ చాలా రుచిగా ఉంటుంది. ఆ వడాపావ్‌నే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద అమ్మితే క్లిక్‌ అవుతుందనిపించింది. అందుకే ఐడియా రాగానే ధైర్యంగా ముందుకుసాగానని గౌరవ్‌ చెప్పాడు. 

గౌరవ్‌ అమ్మ 52 ఏళ్ల రంజన మాట్లాడుతూ.. స్థిరంగా... నెలకు రూ. 35,000 వచ్చే ఉద్యోగాన్ని మానేయడం సరైన నిర్ణయం కాదనిపించింది. పైగా ఇప్పటికే చాలామంది వడాపావ్‌ బిజినెస్‌ చేస్తున్నారు. మేము ఈ పోటీలో నెగ్గుకు రాగలమా..? అనిపించింది కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చి వ్యాపారం ప్రారంభించేందుకు సాయం చేశాను. మొదట్లో నేను వడాపావ్‌ తయారు చేసి ఇస్తే గౌరవ్‌ భార్య వాటిని ప్యాక్‌ చేయడంలో సాయం చేసేది. మొదటి రోజు గౌరవ్‌ 50 వడాపావ్‌లను అమ్మడానికి ట్రాఫిక్‌ జంక్షన్ల్‌ వద్దకు వెళ్లాడు. ఎవరూ కొనలేదు. ఇది ఇలానే మరో ఐదు రోజులపాటు కొనసాగింది. ఆ తరువాత గౌరవ్‌ తన మిత్రుల సాయంతో వడాపావ్‌లను అమ్మడం మొదలు పెట్టాడు. ఆ తరువాతి వారం గౌరవ్‌ ఫోన్‌ చేసి ఇంకొన్ని వడాపావ్‌లు తయారు చేసి ఇవ్వమన్నాడు. అలా ఆ ఒక్కరోజే 100 వడాపావ్‌లను అమ్మాము. అప్పటినుంచి ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బిజినెస్‌ అలా ముందుకు సాగిపోతోంది. ప్రస్తుతం రోజుకి 800 వడాపావ్‌లు అమ్మడం ద్వారా నెలకు రూ.2 లక్షలు ఆర్జిస్తున్నట్లు సంతోషంతో చెప్పారు. (చదవండి: గూగుల్‌నే ఫూల్‌ చేశాడు!)

ఐడియాలు... అందరికీ వస్తాయి. అయితే వాటిని అమలు చేయడంలోనే ఉంది అసలు కిటుకు. గౌరవ్‌కి ఐడియా వచ్చింది... దానిని ఆచరణలో పెట్టాడు. మొదట్లో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. ఆ తర్వాత నిలదొక్కుకున్నాడు. కాస్త వ్యాపారం పుంజుకున్నాక గౌరవ్‌ ఒక షాపును అద్దెకు తీసుకుని, రూ.6000 వేతనంతో 8 మంది డెలివరీ బాయ్స్‌ను నియమించుకున్నాడు. వీళ్లంతా ఒక యూనిఫామ్‌ వేసుకుని వడాపావ్‌ను విక్రయిస్తున్నారు. సంకల్పం గట్టిదైతే సాధ్యం కానిది ఏది లేదని గౌరవ్‌ సక్సెస్‌ స్టోరీ మనకు చెప్పకనే చెబుతోంది. – పోకల విజయ దిలీప్‌
 

మరిన్ని వార్తలు