రంగస్థలం ఏడు ప్రపంచాలు

9 May, 2023 03:36 IST|Sakshi
శివానీ (గౌర్‌పంత్‌)

అక్షరాల్లోని రచనలను రంగస్థలం మీదికి తీసుకురావడం తేలిక కాదు. ఎందుకంటే, రచన చదివేటప్పుడు పాఠకుల మదిలో ఎన్నో రంగస్థలాలు ఆవిష్కారం అవుతాయి. తమ ఊహలకు, రంగస్థలానికి చెలిమి ఏర్పడాలి. ఈ విషయంలో నాటక సమాజం ‘థియేటర్‌ నిషా’ విజయం సాధించింది. స్త్రీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రచనలు చేసింది ప్రసిద్ధ హిందీ రచయిత్రి గౌర్‌ పంత్‌ (శివానీ) ఇది ఆమె శతజయంతి సంవత్సరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంత్‌ కథలను నాటకంగా మలిచి ప్రదర్శిస్తోంది థియేటర్‌ నిషా...

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించింది గౌర్‌ పంత్‌. పన్నెండు సంవత్సరాల వయసులో పంత్‌ తొలి కథ ఒక పిల్లల పత్రికలో ప్రచురిత మైంది. టాగూర్‌ ‘శాంతినికేతన్‌’లో చదువుకోవడం తనలోని సృజనను మెరుగుపెట్టుకోవడానికి కారణం అయింది. శివానీ కలం పేరుతో రాసిన ‘మై ముర్గా హూ’ కథకు ఎంతో పేరు వచ్చింది. ‘లాల్‌ హవేలి’ పేరుతో తొలి నవల రాసింది.

ఆ తరువాత ఎన్నో కథలు, నవలలు రాసింది. అయితే ఆమె ఏది రాసినా స్త్రీ జీవితమే కేంద్రంగా ఉండేది. ఆ స్త్రీ తన కాల్పనిక ఊహాలోకం నుంచి దిగివచ్చిన స్త్రీ కాదు. తనకు పరిచయం ఉన్న స్త్రీలు, తాను చూసిన స్త్రీలు... ఇలా ఎందరో జీవితాల నుంచి ఎన్నో అద్భుతమైన పాత్రలు సృష్టించింది శివానీ.

భర్త నుంచి హింసకు గురైన స్త్రీలు, అత్యాచార బాధితులు, కుటుంబ హింస బాధితులు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నవారు... ఎంతోమంది బాధితులు ఆమె రచనల్లో  కనిపిస్తారు. శివానీ కూతురు ఐరా పాండే తల్లి రాసిన కొన్ని కథలను ‘అపరాధి: ఉమెన్‌ వితౌట్‌ మెన్‌’ పేరుతో ఇంగ్లీష్‌లోకి తీసుకువచ్చింది. దీనికి రెండవ భాగం కూడా వచ్చింది.
‘అపరాధి’ రెండవ భాగంలోని కథలను థియేటర్‌ నిషా ‘బిన్ను’ పేరుతో నాటకీకరించింది. ఇందులో బిన్ను, నసీమ్, మిసెస్‌ ఘోష్, లలిత, పాగలియా, మధుబెన్‌తో పాటు ఒక తల్లి పాత్ర కూడా ఉంటుంది. ఏడుగురి జీవితాలు ఏడు ప్రపంచాలై కనిపిస్తాయి.

బిన్ను నుంచి నసీమ్‌ వరకు ఎవరూ ఊహాల్లో పుట్టిన పాత్రలు కాదు. నిజజీవితంలోని మహిళలు. వారి జీవితాలను శివానీ దగ్గరి నుంచి చూసింది. ఒక్కో పాత్రకు ఒక్కో ప్రత్యేకత, శైలి, పోరాటరూపం ఉంటాయి. ‘ఏడు పాత్రలను కలిపి నాటకానికి బిన్ను అని ఎందుకు పేరు పెట్టారు?’ అని అడిగితే ప్లే డైరెక్టర్‌ బాలక్రిష్ణన్‌ ఇచ్చిన సమాధానం ఇది... ‘శివానీ రచనల్లో నాకు బాగా నచ్చిన పాత్ర బిన్ను. అందుకే ఆ పేరు పెట్టాను.

బిన్ను ఎక్కడా, ఎవరికీ తలవంచదు. పురుషులను సవాలు చేస్తుంది. అడ్డంకుల ముళ్లచెట్లను నరికేస్తూ ముందుకు వెళుతుంది. ఆమె స్వరంలో ధిక్కారం, వ్యక్తిత్వంలో ఆత్మగౌరవం కనిపిస్తాయి’ కేరళ నాటకోత్సవాలలో భాగంగా థియేటర్‌ నిషా ప్రదర్శించిన ‘బిన్ను’ నాటకానికి అద్భుతమైన స్పందన లభించింది. ప్రేక్షకుల్లో శివానీ రచనలతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవారితోపాటు ఎంతమాత్రం పరిచయం లేని వారు కూడా ఉన్నారు. అయితే అందరికీ నాటకం నచ్చింది. ‘శివానీ రచనల గురించి తెలియని ఈ తరానికి బిన్ను నాటకం చూస్తే రచయిత్రి దృక్పథం ఏమిటో అర్థమవుతుంది. శతజయంతి సంవత్సరంలో శివానీకి ఒక ఘనమైన నివాళిగా ఈ నాటకాన్ని చెప్పుకోవచ్చు’ అంటుంది సీమా అనే ప్రేక్షకురాలు.
‘బిన్ను’ నాటకంలో...

 

మరిన్ని వార్తలు