లింఫోమా అంటే ఏంటి?.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?

3 Oct, 2021 08:31 IST|Sakshi

Lymphoma disease Precautions: లింఫోమా అనేది రక్త సంబంధిత క్యాన్సర్లలో ఒకటి. తెల్ల రక్తకణాల్లో ఒక రకం కణాలైన లింఫోసైట్స్‌ ఉత్పత్తి చేసి, నిల్వ చేసి, ఆ తర్వాత వాటిని తరలించుకు వెళ్లే కణజాలాల్లో వచ్చే క్యాన్సర్‌ ఇది. దీనిలో ప్రాథమికంగా రెండు రకాలు ఉంటాయి. అవి... 1) హాడ్జ్‌కిన్స్‌ లింఫోమా 2) నాన్‌–హాడ్జ్‌కిన్స్‌ లింఫోమా.  

లక్షణాలు : ∙మెడలో, చంకలో, గజ్జల్లో వాపు వస్తుంది. ఆ వాపు నొప్పి లేకుండానే వస్తుంటుంది. 
ప్లీహం (స్ప్లీన్‌) పెరుగుతుంది. పొట్టలో నొప్పితో పాటు అసౌకర్యంగా ఉంటుంది. 
జ్వరంతో చలిగా అనిపించడం లేదా రాత్రిళ్లు చెమటలు పట్టడం, విపరీతమైన 
నిస్సత్తువ కనిపిస్తుంది. 
నిర్ధారణ పరీక్షలు : ∙రక్త పరీక్షలు ∙బయాప్సీ ∙ఎముక మూలుగ పరీక్ష ∙సెరిబ్రోస్పినల్‌ ఫ్లుయిడ్స్‌ పరీక్ష ∙మాలిక్యులార్‌ రోగ నిర్ధారణ పరీక్షలు ∙ఎక్స్‌రే, సీటీ స్కాన్, 
పెట్‌ స్కాన్‌ వంటి ఇమేజింగ్‌ పరీక్షలు చేయించాలి. వాటిని వైద్యులు క్షుణ్ణంగా పరీక్షించి, లింఫోమా ఉందా, ఉంటే అది ఏ దశలో ఉందనే విషయాన్ని తెలుసుకుంటారు.
చికిత్స : ఒకసారి లింఫోమా ఉందని నిర్ధారణ అయ్యాక ఎలాంటి చికిత్స అందించాలన్న విషయం మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. 
బాధితుడికి ఉన్నది ఏ రకమైన లింఫోమా ∙దాని దశ (అంటే... లింఫోమా కారణంగా ఏయే అవయవాలు ప్రభావితమయ్యాయి) ∙బాధితుడి సాధారణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది... అన్న విషయాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తారు. 

లింఫోమా తర్వాత... 
చికిత్స తీసుకుంటూనే బాధితులు కొన్ని జాగ్రత్తలతో వ్యాధి అనంతర జీవితాన్ని సాధ్యమైనంత ఆరోగ్యంగానే జీవించవచ్చు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. 
పుష్టికరమైన సమతులాహారం తీసుకోవాలి. అయితే అది ఒకేసారి ఎక్కువ పరిమాణంలో కాకుండా... సాధ్యమైనంత తక్కువ మోతాదుల్లో వీలైనన్ని ఎక్కువసార్లు తింటుండాలి.  నోట్లో పుండులాంటిది ఏదైనా ఉంటే దాన్ని గాయపరచని రీతిలో మెత్తటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మసాలాలనూ, బత్తాయిరసాన్ని పూర్తిగా దూరంగా ఉంచాలి. అయితే మిగతా ద్రవాహారాలను పుష్కలంగా తీసుకోవడమే మంచిది.

 డాక్టర్‌ సలహా మేరకు తేలికపాటి స్ట్రెచింగ్‌ వ్యాయామాలతో పాటు, శరీరానికి శ్రమ కలగని రీతిలో కొద్ది పాటి నడక వంటి ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. ∙తగినంత విశ్రాంతి తీసుకుంటూ, కంటి నిండా నిద్రపోవాలి  తాజా గాలి పీల్చాలి. ∙కుంగుబాటు (డిప్రెషన్‌)ను దరిచేరనివ్వకూడదు  ఒకవేళ డిప్రెషన్‌తో బాధపడుతుంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. ఒకసారి లింఫోమా ఉందని తేలాక బాధితులు ఆపైన... లిపిడ్‌లను, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాల పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. అవి మాత్రమే కాదు... డాక్టర్‌ సూచన మేరకు మరికొన్ని పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు