ఈ వయసు వరకు ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయట.. ఆ తర్వాత క్షీణించి..

25 Oct, 2021 11:42 IST|Sakshi

ఈ రోజుల్లో బ్యాక్‌ పెయిన్‌, ఎముకలు, కండరాల సంబంధిత సమస్యలు.. వృద్ధులకు మాత్రమేకాకుండా అన్ని వయసుల వాళ్లు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే తక్షణం కాల్షియం తీసుకోవడం ప్రధమ సలహా. అయితే, ఎముకల ఆరోగ్యం మెరుగుపరచడానికి కేవలం కాల్షియం మాత్రమే సరిపోదు. ప్రొటీన్లు, విటమిన్ ‘డి’లు కూడా బలమైన ఎముకల నిర్మాణానికి తోడ్పడతాయి. ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అంజు సూద్ ఎముకలకు పుష్టిని చేకూర్చే ఆహారాలను సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..


 

అరటి పండు
జీర్ణ ప్రక్రియలో అరటి పండు పాత్ర ఎంతో కీలకం. దీనిలో మాగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకలు, దంతాల నిర్మాణంలో విటమిన్లు, ఇతర మినరల్స్‌ చాలా ముఖ్యం. ప్రతి రోజూ ఒక అరటి పండు తినడం మూలంగా ఎముకలకు అవసరమైన బలం చేకూర్చడమేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.

పాలకూర
కాల్షియం అధికంగా ఉండే ఆకు పచ్చ కూరలు తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా, పుష్టిగా తయారవుతాయి. కప్పు ఉడికించిన పాలకూరలో ప్రతిరోజూ శరీరానికి అవసరమయ్యే 25 శాతం వరకు కాల్షియం అందుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. ఫైబర్‌ అధికంగా ఉండే పాలకూరలో విటమిన్‌ ‘ఎ’, ఐరన్‌ స్థాయిలు కూడా నిండుగానే ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్‌
వీటిలో కాల్షియంతోపాటు, మాగ్నిషియం, పొటాషియం కూడా ఎముకల ఆరోగ్యానికి అవసరమే. ఎముకలు కాల్షియంను పీల్చుకోవడానికి,  నిల్వ ఉండటానికి మాగ్నిషియం ఎంతో సహాయపడుతుంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రకారం.. మీ శరీరంలోని మొత్తం పొటాషియంలో కేవలం దంతాలు, ఎముకలు 85% ఉపయోగించుకుంటాయని వెల్లడించింది.

పాల ఉత్పత్తులు
ఎముకల ఆరోగ్యం ప్రస్థావన వచ్చినప్పుడు ఖచ్చితంగా పాలు, పెరుగు, వెన్నవంటి పాల ఉత్పత్తుల ప్రాముఖ్యం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రకారం కప్పు పాలు, పెరుగు రోజూ తీసుకుంటే సరిపడినంత కాల్షియం అందుతుందని పేర్కొంది.

ఆరెంజ్‌ పండ్లు
తాజా ఆరెంజ్‌ జ్యూస్‌ చాలా మంది ఇష్టంగా తాగుతారు. దీనిలో పోషకాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. దీనిలోని కాల్షియం, విటమిన్‌ ‘డి’ ఎముకలకు బలం చేకూర్చడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. క్రమంతప్పకుండా ఆరెంజ్‌ పండ్లు తింటే.. ముఖ్యంగా ఆస్టియోపొరాసిస్ అనే ఎముకల వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు.

బొప్పాయి
దీనిలో కూడా కాల్షియం స్థాయిలు అధికంగానే ఉంటాయి. 100 గ్రాముల బొప్పాయి ముక్కలు తింటే 20 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుందని నిపుణులు చెబుతున్నారు.

చేపలు
చేపల్లో ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎముకల పుష్టికి ఎంతో ఉపయోగపడతాయి. కొవ్వు అధికంగా ఉండే చేపలు ఫ్రై, కర్రీ, గ్రిల్‌.. ఏవిధంగా తీసుకున్నా పోషకాలు అందుతాయి. 

సాధారణంగా 35 ఏళ్ల వరకు మాత్రమే ఎముకల అభివృద్ధి జరుగుతుంది. ఆ తర్వాత ఎముకలు అరగడం లేదా క్షీణించడం మొదలవుతుంది. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకుని, పోషకాహారాన్ని క్రమంతప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: ఎంత క్యూట్‌గా రిలాక్స్‌ అవుతుందో .. నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది!

మరిన్ని వార్తలు