World Alzheimer's Day: మతిమరుపు వల్ల మెదడు బరువు కోల్పోయి.. క్రమంగా..

19 Sep, 2021 11:46 IST|Sakshi

అల్జైమర్స్‌ అంటే ఏమిటి?

నిర్ధారణ పరీక్షలు

అచ్చం అల్జైమర్స్‌ లాంటివే మరికొన్ని వ్యాధులు

మతిమరుపు నివారణ మార్గాలు

అల్జైమర్స్‌... ఓ చిత్రమైన మరపు. సాధారణ మతిమరపుగా చెప్పలేని విచిత్రమైన  మరపు. పలకపై తుడిచేసిన అక్షరాలు అలా కనిపించీ.. కనిపించకుండా పలుచగా అల్లుకుపోయినట్టుగా అనిపించినట్టుగానే... మెదడు ఫలకంపైన ఉండే జ్ఞాపకాలూ, అనుభవాలూ, నేర్పులూ, నైపుణ్యాలూ, శక్తులూ, సామర్థ్యాలూ... అన్నీ క్రమంగా చెరుపుకుపోయినట్టుగా చెరిగిపోయే రుగ్మత ‘అల్జైమర్స్‌’. బైక్‌ లేదా కారు తాళాలు మరచిపోవడం సాధారణ మతిమరపు. కానీ నేర్చుకున్న ‘డ్రైవింగ్‌’నే మరచిపోవడం... అల్జైమర్స్‌. కిచెన్‌లో అగ్గిపెట్టె ఎక్కడో పెట్టి మరిపోవడం మతిమరపు. కానీ అగ్ని లేదా మంట అనే జ్ఞానాన్నే పూర్తిగా మరచిపోవడం... అల్జైమర్స్‌. మన అందరిలోనూ ఏదో ఒక దశలో కనిపించే సాధారణ అంశం ‘మతిమరపు’. కానీ  దాని తారస్థాయిలా... ఓ రుగ్మతగా కొందరిలో కనిపించే మెదడు సమస్య ఈ ‘అల్జైమర్స్‌’! గతంలో ఈ రుగ్మతతో చాలా కొద్దిమందిమాత్రమే బాధపడేవారు. ఇటీవల ఈ సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతోంది. ఈనెల 21న అల్జైమర్స్‌ డే. ఈ సందర్భంగా అల్జైమర్స్‌ అంటే ఏమిటి, ఎందుకొస్తుంది, దానికి నివారణ, పరిష్కారాలను తెలుసుకోవడం కోసమే ఈ కథనం.  

ఏమిటీ అల్జైమర్స్‌... 
అలాయ్‌ అల్జైమర్స్‌ అనే ఓ జర్మన్‌ సైకియాట్రిస్ట్‌ ఈ రుగ్మతను కనుగొన్నారు. దాంతో అతడి పేరే ఈ వ్యాధికి పెట్టారు. పురుషులతో పోలిస్తే మహిళలు మూడు రెట్లు ఎక్కువగా అల్జైమర్స్‌కు గురవుతారు. దీనికి గురైన మెడికల్‌ హిస్టరీఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వయసు పైబడటం ప్రారంభమయ్యాక అన్ని కణాలతో పాటు మెదడు కణాలూ అంతో ఇంతో శిథిలమైపోతుంటాయి. కానీ కొందరిలో మాత్రం మెదడు కణాలు మరీ ఎక్కువగా నశించిపోతుంటాయి. వారి మెదడు క్రమంగా కుంచించుకుపోతుంటుంది. అందునా ప్రధానంగా ఫ్రంటల్, టెంపోరల్, పెరైటల్‌ అనే భాగాల్లోని కణాలు కుంచించుకుపోవడం వల్ల మెదడు తన బరువులో 20% కోల్పోతుంది. ఇది బయటకు కనిపించేది. కానీ అత్యంత నిశితంగా (మైక్రోస్కోపిక్‌ స్థాయిలో) పరిశీలించినప్పుడు ‘న్యూరో ఫైబ్రిలేటరీ టాంజిల్స్‌’ అనే అమైలాయిడ్‌ ప్రోటీన్లు మెదడు మీద కనిపిస్తాయి. ఆ ఆధారంగానే అల్జైమర్స్‌ ను నిర్ధారణ చేస్తారు.

కారణాలు..
సాధారణంగా చాలావరకు జన్యుపరమైన కారణాలూ, ఆ తర్వాత కొంతవరకు పర్యావరణ అంశాలూ ఈ రుగ్మతకు కారణం కావచ్చని నిపుణుల అంచనా. 

దశలు ఇవీ...
అల్జైమర్స్‌ను తొలిదశల్లో గుర్తుపట్టడం చాలా కష్టం. దాంతో అటు కుటుంబసభ్యులూ, కొన్ని సందర్భాల్లో ఇటు డాక్టర్లు కూడా దీన్ని తేలిగ్గా గుర్టుపట్టలేరు. తొలుత మతిమరపులా కనిపించే ఇది మూడు దశల్లో తన తీవ్రత చూపుతుంది.

తొలిదశలో... 
రోజువారీ చిన్న చిన్న విషయాలు కూడా మరపునకు వస్తుంటాయి. తాము చేయాల్సిన రొటీన్‌ పనులూ మరచిపోతుంటారు. చాలా విలువైన వస్తువులను ఎక్కడో పెట్టేసి, పెట్టిన విషయాన్నీ, చోటునూ మరుస్తుంటారు. చాలా దగ్గరి స్నేహితుల పేర్లనూ... అంతెందుకు పొద్దున్న చదివిన న్యూస్‌పేపర్లోని అంశాలూ మరిచిపోతుంటారు. గతంలో జరిగిన బలమైన సంఘటనలుగాక... ప్రస్తుత  (రీసెంట్‌ పాస్ట్‌) అంశాలను తొలుత మరుస్తుంటారు.


రెండో దశలో... 
తాము ఎక్కడున్నామన్న విషయాన్ని మరచిపోతుంటారు. ఆరోజు తేదీ ఏమిటి, ఆ రోజు ఏ వారం అన్న విషయం గుర్తుండదు. మూడీగా ఉంటూ, ముడుచుకుపోతుంటారు. మూత్రం, మలవిసర్జనలపై అదుపు ఉండకపోవచ్చు. పగలంతా నిద్రపోతూ ఉండి, రాత్రంతా మెలకువతో, అస్థిమితంగా ఉంటారు. 


మూడో దశలో... 
తాము రోజూ ఉపయోగించే రేజర్‌ వంటి వాటినీ గుర్తించలేరు. సరిగా గడ్డం కూడా గీసుకోలేరు. తలుపు గడేసుకోవడం వంటి సాధారణ అంశాల్నీ మరచిపోవచ్చు. దుస్తులు ధరించడం, షేవింగ్, స్నానం చేయాలన్న విషయాలేవీ వారి గమనంలో ఉండకపోవచ్చు. నిలబడలేకపోవడం, నడవలేకపోవడంతో పడక మీద అలా పడి ఉంటారు. అంతకు మునుపు తామంతట తాము రోజూ చేసే అన్ని పనుల్లోనూ ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. కొందరైతే జీవించి ఉండి కూడా, పూర్తి స్పృహలో ఉండికూడా... ఏదీ చేయలేని ఓ దుంపలా (వెజిటేటివ్‌ స్టేట్‌లో) పడి ఉంటారు. 

నిర్ధారణ పరీక్షలు :
సీటీ / ఎమ్మారై స్కాన్‌ నిర్ధారణకు ఉపయోగపడతాయి. కానీ నిర్దిష్టంగా వాటితోనే తెలుస్తుందని చెప్పడానికి లేదు. ఇక స్పెక్ట్, పెట్‌ స్కాన్‌ వంటివి కొంతవరకు ఉపయోగపడతాయి.


చికిత్స:
ఇప్పటికీ ఫలానా మందులే పనిచేస్తాయని నిర్ధారణగా చెప్పడానికి వీల్లేదు. అలాగే ఫలానా మందుల ద్వారా రాకుండా చేసేందుకు వీలూ లేదు. అయితే ఇలా వచ్చేందుకు అవకాశాలున్నవారిలో మాత్రం కొన్ని మందుల ద్వారా దాని తీవ్రతను తగ్గించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి డొనేజిపిల్, గాలాంటమైన్, రివాస్టిగ్మయిన్‌ వంటి అసిటైల్‌ కోలిన్‌ ఔషధాలతో పరిస్థితిని చాలావరకు మెరుగుపరచవచ్చు. వీటన్నింటిలోనూ రివాస్టిగ్మయిన్‌ ప్రస్తుతానికి చాలా మంచి మందు. అలాగే మామాంటైన్‌ అనే మందు ద్వారా అల్జైమర్స్‌ను మరింత ఆలస్యంగా వచ్చేలా చేయవచ్చు.

ఇక ‘అడ్యుకాన్యుమాబ్‌’ అనే మందు మెదడుపై ఏర్పడి అంటుకుపోయినట్లుగా ఉండే ‘అమైలాయిడ్‌’ వంటి ప్రోటీన్‌ ప్లాక్‌ (పాచి వంటిదాన్ని) తొలగించి శుభ్రపరుస్తుంది.  ఈ ఏడాది జూన్‌లో ఈ ఔషధాన్ని ‘ఎఫ్‌డీఏ’ ఆమోదించింది. ఇక మన ఆహారంలో అల్జైమర్స్‌కు మంచి ఔషధంగా పనిచేసేవీ ఉన్నాయి. అవే... విటమిన్‌–ఈ, ఒమెగా ఫ్యాటీ–3 యాసిడ్స్, కర్క్యుమైన్, రెస్వెరటాల్‌ వంటివి. ఇందులో కర్క్యుమైన్‌ అనేది మనం రోజూ వంటలో వాడే పసుపులోనూ, రెస్వెటరాల్‌ పోషకం ద్రాక్షగింజల్లో పుష్కలంగా ఉంటుంది. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌ చేపల్లో ఎక్కువ. విటమిన్‌–ఈ పసుపురంగు పండ్లలో పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు... క్యారట్‌లో ఉండే ‘బీటా కెరోటిన్‌’, ఆపిల్స్‌లో ఉండే ‘యాంథోసయనిన్‌’, బెర్రీ పండ్లలో ఉండే ‘ఫ్లేవోన్స్‌’లో కూడా అల్జైమర్స్‌ను నివారించే అంశాలున్నాయి.

నివారణ...
మంచి పోషకాలను ఇచ్చే సమతుల ఆహారం, ఆకుపచ్చని ఆకుకూరలు, తాజా కూరగాయలు, తాజా పండ్లు, చేపలు, పసుపు, క్యాటర్, బెర్రీ, రేగుపండ్లు, ద్రాక్ష, దానిమ్మ, అవకాడో (బటర్‌ ఫ్రూట్‌), వాక్కాయ (కలిమకాయ/కలెంకాయ) వంటివి అన్నీ అల్జైమర్స్‌ను చాలావరకు నివారిస్తాయి. ∙ పైవాటికి తోడు పొగతాగడం, ఆల్కహాల్‌ వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటం, కనీసం రోజుకు 20 నిమిషాలకు పైబడి చేసే వ్యాయామాలు (శరీరాన్ని శ్రమకు గురిచేయకుండా నడక వంటి వ్యాయామాలు), కంటినిండా నిద్రపోవడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు డయాబెటిస్, హైబీపీ వంటి జీవనశైలి రుగ్మతలను నియంత్రణలో పెట్టుకోవడం వంటివి అల్జైమర్స్‌ నివారణకు తోడ్పడతాయి. ∙మంచి మంచి పుస్తకాలు చదవడం లేదా కొత్త భాషలనూ, విద్యలను నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను పెంచుకోవడం, మెదడును చురుగ్గా ఉంచేలా చేసే పజిల్స్‌ (ప్రహేళికలను)   పరిష్కరించడం వంటి ఆరోగ్యకరమైన హాబీలు అల్జైమర్స్‌ను దూరంగా ఉంచుతాయి. ∙ఫ్రెండ్స్, బంధువులతో ఆరోగ్యకరమైన సంబంధాలను నెరపడం, మంచి చురుకైన సామాజిక జీవనాన్ని గడపటం వంటి అంశాలన్నీ అల్జైమర్స్‌ను నివారిస్తాయి... లేదా వీలైనంత ఆలస్యం చేస్తాయి. 


మన దేశంలో...  
ప్రస్తుతం యూఎస్‌ వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో ‘అల్జైమర్స్‌’తో బాధపడేవారి సంఖ్య ఇప్పటికి ఒకింత తక్కువే గానీ వీరి సంఖ్య క్రమంగా విపరీతంగా పెరుగుతోంది. 2031 నాటికి మన దేశంలోని జనాభాలో సీనియర్‌ సిటిజెన్ల సంఖ్య 19.4 కోట్లు ఉండవచ్చనీ... వీరిలో దాదాపు 4.4% – 5% వరకు అలై్జమర్స్‌ బాధితులు ఉండవచ్చని ఒక అంచనా. 

అచ్చం అల్జైమర్స్‌ లాంటివే... 
అచ్చం అల్జైమర్స్‌లాగే అనిపించేవీ, అలాంటి లక్షణాలే కనిపించేవీ మరికొన్ని కండిషన్స్‌ ఉంటాయి.  కొన్ని సందర్భాల్లో వాటిని అల్జైమర్స్‌గా పొరబడే ప్రమాదం కూడా ఉంటుంది. కాకపోతే అల్జైమర్స్‌కు న్యూరో ఫిజీషియన్ల ఆధ్వర్యంలో చికిత్స జరగాల్సి ఉండగా... అవే లక్షణాలతో వ్యక్తమయ్యే వీటికి న్యూరోసర్జన్‌ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంటుంది. అవి... ∙నార్మల్‌ ప్రెషర్‌ హైడ్రోసెఫాలస్‌ : ఈ కండిషన్‌లో మెదడు కుహరంలోని అదనపు  ‘సెరిబ్రో స్పైనల్‌ ఫ్యూయిడ్‌’ అనే ద్రవాన్ని షంట్‌ శస్త్రచికిత్స ద్వారా దారి మళ్లించి నార్మల్‌గా మారుస్తారు. ∙క్రానిక్‌ సబ్‌డ్యూరల్‌ హిమటోమా: హిమటోమా అంటే రక్తం పేరుకుపోయి గడ్డకట్టినట్లుగా కావడం. మెదడులో ఇలా జరిగినప్పుడు ‘లోకల్‌ అనస్థీషియా’ ఇచ్చి తలకు రెండు చిన్న రంధ్రాల ద్వారా పరిస్థితిని చక్కబరుస్తారు. ∙ట్యూమర్స్‌: అంటే గడ్డలు అన్న విషయం తెలిసిందే. మెదడులోని ఫ్రంటల్, టెంపోరల్‌ అనే భాగాల్లో గడ్డలు వచ్చిన సందర్భాల్లోనూ శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగిస్తారు. ఇలాంటివే ‘అల్జైమర్స్‌’ను పోలిన మరికొన్ని కండిషన్లూ ఉన్నాయి. వాటిని శస్త్రచికిత్స ద్వారా సరిచేయాల్సి ఉంటుంది.


-డాక్టర్‌ పి. రంగనాథం
సీనియర్‌ కన్సల్టెంట్‌ 
న్యూరో సర్జన్‌

మరిన్ని వార్తలు