Typhoid Diet: టైఫాయిడ్‌ టైంలో ఇవి తినడం చాలా ప్రమాదకరం.. మరేం తినాలి?!

23 Sep, 2021 11:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పరిసరాల అపరిశుభ్రత కారణంగా టైఫాయిడ్‌, డెంగ్యూ, చికెన్‌గున్యా, కలరా, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటిల్లో టైఫాయిడ్‌ జ్వరం కొంత ప్రమాదకారనే చెప్పవచ్చు. సాధారణంగా టైఫాయిడ్‌ జ్వరం కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్‌ సంక్రమిస్తుంది. అయితే నిపుణులు సూచించిన ఈ ఆహార అలవాట్లతో ఏవిధంగా టైఫాయిడ్‌ నుంచి ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం..

టైఫాయిడ్‌ లక్షణాలు
ఏ వ్యాధినైనా ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత సులువుగా దానిని నయం చేయవచ్చు. టైఫాయిడ్‌ను కూడా తేలికగా గుర్తించవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, నీరసం, వాంతులు, విరేచనాలు లేద మలబద్ధకం, అలసట..వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. 

ఈ ఆహారం అస్సలు తీసుకోకూడదు..
టైఫాయిడ్‌ జ్వరం నుంచి త్వరగా తేరుకోవడానికి కొన్ని రకాల ఆహార అలవాట్లు తప్పక పాటించవల్సి ఉంటుంది. ముఖ్యంగా తొక్క తీయకుండా తినగలిగే పండ్లు, కూరగాయాలు, ఘాటుగా ఉండే ఆహారం, నెయ్యి లేదా నూనెతో వండిన పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీ కడుపులో మంట లేదా తాపాన్ని పుట్టించే అవకాశం ఉంది.

ఇవి కూడా తినకూడదు
కడుపులో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే కొన్ని రకాల కూరగాయలు అంటే.. క్యాబేజీ, బ్రొకోలీ, క్యాలీఫ్లవర్‌ వంటి వాటిని కూడా తినకపోవడం మంచిది. అలాగే వ్యాధి నివారణకు ఆటంకాలుగా పరిణమించే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి కూడా తినకూడదు.

మరేం తినాలి?
టైఫాయిడ్‌తో బాధపడే వారికి దివ్యౌషధం ఏంటంటే.. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్ధాలు.  అంటే.. సోయా బీన్స్‌, వివిధ రకాల గింజలు (నట్స్‌), భిన్న రకాలైన విత్తనాలు, గుడ్లు.. వంటివి తినాలి. ఆలుగడ్డ వేపుడు, ఉడికించిన అన్నం.. వంటి కార్బొహైడ్రేట్స్‌ పుష్కలంగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి. పాలు, పన్నీర్‌ వంటి పాల ఉత్పత్తులు కూడా తినొచ్చు. అలాగే టైఫాయిడ్‌ నుంచి కోలుకునే ప్రక్రియలో మరిన్ని నీళ్లు తాగడం మాత్రం మర్చిపోకూడదు.

ఈ ఆహారపు అలవాట్లతో మీ ఆరోగ్యాన్ని మరింత పదిలంగా కాపాడుకోవచ్చనేది నిపుణుల మాట.

చదవండి: Health Tips: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇది తరచుగా తింటే సరి!

మరిన్ని వార్తలు