Thinkesh Koushik Inspiring Story: బతకడం కష్టమని పెదవి విరిచారు.. కట్‌చేస్తే

13 May, 2022 12:58 IST|Sakshi

ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ

''ఎన్ని కష్టాలు కవ్వించినా సరే...మనిషి గుండెలో ఆత్మవిశ్వాసం అనే జెండా రెపరెపలాడుతూనే ఉండాలి. పెదాలపై చిరునవ్వు ధగధగమని మెరుస్తూనే ఉండాలి..''

హరియాణాలోని ఝజ్జార్‌లో ఆ వీధికి వెళ్లి ‘చురుకైన పిల్లాడు ఎవరు?’ అనే ప్రశ్నకు అన్ని జవాబులు ఒకే దిక్కు వెళ్లేవి. ఆ అబ్బాయి పేరు తిన్‌కేష్‌ కౌశిక్‌. తొమ్మిదేళ్ల వయసులో దురదృష్టకరమైన రోజు ఒక ప్రమాదంలో రెండు కాళ్లు, ఎడమ చేయిని పోగోట్టుకున్నాడు. బతకడం కష్టం అని పెదవి విరిచారు వైద్యులు.

‘కచ్చితంగా బతుకుతాడు’ అనే ఆత్మబలంతో ఉన్నారు తల్లిదండ్రులు. చివరికి వారి ఆత్మబలమే నెగ్గింది. చికిత్స జరిగిన మూడు సంవత్సరాల కాలంలో పిల్లాడిని కంటికి రెప్పలా కాచుకున్నారు. ఆ తరువాత....అమ్మ సహాయంతో రోజూ బడికి వెళ్లడం మొదలుపెట్టాడు కౌశిక్‌. పాఠాలు వినడం తప్ప స్నేహితులతో ఆటలు లేవు. అయితే స్నేహితులెప్పుడూ అతడిని చిన్నచూపు చూడలేదు.

రకరకాల ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ కూడా కౌశిక్‌కు కృత్రిమ కాలు సమకూర్చారు తల్లిదండ్రులు. దీనివల్ల బరువైన  పనులు చేసే అవకాశం లేనప్పటికి తనకు తానుగా కాలేజికి వెళ్లడానికి ఉపకరించింది.

డిగ్రీ పూర్తయిన తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు కౌశిక్‌. శారీరకశ్రమ లేకపోవడంతో బాగా బరువు పెరిగాడు. ఈ బరువు తనకు అదనపు సమస్యగా మారింది. దీంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. కొంతకాలం తరువాత...

గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన రెండు కిలోమీటర్ల మారథాన్‌లో తాను పాల్గొన్న వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశాడు. అది వైరల్‌ అయింది. ఈ వీడియోను చూసి స్పందించిన హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ ప్రోస్థటిక్‌  లెగ్స్‌ను స్పాన్సర్‌ చేసింది. ఇది తన జీవితంలో టర్నింగ్‌పాయింట్‌గా నిలిచింది.ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కావాలనేది తన లక్ష్యంగా మారింది.

నాగ్‌పుర్‌ కేంద్రంగా పనిచేసే ఫిట్‌నెస్‌ అండ్‌ న్యూట్రిషన్‌ కమ్యూనిటీ ‘ఫిట్టర్‌’తో తన ఫిట్‌నెస్‌ జర్నీ మొదలైంది. స్విమ్మింగ్‌ నుంచి సైకిలింగ్‌ వరకు అక్కడ శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలో నొప్పుల బాధలు ఇంతా అంతా కాదు. అయితే ట్రైనర్స్‌ ఉత్తేజకరమైన మాటలతో అతడిని నిరాశకు లోనుకానివ్వలేదు. సింగిల్‌ హ్యాండ్‌తో పవర్‌ఫుల్‌ స్ట్రెంత్‌ను ఎలా సమకూర్చుకోవచ్చు అనే కోణంలో కోచ్‌ కమల్‌శర్మ ఎన్నో వీడియోలను తనకు షేర్‌ చేశాడు. అవి తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఫిట్టర్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ ఛాలెంజ్‌లో పాల్గొనడం కౌశిక్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఐసిఎన్‌–ఇండియాకు అథ్లెట్‌ అంబాసిడర్‌గా నియామకం కావడంతో తనలో గట్టి ఆత్మవిశ్వాసానికి పునాది పడింది. ఇక నేపాల్‌లో బంగీ జంప్‌ చేయడం తన ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడికో తీసుకెళ్లింది.

లద్దాఖ్‌లో దివ్యాంగుల కోసం ఫిట్‌నెస్‌ క్లాసులు నిర్వహించాడు కౌశిక్‌. తన అనుభవాలను వారితో పంచుకున్నాడు. అపారమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగించాడు. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. అయితే తన కల అక్కడితో ఆగిపోలేదు. ఆస్ట్రేలియాలో పర్వతారోహణ చేయాలనేది తన తాజా కల. గట్టి సంకల్పబలం ఉన్నవారికి తమ కలను నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు కదా! 

మరిన్ని వార్తలు