ఆలోచనా లోచనం

6 Dec, 2021 04:31 IST|Sakshi

మంచిమాట

ఆలోచన మెదడుకు సంబంధించినది, ప్రేమ హృదయానికి సంబంధించినది. ఆలోచన, ప్రేమ రెండూ మనిషి ప్రగతి కి అత్యంత ఆవశ్యకమైనవి. ఆలోచన (వివేకం) పరిపక్వ స్థితికి చేరితే ప్రేమ ప్రకాశిస్తుందంటారు. అందుకే జ్ఞానోదయమైనవారు – వారు ఏ దేశానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా ప్రేమ మూర్తులై ఉంటారు. వారు మాట్లాడినా, మౌనంగా ఉన్నా, ఏమైనా పని చేసినా, ఏమీ చేయక ఊరకే ఉన్నా వారికి, ఇతరులకూ మంచే జరుగుతుంది. వారు ఏ మత ఆచారాలను పాటిస్తూ ఉండకపోవచ్చు. ఏ మతాన్ని ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ ఉండకపోవచ్చు. మతాలకు అతీతంగా ప్రేమ, జ్ఞానాలను వారు ధారాళంగా పంచుతూ ఉంటారు. 

ఆలోచించగలిగే శక్తి గానీ, ఆలోచించాలన్న తపన గాని లేని మనిషి జీవించి ఉన్నట్టా? అసలు ఆలోచించని మనిషికి, జంతువుకు తేడా ఏమిటి? జంతువులు కూడా వాటికున్న సహజ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కొంత ఆలోచించటాన్ని గమనిస్తాము. మరి మనిషన్నవాడు ఆలోచనా రహితంగా, వివేకహీనుడై జీవిస్తే ఎలా? ప్రపంచంలోని అన్ని మత గ్రంథాల లక్ష్యం మనిషిలో ఆలోచనా శక్తిని రేకెత్తించాలనే. ఎప్పుడైతే ఆలోచనా శక్తి, వివేకం వృద్ధి అవుతాయో మంచి ఏదో, చెడు ఏదో సత్యమేదో, అసత్యమేదో, నిత్యమేదో, అనిత్యమేదో అతడే తెలుసుకోగలడు. సరైన ఎంపిక చేసుకుని చక్కగా జీవించగలడు. ఇతర జీవులను సంతోషంగా జీవింపజేయగలడు. 

భగవంతుడున్నాడని నమ్మటమో, నమ్మకపోవటమో అంత ముఖ్యం కాదు. పునర్జన్మ ఉందనో, లేదనో భావించటమూ అంత ముఖ్యం కాదు; స్వర్గ నరకాలు ఉన్నాయని విశ్వసించటమో, విశ్వసించకపోవటమో అదీ అంత ముఖ్యం కాదు. మరి ఏది ముఖ్యం? మనిషిగా జన్మించాము కాబట్టి మనుషుల మధ్య జీవించాలి. అది తప్పదు. అయితే ఎలా జీవించాలి? ఎలా జీవిస్తే సుఖంగా, సంతోషంగా మనశ్శాంతితో జీవించగలమో తెలుసుకుని అలా జీవించాలి. అలా జీవించాలంటే వివేకం కావాలి. ఆ వివేకాన్ని కల్గించటమే శాస్త్రాల, మతాల ఉద్దేశం.

మన తల్లిదండ్రుల పట్ల, భార్యా పిల్లల పట్ల, బంధుమిత్రుల పట్ల, ఇరుగుపొరుగు వారి పట్ల మనం ఎలా నడుచుకుంటే సుఖంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండగలమో తెలుసుకోవాలంటే వివేకం తప్పక ఉండాల్సిందే. చీకట్లో నడవాలంటే దీపపు కాంతి ఉండాల్సిందే. లేకపోతే ఏదో ఒక గుంటలో పడి చస్తాము. అదేవిధంగా వివేకమనే వెలుగు లేక అంధకారమయమైన (ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని) జీవితంలో పయనిస్తే కష్టనష్టాలు తప్పవు. పతనం తప్పదు. మనలో వివేక జ్యోతి వెలగాలంటే మనలో ప్రశ్నించే తత్వం వృద్ధి చెందాలి. ఆలోచించే గుణం అధికమవ్వాలి. అంటే గుడ్డిగా విశ్వసించటాన్ని మానుకోవాలి.

ఏకాంతంగా ప్రశాంతంగా మౌనంగా కాలాన్ని గడపటాన్ని చేర్చుకోవాలి. అప్పుడే ఆలోచించటానికి అవకాశమేర్పడుతుంది. దేవుడు–దయ్యం, స్వర్గం– నరకం, పుణ్యం, పాపం వీటన్నిటినీ గూర్చి యోచించి, ఆలోచించిన పాశ్చాత్య తత్వవేత్త (ఫ్రెంచ్‌ ఫిలాసఫర్‌) వాటి ఉనికిని సందేహించాడు. ఆయన అన్నాడు. ‘...అంటే నేను యోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను’ అని అన్నాడు. అంటే యోచన ఆలోచన అన్నది ఒకటుంది నాలో. కాబట్టి నేను కూడా ఉన్నట్టే అని ధ్రువీకరించాడు. దాన్ని బట్టి ఆలోచనా శక్తికున్న ప్రాధాన్యతను మనం ఇట్టే గుర్తించవచ్చు. అందుకే ....‘‘మనిషి ఆలోచనా శక్తి గల ప్రాణి’’ అంటారు. 

వివేకం, ఆలోచనా శక్తి లేకపోతే మంచి చేయాలనుకున్నా కీడే కలుగుతుంది. ఒరే! కాస్త విశ్రాంతి తీసుకుంటాను. నీవు విసనకర్రతో విసురుతూ నా పక్కన కూర్చో అన్నాడట గురువుగారు. శిష్యుడు విసురుతూ ఉన్నపుడు ఒక ఈగ పదే పదే గురువుగారి తలపై వాలింది. శిష్యునికేమో గురువుగారి పట్ల అమిత భక్తి ఉంది. ఈగపై విపరీతమైన కోపం వచ్చింది. దగ్గరలో ఉన్న రోకలి ని రెండు చేతులతో ఎత్తి పట్టుకుని ఈసారి మా గురువు గారికి నిద్రాభంగం చెయ్, నీ కథ చెబుతా అనుకుంటూ వేచి ఉన్నాడు. ఈగ గురువు గారి గుండుపై కూర్చుంది. శిష్యుడు శక్తి కొద్దీ రోకలితో కొట్టాడు. ఈగ ఎగిరిపోయింది, గురువుగారి గుండు బద్దలైంది. సరైన ఆలోచన లేకపోతే జరిగేది అదే అంటారు స్వామి వివేకానంద. నిజమే.

మంచిగా జీవిస్తూ, ఇతరులకు మంచి చేయటమే సర్వమత సారం. కాని మంచి అంటే ఏమిటో తెలియాలిగా? అదీ తెలీకనే కదా మతాలన్నీ మారణ హోమాలు చేసింది, మానవత్వాన్ని మంట కలిపింది. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను అని రేనే డెక్టార్, అంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అని ఇంకొక తత్వవేత్త అంటారు. ప్రేమ ఉంది కాబట్టి నేను ఉన్నట్టే అని అంటే ప్రేమకు పెద్ద పీట వేసినట్టే. – రాచమడుగు శ్రీనివాసులు 

మరిన్ని వార్తలు