Road Safety: ఆస్పత్రిలోనే పరిచయం.. పెళ్లి.. సంతోషంగా ఉన్నాం

10 Jul, 2021 09:57 IST|Sakshi

వీల్‌చెయిర్‌ రోడ్‌ సేఫ్టీ అంబాసిడర్‌

రోడ్డు ప్రమాదాల గురించి మనం రోజూ వింటున్నాం. చూస్తున్నాం. కొన్నింటిని స్వయంగా ఎదుర్కొంటున్నాం. వీటిని ఎలా నివారించాలా అని ఎవరికి వారు అనుకుంటూ ఉంటారు. కానీ, చాలా మంది అజాగ్రత్తగానే ఉంటారు. రోడ్డు భద్రత అతి ముఖ్యమైనదని, తమ జీవితాన్నే ఉదాహరణగా చూపుతూ అవగాన పెంచుతున్నారు తిరువనంతపురంలో ఉంటున్న జార్జ్‌ కె థామస్, జాస్మిన్‌ ఐజాక్‌ దంపతులు.  రోడ్డు సేఫ్టీ అంబాసిడర్లుగా తిరువనంతపురంలో తమదైన ముద్ర వేసిన థామస్, జాస్మిన్‌ జంట రహదారి ప్రాముఖ్యతను ప్రజలకు ముఖ్యంగా యువతలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజా రవాణ, రహదారుల వల్ల కలిగే అసౌకర్యాల గురించి తెలియజేస్తూ రోడ్‌ సేఫ్టీ పై పుస్తకం రాశారు. రేపటి తరానికి కరోనా మన కళ్లపై ఉన్న ముసుగును అనేక విధాలుగా తొలగించిందని వివరిస్తారు థామస్‌.

ప్రమాదం చేసిన పరిచయం
కొన్ని అనుకోని సంఘటనలు జీవితాన్ని ఓ కొత్త దిశవైపుగా నడిపిస్తాయి. ఎనిమిదేళ్ల కిందట జరిగిన సంఘటనను 35 ఏళ్ల థామస్‌ ప్రస్తావిస్తూ ‘‘మోటార్‌ బైక్‌పై వెళుతుండగా ఆటో రిక్షా ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. అప్పుడు వెన్నుపూసకు తీవ్రమైన గాయలయ్యాయి. సర్జరీలు జరిగాయి. అయినా, వీల్‌చెయిర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అదే రోజు జాస్మిన్‌ తన సోదరితో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతున్నప్పుడు ప్రమాదం జరిగింది.

తనూ వీల్‌చెయిర్‌కి పరిమితం అయ్యింది. ఇద్దరం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కలుసుకున్నాం. మా అభిరుచులు కలవడంతో 2014లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం అని వివరిస్తారు. జాస్మిన్‌ మాట్లాడుతూ ‘మా పెద్దవాళ్లు భయపడ్డారు. కానీ, మా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నాం. అయితే ఆరోగ్యంగా ఉన్న మేం రోడ్డు ప్రమాదాల కారణంగా ఇలా వీల్‌ చెయిర్‌కు అంకితమయ్యాం. ఈ పరిస్థితి మరెవ్వరికీ రాకూడదన్నదే మా ప్రయత్నం. అందుకే ప్రజల్లో రోడ్‌ సేఫ్టీ పట్ల అవగాహన కలిగించాలని తపిస్తున్నాం. ముఖ్యంగా రేపటి తరానికి మరింత అవగాహన అవసరం. అందుకే, చిన్నపిల్లలకు రోడ్డు భద్రత పట్ల జాగ్రత్తలు చెబుతున్నాం’ అని తమ ఆలోచనలను తెలియజేస్తారు ఈ జంట.  

మరిన్ని వార్తలు