ముగ్గురూ ముగ్గురే

20 Feb, 2021 07:41 IST|Sakshi
నవోమి ఒసాక

భూకంపాలో, సునామీలో వస్తే తప్ప జపాన్‌ సాధారణంగా వార్తల్లో ఉండదు. తన మానాన తను ఉంటుంది. అయితే ఇప్పుడా జపాన్‌ని ముగ్గురు మహిళలు వార్తల్లోకి తెచ్చారు. ఆ ముగ్గురూ.. సికొ హషిమొటొ (56), మమొకొ నొజొ (22), నవోమి ఒసాక (23). షహిమొటో రాజకీయ నాయకురాలు. మమొకొ నొజొ విద్యార్థిని. నవొమి ఒసాక టెన్నిస్‌ ప్లేయర్‌. 

ఒక ఆర్డర్‌లో అయితే ముందుగా నవొమి ఒసాక గురించి చెప్పుకోవాలి. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఇవాళ ఉమెన్స్‌ సింగిల్‌ ఫైనల్స్‌ ఆడుతున్నారు ఆమె. అంటే ఫైనల్‌ వరకు వచ్చారని గొప్పగా చెప్పుకోవడం కాదు. శుక్రవారం నాడు టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ని ఓడించి మరీ ఆమె ఫైనల్స్‌కి చేరున్నారు. ఈ రోజు ఆమె తలపడుతున్నది అమెరికన్‌ ప్లేయర్‌ జెన్నిఫర్‌ బ్రాడీ మీద. జెన్నిఫర్‌ ర్యాకెట్‌ శక్తీ తక్కువేమీ కాదు. పైగా ఒక అమెరికన్‌ (సెరెనా) ని ఒసాక ఓడించినందుకు బదులుగా ఇంకో అమెరికన్‌ (జెన్నిఫర్‌) ఆమెను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలి అని యూఎస్‌ లోని సెరెనా అభిమానులు కోరుకుంటున్నారు. వారికంటే ఎక్కువగా.. టైటిల్‌ను ఒసాక గెలుచుకోవాలని జపాన్‌ క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సెరెనానే ఓడించిందంటే జెన్నిఫర్‌ ఎంత అనే అనుమానాలూ అమెరికాలో ఉన్నాయి. ఒసాక జపాన్‌ దేశస్థురాలే అయినా ఉండటం అమెరికాలోనే. 


సికొ హషిమొటొ

ఇప్పుడిక రాజకీయ నేత హషిమొటో గానీ, విద్యార్థిని మమొకో గానీ.. ఈ ఇద్దరిలో మొదట ఎవరి గురించి చెప్పుకున్నా రెండోవారిని తక్కువ చెయ్యడం కాదు. వేర్వేరు రంగాల వారైనా ఇద్దరూ ఒకే విషయమై వార్తల్లోకి వచ్చినవారు. వయసులో పెద్ద కనుక హషిమొటోకే ప్రాధాన్యం ఇద్దాం. గురువారం ఆమె ఒలింపిక్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ చీఫ్‌గా నియమితులయ్యారు. ప్రభుత్వం నుంచి వస్తుంది ఆ ఆర్డర్‌. ఇంకో ఐదు నెలల్లో జపాన్‌లో ఒలింపిక్‌ గేమ్స్‌ ఉండగా.. జరిగిన నియామకం ఇది. కమిటీకి చీఫ్‌గా ఇటీవలి వరకు ఉన్న యషిరో మొరి (83) గత శుక్రవారం ఆ పదవికి తప్పనిసరై రాజీనామా చేయవలసి వచ్చింది.

జపాన్‌ మాజీ ప్రధాని కూడా యహిరో మొరి. ఆయనంతటి వారు రాజీనామా చేయవలసి రావడానికి కారణం.. మహిళలపై ఆయన చేసిన కామెంట్లే. ‘‘మీటింగ్స్‌లో ఈ ఆడవాళ్లు ఓవర్‌గా మాట్లాడతారబ్బా.. అదేం అలవాటో’’ అని అన్నారు ఆయన. ఆ మాటలే ఆయన పదవి మీదకు కత్తిని తెచ్చాయచి. అలా ఖాళీ అయిన ఆ సీట్లోకే హషిమొటో వచ్చారు. ప్రస్తుతం ఆమె జపాన్‌ కేబినెట్‌లో ‘ఈక్వాలిటీ మినిస్టర్‌’. ఆ మంత్రి బాధ్యతలకు కొంతకాలం విరామం ఇచ్చి ఒలింపిక్స్‌ ఏర్పాట్ల విధి నిర్వహణలో ఉండబోతున్నారు. 


మమొకొ నొజొ

అసలు ఆ పెద్దాయన యషిరో మొరి ఒలింపిక్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ చీఫ్‌గా నిష్క్రమించడానికి కారణం మమొకొ నొజొ విద్యార్థిని. ‘ఆ స్థాయిలో ఉండి మహిళలపై అలాంటి కామెంట్స్‌ చేయడం తగని పని. ఆయన వెంటనే రాజీనామా చేయాలి’ అని నొజొ దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమమే లేవదీశారు.‘డోంట్‌ బి సైలెంట్‌’ అంటూ ఆన్‌లైన్‌లో లక్షా 50 వేల సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. టోక్యోలోని కియో యూనివర్శిటీలో నాలుగో సంవత్సరం అర్థశాస్త్రం చదువుతున్నారు ఆమె. చదువే కాకుండా.. ‘నో యూత్‌ నో జపాన్‌’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి, సామాజిక అంశాలపై ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నారు.

జపాన్‌లో పురుషాధిపత్యం ఎక్కువగా ఉందని అంటున్న నొజొ.. స్త్రీ పురుష అసమానతలపై స్పందించే వారు జపాన్‌లో నానాటికీ తగ్గిపోతున్నారని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్‌ కమిటీ చీఫ్‌ని మార్చేలా చేయడం ద్వారా నొజొ విజయం సాధించారు. ఒలింపిక్‌ కమిటీకి కొత్తగా వచ్చిన హషిమొటొ ఆ స్థానంలోకి వచ్చిన ఒక మహిళగా విజేతగా నిలిచారు. ఈరోజు జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో ఒసాకా తన ప్రత్యర్థిని ఓడిస్తే అదొక విజయం అవుతుంది. ముగ్గురూ ముగ్గురే. 

మరిన్ని వార్తలు