మన రక్షణా దళంలో ఆ ముగ్గురు... స్ఫూర్తి ప్రదాతలు..!

9 Nov, 2021 10:46 IST|Sakshi
స్నేహ, కీర్తి, భూమిక

నిసాలో శిక్షణ పొందిన 62 మంది అసిస్టెంట్‌ కమాండెంట్స్‌

వారిలో ముగ్గురు మహిళామణులు

CRPF Assistant Commandant: విమానాశ్రయాలు, ఓడరేవులు, అణు ఇంధన సంస్థలు... ఇలా ఏ సున్నిత ప్రాంతమైనా అది సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) పహారాలో ఉంటుంది. ఈ దళంలో పని చేయడానికి ఎంపికైన వారికి హైదరాబాద్‌ శివార్లలో ఉన్న హకీంపేటలోని నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడమీలో (నిసా) ట్రైనింగ్‌ ఇస్తారు. ఈసారి శిక్షణ పొందిన 62 మందిలో స్నేహ ప్రదీప్‌ పాటిల్, భూమిక వార్షినే, కీర్తి యాదవ్‌ అనే ముగ్గురు మహిళలున్నారు.   

వ్యవసాయ కుటుంబం నుంచి...
మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన స్నేహ ప్రదీప్‌ పాటిల్‌ తండ్రి రైతు. తల్లి గృహిణి. కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చేసిన స్నేహ... యూపీఎస్సీ పరీక్షల కోసం ఢిల్లీలో శిక్షణ తీసుకున్నారు. ఆమెతో పాటు శిక్షణపొందిన అనేక మంది సీఐఎస్‌ఎఫ్‌లోకి అడుగుపెట్టారు. ఆ స్ఫూర్తితో ఆమె సీఐఎస్‌ఎఫ్‌ను ఎంచుకున్నారు. ‘శిక్షణలో పురుషులకు, స్త్రీలకు వేర్వేరు అంశాలు ఉండవు. ఈ నేపథ్యంలో మహిళలు మరింత కష్టపడాల్సి ఉంటుంది. సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ అధికారిగా దేశ సేవ చేయాలన్నది నా లక్ష్యం. అది సాధ్యం కాకుంటే సీఐఎస్‌ఎఫ్‌ ద్వారా సేవ చేస్తా’ అన్నారు స్నేహ. 

చదవండి: గుడ్‌న్యూస్‌.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..!

తండ్రిని చూసి స్ఫూర్తి పొంది...
హర్యానా, రివాడీ జిల్లాకు చెందిన కీర్తి యాదవ్‌ తండ్రి ప్రతాప్‌ సింగ్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి. ప్రస్తుతం వారెంట్‌ ఆఫీసర్‌. కోల్‌కతాలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌ నుంచి బీఎస్సీ కెమిస్ట్రీ (ఆనర్స్‌) చేశారామె. ఢిల్లీలో ఉండి సివిల్స్‌కు తర్ఫీదు పొందుతుండగా... సీఏపీఎఫ్‌ (సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్సెస్‌) ద్వారా నిసాలో అడుగుపెట్టారు. ‘నిసాలో శిక్షణ అనేక కొత్త విషయాలను నేర్పింది. సెప్టెంబర్‌లో జరిగిన వారం రోజుల గ్రేహౌండ్స్‌ శిక్షణలో జంగిల్‌ క్యాంప్‌ జరిగింది. ఆ సమయంలో తీవ్ర వర్షాలు కురుస్తుండటంతో టాస్క్‌ కష్టసాధ్యమైంది. నా టార్గెట్‌ సివిల్స్‌’ అని కీర్తి తెలిపారు. 

ఎన్‌సీసీలో సక్సెస్‌ కావడంతో...
ఉత్తరప్రదేశ్, బదాయు ప్రాంతానికి చెందిన భూమిక వార్షినే అలహాబాద్‌ యూనివర్శిటీ నుంచి బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌) చేశారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన భూమిక కళాశాల రోజుల నుంచి ఎన్‌సీసీలో కీలకంగా వ్యవహరించే వారు. ఈమె చూపిన ప్రతిభ ఫలితంగా యూత్‌ ఎక్సేంజ్‌ కార్యక్రమంలో శ్రీలంక వెళ్లి వచ్చారు. ఆ సమయంలోనే రక్షణ బలగాల్లో చేరాలని బలంగా నిర్ణయించుకున్నారు.

‘నిసాలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. వార్షిక క్రీడా పోటీల్లో ఉత్తమ అథ్లెట్‌గా పీవీ సింధు చేతుల మీదుగా సత్కారం అందింది. శిక్షణలో చూపిన ప్రతిభతో పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో ప్లటూన్‌ కమాండర్‌ అయ్యా. మహిళలకు స్ఫూర్తిదాయకంగా మారాలని, నన్ను చూసి మరింత మంది యువతులు సీఐఎస్‌ఎఫ్‌లోకి అడుగుపెట్టాలన్నదే నా లక్ష్యం’ అని భూమిక వివరించారు. 

ముగ్గురివీ అత్యత్తమ ర్యాంకులే...
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌) పరీక్ష ద్వారా అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ (ఏసీ) శిక్షణకు ఎంపికయ్యారు ఈ ముగ్గురూ. గతేడాది జరిగిన ఈ పరీక్షకు ఐదు లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనేక వడపోతల తర్వాత 62 మంది నిసా వరకు వచ్చారు. ఈ పరీక్ష ఆలిండియా ర్యాంకుల్లో భూమికకు తొమ్మిది, కీర్తికి 26, స్నేహకు 52వ ర్యాంక్‌ లు వచ్చాయి. 

– శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో, హైదరాబాద్‌

చదవండి: మెదడు ఆరోగ్యానికి మేలుచేసే చేపలు! స్ట్రోక్‌ సమస్యకు కూడా..

మరిన్ని వార్తలు