డాక్టర్ నటన బాగుందా? మనిషి తత్వం బాగుందా?

10 Jun, 2023 14:36 IST|Sakshi

వైద్యులు చాలా బిజీగా ఉంటారు. వృత్తిలో దిగిన తర్వాత చాలా విషయాలు మరిచిపోతారు. అయితే అంత హడావిడిలోనూ వాళ్లలో మనిషి తత్వం బయటికొస్తుంది. అపరేషన్లు, ట్రీట్ మెంట్లు.. ఇవి సరే.. హఠాత్తుగా నేనున్నానంటూ వారిలో మనిషి బయటికొస్తాడు. కాసింత సేద తీరతాడు. ఆ తత్వం గురించే కొచ్చెర్లకోట జగదీశ్ సోషల్ మీడియాలో పంచుకున్న అనుభవం పాఠకుల కోసం.

పుట్టి పావుగంట కూడా కాలేదు. బుల్లిబుల్లి సపర్యలవీ చేసి, బరువదీ తూచిన పిమ్మట అమ్మమ్మ చీరనే బొంతలా చేసుకుని మెత్తగా పడుకుంది. చూడ్డానికి తామరాకులో చుట్టిన చామంతిపూల దొంతిలా తాజాగా నవనవలాడుతోంది. గుప్పెట నోట్లోకి దోపుకుంటూ దిక్కులు చూస్తోంది. పుట్టగానే ఆకలి మొదలవుతుంది మనిషికి. నాకూ వేస్తోంది ఆకలి.

కేసవ్వగానే వెళ్లి బాక్స్ బద్దలుగొట్టాలి. దీనిది మాత్రం పాలాకలి. ఓ గుక్కెడు పాలు కడుపులో పడగానే పొట్ట నిండిపోయి కంటిమీదకి కునుకొచ్చేస్తుంది. ‘బేబీని మదర్ దగ్గర పెట్టండర్రా! సర్జరీ అయిపోవచ్చింది కదా? రండి త్వరగా!’ అని మేడమ్ అరిచిన అరుపుతో దాన్ని లోపలికి తీసుకొచ్చారు. పుట్టిన వెంటనే తల్లి రొమ్ము అందించాలనేది ప్రస్తుత శాస్త్రం. దాన్ని యథాప్రకారం అమలుచెయ్యాల్సిందే.

సాధారణంగా ఈ టిక్కెట్లన్నీ బానే తాగేస్తాయి పాలు. కొందరు మాత్రం ఓ.. చిరాకు పడిపోతూ ఏడుస్తుంటారు. ‘తాగుతోందా?’ రాస్తున్నది ఆపి తలెత్తి అడిగాను. ‘ఆఁ, సుబ్బరంగా తాగుతున్నాద్సార్!’ అంది రామలక్ష్మి. దగ్గరకెళ్లి చూశాను. అప్పుడే సింగారాలు మొదలైపోయాయి దానికి. చింతపిక్క రంగు పిల్ల అది. ముదురు గులాబీరంగు ఊలు తొడుగులతో పంచదార చిలకలా ఉంది చూడ్డానికి.

ఆవఁదం రాసిన నెత్తిమీద అంటుకుపోయినట్టున్న బుల్లి క్యాప్, చేతులకీ కాళ్లకీ ఊలు తొడుగులతో సావాఁలమ్మ పక్కలో లుకలుకలాడుతోంది చంటిగుంట. హాస్పిటల్ గేటవతల త్రిమూర్తులు కొట్లో కొన్న సరుకే అదంతా. అవ్వడానికి అగ్గిపెట్టంత కిళ్లీబడ్డీయేగానీ త్రిమూర్తులు దగ్గర ముల్లోకాల్లోనూ దొరకనంత స్టాకుంటుంది. పిల్లల సబ్బులు, వాసన నూనెలు, పురిటి పిల్లల కోసం చవకరకం ఊలు తొడుగులు ఒకటనేవిఁటి, సమస్తమూ వేలాడదీసి ఉంటాయి.

అదొక పెద్ద దందా! లోపల డెలివరీ అవ్వగానే అతగాడికి సమాచారం వచ్చేస్తుంది. వెంటనే ఇక్కడ ప్యాకేజీ రెడీ చేసి ఉంచుతాడు. సమయానికి చేతిలో డబ్బు లేదన్నవాళ్లకి అరువు బేరాలు కూడా ఇస్తాడు. కేవలం ఏసీ శబ్దం ఒక్కటే ఉండడాన దాని చప్పరింత బాగా వినబడుతోంది. కాసేపటికి తాగుడాపి లుకలుకలాడ్డం మొదలెట్టింది.

వెంటనే వాళ్లమ్మ పక్కలోంచి తీసేసి బయటకు పట్టుకుపోయారు. ఎవరు నేర్పేరమ్మ ఈ విద్యలు? కడుపులో ఉండగానే మొదలవుతాయి ఈ చప్పరింతలవీ. సుమారుగా నాలుగో నెలప్పుడు ప్రారంభమై ఏడాది వరకూ కొనసాగుతుంది. ‘తల్లడిల్లేవేళా తల్లిపాడే జోల.. పాలకన్నా తీపి పాపాయికీ...’ అన్నాడు వేటూరి.

నిజమేమిటో పాపాయిల్నే అడగాలి. పాల పిల్లకి ఫారెక్సు ప్రాసనదీ అయ్యాక అన్నాలు తినిపించడం మొదలెట్టేసరికి ఈ చీకుడు కాస్త మందగిస్తుంది. కొంతమంది రెండుమూడేళ్ల పిల్లలకి కూడా పాలిచ్చే తల్లులుంటారు. అదో ముచ్చట. ఎంత కత్తులూ కత్తెరలతో కడుపదీ కోసి బిడ్డను బయటికి తీసే శాస్త్రం చదువుకున్నా ఈ కుసుమ కోమలమైన పసిపిల్లల్ని చూడగానే నాలో వైద్యుడు కాస్తా వేషం తీసేసి ఆనందాతిరేకంలో మునిగిపోతాడు.
కొచ్చెర్లకోట జగదీశ్

మరిన్ని వార్తలు