టైమ్‌ మారింది!

28 Oct, 2020 09:13 IST|Sakshi
‘టైమ్‌’ మ్యాగజీన్‌ 

మీరు కనుక అపూర్వమైన వాటిని సేకరించి దాచుకునే ఒక చక్కటి అభిరుచిని కలిగి ఉన్నవారైతే, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న నవంబర్‌ రెండు TIME వార పత్రికను 250 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయవచ్చు. టైమ్‌ 97 ఏళ్ల చరిత్రలోనే తొలిసారి TIME అనే పేరుతో రాని టైమ్‌ సంచిక అది! బహుశా ఇలాంటిది  ప్రపంచ పత్రికా చరిత్రలోనే ఒక విశేషం. TIMEలోని IM అనే మధ్య లెటర్స్‌ ని తొలగించి, ఈ చివర్న ఉన్న Tని ఆ చివర్న ఉన్న E పక్కకు జరిపి, ఎడమవైపున ఖాళీ అయిన రెండు స్థానాలలో VO అనే లెటర్స్‌ పెట్టి VOTE అనే పేరుతో తాజా సంచికను మార్కెట్‌ లోకి విడుదల చేశారు! టైమ్‌ తన ఐడెంటిటీని కోల్పోవడమే ఇది. తను కోల్పోవడం ద్వారా యూఎస్‌కి ఈ అధ్యక్ష ఎన్నికలు ఎంత కీలకమైనవో చెప్పాలని టైమ్‌ భావించినట్లుంది. ముఖచిత్రంపై ఒక మహిళ.. కర్చీఫ్‌ను మాస్కులా ధరించి ఉంటుంది. కర్చీఫ్‌ మీది డిజైన్లుగా బ్యాలెట్‌ బాక్సు, బాక్సును కాపాడుతున్నట్లుగా రెండు అరిచేతులు, విడిగా ఇనుప సంకెళ్లు, ఇంకా ఏవో అంతరార్థ చిత్రాలు ఉంటాయి. ప్రముఖ వీధి  చిత్రకారుడు ఫ్రాంక్‌ షెఫర్డ్‌ ‘టైమ్‌’ పూర్వపు సంచికల ముఖచిత్రాలు రెండింటిని మిక్స్‌ చేసి ఈ కవర్‌ పేజ్‌ని డిజైన్‌ చేశాడని టైమ్‌ ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌ ఎడ్వర్డ్‌ ఫెల్సెంతాల్‌ (54) లోపల రాసిన ముందుమాటను బట్టి తెలుస్తోంది.

ఆయన ఇంకొక మాట కూడా రాశారు. ‘రానున్న రోజుల్లో కొన్ని ఘటనలు ప్రపంచాన్ని మలచబోతున్నాయి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కంటే కూడా..’ అని వ్యాఖ్యానించారు! ఓటు వేసి ఆ  కొన్ని ఘటనల ప్రభావాన్ని అమెరికాలోని సకల పౌరుల సార్వభౌమాధికారతకు అనుకూలంగా మార్చుకోవాలని ఓటర్లకు చెప్పడం ఆయన ఉద్దేశంలా కనిపిస్తోంది. అర్థం కాలేదా? ట్రంప్‌ ఓడిపోతే ‘య్యస్‌’ అనే పెద్ద అరుపుతో బల్లను గుద్దిన చప్పుడు మొదట వినిపించేది న్యూయార్క్‌ లోని ‘టైమ్‌’ కార్యాలయ భవనం నుంచే! ఎడిటర్లు ప్రభుత్వాన్ని పడగొట్టగలరు. నిర్మించగలరు. ట్రంప్‌ ఓడినా, గెలిచినా టైమ్‌ పత్రిక తాజా సంచిక VOTE మాత్రం ఎప్పటికీ అపూర్వంగానే నిలిచిపోతుంది.

మరిన్ని వార్తలు