డేటింగ్‌ యాప్‌లో.. బ్లడ్‌ డోనార్స్‌!

16 May, 2021 06:07 IST|Sakshi

కరోనాకు ముందు డేటింగ్‌ యాప్‌లకు మంచి డిమాండ్‌ ఉండేది. టిండర్‌ లాంటి డేటింగ్‌ యాప్‌ యూజర్లంతా తమ జీవిత భాగస్వామి కోసం తెగ స్వైప్‌ చేశారు. కరోనా దెబ్బకు డేటింగ్‌ యాప్‌లు చప్పబడ్డాయి. కానీ ఇప్పటి విపత్కర పరిస్థితుల్లో టిండర్‌ మరోసారి యాక్టివేట్‌ అయ్యింది. అయితే ఈసారి లైఫ్‌ పార్టనర్‌ కోసం కాదు. తమ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారికోసం. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నారు. డేటింగ్‌ యాప్‌ ద్వారా ..రక్తదాతలు, పేషంట్లకు మధ్య వారధిగా నిలుస్తూ ఇద్దరి మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తున్నారు చెన్నైకి చెందిన వైద్యవిద్యార్థి రియా గుప్తా డేటింగ్‌ యాప్‌ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న ఎంతోమందికి రక్తం అందిస్తున్నారు.

  ఇటీవల రెండునెలల వయసున్న భవన్‌ కు అత్యవసరంగా గుండె ఆపరేషన్‌ చేయాల్సి వచ్చినప్పుడు రక్తం అవసరమైంది. కరోనా సమయంలోఎక్కడా రక్తదానం చేసేవారు దొరకలేదు. ఈ విషయం అర్ధరాత్రి రెండు గంటల ప్రాతంలో రియాకు తెలియడంతో..  తనకు తెలిసిన వాళ్లు, స్నేహితులకు ఫోన్లు చేయడం, సోషల్‌ మీడియా, వాట్సాప్‌లలో బ్లడ్‌ డోనార్స్‌ కావాలని  పోస్టులు పెట్టింది. ఎట్టకేలకు ఆమె పోస్టులకు టిండర్‌ అకౌంట్‌లో ఒక దాత అర్ధరాత్రి మూడు గంటలకు స్పందించారు. దీంతో మరుసటిరోజు ఉదయం ఎనిమిది గంటలకు భవన్‌కు  శస్త్రచికిత్స నిర్వహించారు. ఇలా అవసరంలో ఉన్న వారెందరికో రియా బ్లడ్‌డోనార్స్‌ను ఏర్పాటు చేస్తోంది.

ప్లాస్మాడోనర్‌ ప్రేరణతో..
‘‘మనదేశంలో కరోనా రెండోసారి విజృంభిస్తోన్న ఈ సమయంలో ‘‘ఫలానా గ్రూపు రక్తం కావాలి! సాయం చేయండి ప్లీజ్‌!’’ అని సోషల్‌ మీడియాలో కోకొల్లలుగా మెసేజులు వస్తున్నాయి. అలా ఓ నెలరోజులు పాటు నేను నా ఫ్రెండ్స్‌ వాళ్ల రిక్వెస్ట్‌లు చూసేవాళ్లం. కరోనా సమయంలో సాయం చేయడానికి ముందుకొచ్చేవారు తక్కువే. వ్యాక్సిన్‌ వేసుకున్న వారు 28 రోజులు గడవందే రక్తదానం చేయకూడదు. దీంతో రక్తదాతలు దొరకడం చాలా కష్టమైంది. ఇలా అనుకుంటున్న సమయంలో ఓరోజు.. ‘‘టిండర్‌ అకౌంట్‌ ద్వారా ప్లాస్మా డోనర్‌ దొరికారు’’ అని ఒకతను చెప్పడం మేము విన్నాం. అప్పుడు అతనిలాగే బ్లడ్‌ డోనర్స్‌ కోసం టిండర్‌ డేటింగ్‌ యాప్‌ను వాడాలనుకున్నాం. ఈ క్రమంలోనే నా స్నేహితులతో కలసి ‘‘బ్లడ్‌డోనర్స్‌ కావాలి’’ అని టిండర్‌లో పోస్టులు పెట్టాము.

దానికి మంచి స్పందన లభించడంతో..స్లాక్, టిండర్, వాట్సాప్‌ గ్రూపులను ఎగ్‌మోర్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ బ్లడ్‌ బ్యాంక్, మెటర్నిటి ఆసుపత్రి, అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ మొదలైన వాటిని సమన్వయపరిచాం.
 ఈ సంస్థల నుంచి ‘‘బ్లడ్‌ కావాలని రిక్వెస్ట్‌ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్‌ను టిండర్‌ గ్రూపులో పోస్టు చేస్తాం!  రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వారికి పేషంట్లు లేదా ఆసుపత్రి సిబ్బందిని నేరుగా కలుసుకునే Ðð సులుబాటు కల్పిస్తాం’’ అని రియా చెప్పింది. ఇప్పటిదాక వందమందికిపైగా డోనర్స్‌తో రక్తదానం చేయించాము. నా ఇన్‌స్టాగ్రామ్‌ పేజి బ్లడ్‌ డోనార్‌ కనెక్ట్‌కు రక్తం కావాలని ఏదైనా మెస్సేజ్‌ వచ్చిందంటే అరగంట నుంచి గంటలోపు రక్త దాతను వెదికి రిక్వెస్ట్‌ పెట్టిన వారికి చేరుస్తాము. త్వరలో మా సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాము’’ అని రియా వివరించింది. రియా చేస్తున్న సాయం గురించి తెలుసుకున్న రెడ్‌ క్రాస్‌ ఇండియా, చెన్నై ట్రైకలర్‌ వంటి ఎన్జీవోలు సైతం రక్తం కోసం రియాను సంప్రదించడం విశేషం.

మరిన్ని వార్తలు