వంటింట్లో వేడి వేడి పాత్రలు చేతికి పొరబాటున తగలడం వల్ల కాలిన చోట బొబ్బలు వచ్చి మంట అనిపిస్తుంది. ఈ సమస్య త్వరగా తగ్గడానికి ఏం చేయాలంటే...
బ్లాక్ టీ: ఈ బ్యాగులను డీప్ ఫ్రిజ్లో కాసేపు ఉంచాలి. ఈ బ్యాగులను కాలిన గాయాల మీద ఉంచాలి. బ్లాక్టీలో ఉండే టానిక్ యాసిడ్ చర్మానికి సాంత్వన అందిస్తుంది. నొప్పి, మంటను తగ్గిస్తుంది.
తేనె: ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికం. తేనెను రాత్రిపూట పడుకునే ముందు కాలిన గాయం మీద రాయాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
పాలు: కాలినచోట పాలు రాయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా గాయాలూ తగ్గుతాయి. అలానే బాగా మంటగా అనిపించినప్పుడు ఫ్రిజ్లో పెట్టిన పాలలో దూదిని ముంచి గాయాల మీద పరచాలి. ఇలా చేయడం వల్ల చాలా వేగంగా సాంత్వన అందుతుంది.
మెత్తగా నూరిన పుదీనా ఆకుల గుజ్జుని కాలిన చోట పూతలా రాయాలి. తరవాత చల్లని నీళ్లను చల్లి.. పుదీనా పూతను తొలగించాలి. ఇలా చేస్తే మంట త్వరగా తగ్గుతుంది.
కాలిన చర్మం తెల్లగా అయితే...
నేరేడు చెట్ల ఆకులు తీసుకొని ముక్కలు చేసి బాణలిలో వేసి స్టవ్ మీద పెట్టి నల్లగా బూడిదలాగా అయిన తరువాత జల్లించాలి. దీనిలో నల్లనువ్వుల నూనె వేసి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో భద్రపరచాలి. ప్రతిరోజు రెండు పూటలా గాయాల మీద లోపలికి ఇంకి పోయేటట్లు పూయాలి. క్రమేపీ తెల్ల మచ్చలు నల్లగా చర్మపురంగులో కలిసిపోతాయి.