Health Tips: వాతం ఎక్కువైందా? నిద్ర పట్టడం లేదా? అయితే..

18 Dec, 2021 12:24 IST|Sakshi

మీకు తెలుసా?

Health Tips: రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. అలాగే మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసే వరకు చాలా సమయం ఉంటుంది కనుక జీర్ణవ్యవస్థకు మరమ్మత్తులు చేసుకునేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. భోజనానికి, నిద్రకు 3 గంటల వ్యవధి ఉంటే నిద్ర చక్కగా వస్తుంది. లేదంటే నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక రాత్రి చక్కగా నిద్ర పట్టాలంటే త్వరగా భోజనం చేసేయాలి.

వాతం ఎక్కువైందా?
ఒంట్లో వాతం ఎక్కువైనప్పుడు కీళ్ళ నొప్పి, ఎముకల్లో నుండి శబ్దాలు రావడం జరుగుతాయి. ఇక మోకాళ్ళలో జిగురు అరిగిపోవడం వలన ఎముకలు రాపిడికి గురయ్యి ఎక్కువ నొప్పిని కలుగజేస్తాయి. వీటన్నింటికి చెక్‌ పెట్టడానికి ఒక చిట్కా ఉంది.. దీనిని రెగ్యులర్‌గా 15 రోజులు తీసుకుంటే.. కీళ్ల నొప్పులు, వాతం నొప్పులు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. ఈ పొడి తయారీ గురించి తెలుసుకుందాం..

►50 గ్రాములు సొంఠి, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాములు వాము తీసుకుని.. వీటన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.
►రోజూ ఒక గ్లాస్‌ గోరు వెచ్చటి నీరు తీసుకుని అందులో ఈ పొడిని ఒక స్పూన్‌ వేసుకోవాలి. 
►అందులో బెల్లం పొడి.. లేదా తేనే ను వేసుకుని తాగాలి. షుగర్‌ వ్యాధి ఉన్నవారు బెల్లం కలుపుకోకుండా తీసుకుంటే సరి. 
►ఇలా ఈ టీ తాగడం వలన 15 రోజుల్లో వాతం తగ్గుతుంది. జాయింట్లలో జిగురు వచ్చేలా చేస్తుంది. 

చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే..

మరిన్ని వార్తలు