అశ్వవాహనంపై కల్కి అవతారంలో కొలువుదీరిన శ్రీవారు! నేటితో ముగియనున్న ఉత్సవాలు

23 Oct, 2023 10:25 IST|Sakshi

తనువును పులకరింపజేసే మలయమారుతాలు.. మనసుని పరవశింపజేసే గోవిందనామాలు.. ఆధ్యాత్మికానుభూతిని ఇనుమడింపజేసే జీయ్యంగార్ల గోష్టిగానాలు.. శ్రవణానందకరంగా మంగళవాయిద్యాలు.. కనులపండువగా కళాబృందాల నృత్యాభినయాలు.. ఠీవిగా ముందుకేగుతున్న గజరాజులు.. అడుగడుగునా కర్పూరహారతుల నడుమ ఉభయదేవేరీ సమేతంగా మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు. స్వర్ణరథంపై దివ్యతేజోవిరాజితంగా దేవదేవుడు విహరిస్తూ భక్తులకు సకల శుభాలను అనుగ్రహించారు. కలి దోషాలను నివారించే కల్కి అవతారంలో అశ్వవాహనం అధిరోహించి సమస్త జీవకోటిని కటాక్షించారు.  

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఎనిమిదోరోజు ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఊరేగారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ మాడవీధుల్లో విహరించారు. ఈ క్రమంలోనే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కనులపండువగా అశ్వవాహన సేవ నిర్వహించారు. శ్రీవారు కల్కి అలంకారంలో అశ్వంపై కొలువుదీరి భక్తజనులను అనుగ్రహించారు. వాహనసేవల్లో టీటీడీ బోర్డు చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు.   

నేటితో ముగియనున్న ఉత్సవాలు 
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు  సోమవారం ఉదయం స్నపన తిరుమంజనం, చక్రసాన్నం, రాత్రి ధ్వజారోహణంతో పరిపూర్ణంకానున్నాయి. చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు వరాహస్వామివారి ఆలయం వద్ద పుష్కరిణిలో ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం జరిపించనున్నారు. అనంతరం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు సర్వం సిద్ధం చేశారు.  

(చదవండి: మూడు వాహనాల్లో మురిపించిన ముగ్ద మనోహరుడు!!)

మరిన్ని వార్తలు