పొట్టి బట్టలు వేసుకోవద్దన్నారు.. ఇప్పుడు ఆనందబాష్పాలు రాలుస్తున్నారు

5 Aug, 2021 00:45 IST|Sakshi

స్ఫూర్తి/ నిషా వర్శి

‘ఆటలాడితే ఏమొస్తుంది’ అన్నారు తల్లిదండ్రులు. ‘నేను ఆడతాను’ అంది నిషా. ‘పొట్టి బట్టలు వేసుకోకూడదు’ అన్నారు మత పెద్దలు. ‘నేను లెగ్గింగ్స్‌ వేసుకుని ఆడతాను’ అంది నిషా. ‘మేము బూట్లు బ్యాటు ఏమీ కొనివ్వ లేము’ అన్నారు అయినవాళ్లు. ‘నేనే ఎలాగో తిప్పలు పడతాను’ అంది నిషా. హర్యానాలో సోనిపట్‌లో 25 చదరపు మీటర్ల ఇంట్లో నివాసం ఉండే నిషా ఇవాళ మహిళా హాకీ టీమ్‌ లో ఇంత పెద్ద దేశానికి పతకం కోసం పోరాడుతోంది.. ‘మాకు మూడో కూతురుగా నిషా పుట్టింది. మళ్లీ ఆడపిల్లా అని బంధువులు హేళన చేశారు. ఇవాళ బ్యాట్‌తో సమాధానం చెప్పింది’ అని ఆనందబాష్పాలు రాలుస్తున్నారు తల్లిదండ్రులు.

ఒక సన్నివేశం ఊహించండి. తొమ్మిదేళ్ల వయసు నుంచి హాకీ ఆడుతోంది ఆ అమ్మాయి. గుర్తింపు వచ్చి జాతీయ స్థాయిలో ఆడే రోజులు వచ్చాయి. ఇక దేశానికి పేరు తెలియనుంది. ఏమో... రేపు ప్రపంచానికి తెలియవచ్చేమో. కాని ఆ సమయంలోనే తండ్రికి పక్షవాతం వస్తుంది. ముగ్గురు కూతుళ్లున్న ఆ ఇంట్లో ఆ తండ్రి జీవనాధారం కోల్పోతే తినడానికి తిండే ఉండదు. ఇప్పుడు తండ్రి స్థానంలో బాధ్యత తీసుకోవాలా బ్యాట్‌ పట్టుకుని గ్రౌండ్‌లోకి దిగాలా? దిగినా కుదురుగా ఆడగలదా తను? అలాంటి పరిస్థితిలో ఆడగలరా ఎవరైనా అని ఆలోచించండి. ఆడగలను అని నిరూపించిన నిషా వర్శీని చూడండి. ఆమె పోరాటం తెలుస్తుంది. ఆమె నుంచి ఎలా స్ఫూర్తి పొందాలో తెలుస్తుంది.

టైలర్‌ కూతురు
హర్యానాలోని సోనిపట్‌లో పేదలవాడలో పుట్టింది నిషా వర్శి. తండ్రి షొహ్రబ్‌ వర్శి టైలర్‌. ముగ్గురు కూతుళ్లు. మూడో కూతురుగా నిషా జన్మించింది. టైలర్‌గా సంపాదించి ఆ ముగ్గురు కూతుళ్లను సాకి వారికి పెళ్లి చేయడమే పెద్దపని అనుకున్నాడు షొహ్రబ్‌. ‘పాపం... ముగ్గురు కూతుళ్లు’ అని బంధువులు జాలిపడేవారు అతణ్ణి చూసి. మూడోసారి కూతురు పుడితే ‘మూడోసారి కూడానా. ఖర్మ’ అని అన్నవాళ్లు కూడా ఉన్నారు. షొహ్రబ్‌ ఏమీ మాట్లాడలేదు. ముగ్గురిని ప్రాణంగా చూసుకున్నాడు. నిషా వర్శి హాకీ ఆడతానంటే ‘మన ఇళ్లల్లో ఆడపిల్లలు ఆటలు ఆడలేదు ఎప్పుడూ’ అన్నాడు. కాని తల్లి మెహరూన్‌ కూతురి పట్టుదల గమనించింది. ఆడనిద్దాం అని భర్తకు సర్దిచెప్పింది.

నిషా వర్శి తల్లిదండ్రులు

ఎన్నో అడ్డంకులు
క్రీడల్లో రాణించడం, అందుకు తగిన పౌష్టికాహారం తినడం, ట్రైనింగ్‌ తీసుకోవడం, అవసరమైన కిట్లు కొనుక్కోవడం ఇవన్నీ పేదవారి నుదుటిరాతలో ఉండవు. కలలు ఉండొచ్చు కాని వాటిని నెరవేర్చుకోవడం ఉండదు. కాని నిషా పట్టుపట్టింది. ప్రస్తుతం భారత హాకీ టీమ్‌లో ఆడుతున్న నేహా గోయల్‌ కూడా ఆమె లాంటి నేపథ్యంతో ఆమె వాడలోనే ఉంటూ ఆమెకు స్నేహితురాలై హాకీ ఆడదామని ఉత్సాహపరిచింది. ఇద్దరూ మంచి దోస్తులయ్యారు. కాని తెల్లవారి నాలుగున్నరకు గ్రౌండ్‌లో ఉండాలంటే తల్లిదండ్రులు నాలుగ్గంటలకు లేవాల్సి వచ్చేది.

తల్లి ఏదో వొండి ఇస్తే తండ్రి ఆమెను సైకిల్‌ మీద దించి వచ్చేవాడు. ఒక్కోసారి తల్లి వెళ్లేది. వారూ వీరు చూసి ‘ఎందుకు ఈ అవస్థ పడతారు. దీని వల్ల అర్దనానా కాణీనా’ అని సానుభూతి చూపించేవారు. మరొకటి ఏమంటే– ఇస్లాంలో మోకాళ్ల పైభాగం చూపించకూడదని భావిస్తారు. హాకీ స్కర్ట్‌ మోకాళ్ల పైన ఉంటుంది. మత పెద్దల నుంచి అభ్యంతరం రాకూడదని కోచ్‌కు చెప్పి లెగ్గింగ్స్‌ తో ఆడటానికి ఒప్పించింది నిషా. ఒలింపిక్స్‌లో కూడా లెగ్గింగ్స్‌తోనే ఆడింది.


కొనసాగిన అపనమ్మకం

2016లో తండ్రి పక్షవాతానికి గురయ్యాక దీక్ష వీడక ఆడి జాతీయ, అంతర్జాతీయ మేచెస్‌ లో గుర్తింపు పొందింది నిషా వర్శీ. రైల్వే బోర్డ్‌ టీమ్‌లో ఆడటం వల్ల ఆమెకు రైల్వేలో 2018లో ఉద్యోగం దొరికింది. పరిమిత నేపథ్యం ఉన్న నిషా కుటుంబానికి ఇదే పెద్ద అచీవ్‌మెంట్‌. ‘చాలమ్మా... ఇక హాకీ మానెయ్‌. పెళ్లి చేసుకో’ అని నిషాను ఒత్తిడి పెట్టసాగారు. అప్పటికి ఆమెకు 24 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా ఆలస్యమైతే పెళ్లికి చిక్కులు వస్తాయేమోనని వారి ఆందోళన.

కాని నిషాకు ఎలాగైనా ఒలింపిక్స్‌లో ఆడాలని పట్టుదల. ‘ఒలింపిక్స్‌లో ఆడేంత వరకూ నన్ను వదిలేయండమ్మా’ అని తల్లిదండ్రులకు చెప్పింది. కుటుంబం మంచి చెడ్డలు చూసుకుంటానని మేనమామ హామీ ఇచ్చాక పూర్తిగా ఆట మీదే ధ్యాస పెట్టింది. ఆమె గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఇంటికి వెళ్లడమే లేదు. హాకీ సాధనలో, ఒలింపిక్స్‌ కోసం ఏర్పాటు చేసిన ట్రయినింగ్‌ క్యాంప్‌లో ఉండిపోయింది. చివరకు ఆస్ట్రేలియా మీద గెలిచాక సగర్వంగా ఇంటికి ఫోన్‌ చేసింది.


అవును.. ఆడపిల్లే గొప్ప

ఒకప్పుడు ఆడపిల్ల అని తక్కువ చూసి బంధువులు, అయినవారే ఇప్పుడు నిషాలోని గొప్పతనం అంగీకరిస్తున్నారు. ప్రతిభకు, ఆటకు, కుటుంబానికి, జీవితానికి కూడా ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా సమానమే అని భావన తన సమూహంలో చాలా బలంగా ఇప్పుడు నిషా తీసుకెళ్లగలిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా గోల్‌ కొట్టడమే అసలైన ప్రతిభ. తాను అలాంటి గోల్‌ కొట్టి ఇవాళ హర్షధ్వానాలు అందుకుంటోంది నిషా.    

మరిన్ని వార్తలు