తొలివైద్యుల చరిత్ర

11 Jan, 2021 17:51 IST|Sakshi

అనేక కులవృత్తులు ఉన్నాయి. వాటన్నింటికీ వాటి వాటి చరిత్రలూ ఉన్నాయి. అణగారిన కొన్ని కులాల వృత్తుల చరిత్రలు చాలావరకు మరుగునపడ్డాయి. చరిత్ర మూలాల్లోకి వెళ్లి వాటిని వెలికితీసే ప్రయత్నం అంత తేలికేమీ కాదు. ‘తొలి వైద్యులు’ పుస్తకం ద్వారా అలాంటి ప్రయత్నమే చేశారు రచయిత అన్నవరపు బ్రహ్మయ్య. అంతేకాదు, తన ప్రయత్నంలో కృతకృత్యులయ్యారు కూడా. క్షురక వృత్తికి సంబంధించిన ప్రాచీన మూలలను పరిశోధించి, చక్కని పుస్తకాన్ని అందించిన రచయితకు అభినందనలు.

భారత భూభాగాన్ని ఏలిన తొలి చక్రవర్తి మహాపద్మనందుడు మంగలి కులస్తుడు. భారతదేశంలోనే కాదు, మిగిలిన ప్రపంచ దేశాల్లోనూ ఎక్కడైనా తొలినాటి వైద్యులు క్షురక వృత్తి చేసేవారే. శరీర శుభ్రతకు దోహదపడేలా వెంట్రుకలు కత్తిరించడమే కాదు, వ్రణాలు, గాయాల వల్ల పాడైపోయిన అవయవాలను తొలగించే తొలి శస్త్రచికిత్సకులు క్షురకులే! మంగళవాద్యాలను వాయించే క్షురకులకు సంగీతంతో గల చిరకాల అనుబంధాన్ని కూడా ఈ పుస్తకంలో చారిత్రక ఆధారాలతో సహా ప్రస్తావించడం విశేషం. క్షురక సామాజిక వర్గం నుంచి ఎదిగి వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారి సంక్షిప్త పరిచయ వ్యాసాలు ఈ పుస్తకానికి నిండుదనాన్ని ఇచ్చాయి.

ఒకనాడు దేశాన్ని ఏలిన కులానికి చెందిన వారు, ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచిన కులానికి చెందినవారు కాలక్రమంలో వెనుకబాటుకు లోనైన క్రమాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవాల్సిందే! కుల వివక్ష వేళ్లూనుకున్న మన దేశంలో అణగారిన కులాలకు సంబంధించిన చారిత్రక విశేషాలను వెలుగులోకి తెచ్చే ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- దాసు

తొలివైద్యులు
రచయిత: అన్నవరపు బ్రహ్మయ్య
ప్రచురణ: తెలుగు తోరణం ప్రచురణ, విజయవాడ
ధర: రూ.180
ప్రతులకు: రచయిత, ఇంటినం: 15–103/3డి,
గొల్లపూడి డైమండ్‌ అపార్ట్‌మెంట్, గొల్లపూడి, విజయవాడ
మొబైల్‌: 94403 20886, 89198 23256

మరిన్ని వార్తలు