Punarnava Leaves Benefits: గలిజేరు ఆకును పప్పుతో కలిపి వండుకుని తింటున్నారా.. అయితే.. అందులోని ఆ గుణం వల్ల..

29 Jan, 2022 13:59 IST|Sakshi

కణ జాలానికి జీవం పోసే పునర్నవ

ఈ ఆకు తింటే .. రేచీకటికి చెక్‌.. బహిష్టు సమస్యలు దరిచేరవు.. ఇంకా..

Health Benefits Of Galijeru Aaku: పల్లెల్లో దానిని అటుక మామిడి అనీ, గలిజేరనీ, ఎర్రగలిజేరనీ అంటారు. ఆయుర్వేదంలో దీనిపేరు పునర్నవ. పునర్‌ అంటే తిరిగి, నవ అంటే కొత్తగా అని అర్థం. ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవింప చేయగలదు కాబట్టే ‘పునర్నవ’ అయ్యింది.

తెల్లపూలు ఉంటే తెల్ల గలిజేరనీ, ఎర్రపూలు ఉంటే ఎర్ర గలిజేరనీ పిలుస్తారు. నేలమీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా, అర్ధ రూపాయి పరిమాణంలో ఉంటాయి. ఔషధ గుణాలు ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు. వీటిలో ఏది దొరికితే దానిని కూరగా.. పచ్చడిగా, పులుసుకూరగా వండుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

గలిజేరు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
పునర్నవలో ఆకు, కాండం, వేరు... ఇలా ప్రతీదీ పనికి వస్తుంది. ఈ ఆకులను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫ సమస్య, లివర్‌ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, యూరియా లెవల్స్‌ సరిచేయటానికి ఉపయోగపడుతుంది.
వాతం, శ్వాస సంబంధ వ్యాధులు, రక్త శుద్ధి, కీళ్ళ నొప్పులు, బహిష్టు సమస్యలు దరిచేరవు. జ్వరాలు రావు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వ్యాధులకు ఇది మందుగా పనిచేస్తుంది.


కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడు సార్లు దీనిని పప్పుతో వండుకుని తింటే చాలా త్వరగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
శరీరంలో అధికంగా నీరు పట్టినప్పుడు ఆ నీటిని తగ్గించే గుణం దీనికి ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని విటమిన్‌ సి, డి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడతాయి.
క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం ఇది.

మనకి సామాన్యంగా అందుబాటులో ఉండేది తెల్ల గలిజేరే. ఈ ఆకులను పప్పులో కలిపి వండుకుంటారు, ఉప్పు మిరప కాయలు వేసి రుబ్బిన మినప్పిండిలో గుమ్మడి బదులు సమూలంగా తరిగిన గలిజేరు మొక్కను కలిపి వడియాలు గా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు.
ఆకులతో కషాయం చేసి తాగుతారు. ఈ కషాయంలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే నెలరోజుల్లో శరీరం ఉబ్బు తగ్గుతుంది.
ఈ ఆకు వండుకుని తింటూ ఉంటే రక్తం శుభ్రపడి వృద్ధి చెందుతుంది.
గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానంగా నువ్వులనూనెని కలిపి నూనె మిగిలేదాకా సన్నటి సెగన కాచి,  నొప్పులున్న చోట మర్దనా చేస్తే త్వరగా తగ్గుతాయి. నడకరాని పిల్లలకు ఇదే తైలంతో మర్దన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని మూలికా వైద్యులు చెబుతారు.
గలిజేరు ఆకు రసం తీసి దానిలో సగం బరువు పటికబెల్లం పొడి కలిపి తీగ పాకం పట్టి చల్లార్చి నిల్వ చేసుకోవాలి.
రోజు ఒక చెంచా పాకం గ్లాస్‌ నీళ్ళల్లో కలిపి తాగుతుంటే గుండె దడ, బలహీనత తగ్గుతాయి. అయితే పాలిచ్చే తల్లులు, గర్భిణులు ఈ ఆకును తినకపోవడమే మంచిది.  

చదవండి: Anjeer Health Benefits: అంజీర తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా?
Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్‌ బీ6 వల్ల..

మరిన్ని వార్తలు