Chittoor Famous Temples: సత్యభామసమేత వేణుగోపాల స్వామి ఆలయం ప్రత్యేకత

30 Oct, 2021 11:26 IST|Sakshi
కార్వేటి నగరం ఆలయ ముఖద్వారం

 

లోకంలో దీపాలకాంతులు వెలగడానికి దుష్టసంహారం రూపంలో చీకట్లు పారదోలే గొప్ప ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో ప్రధాన భూమిక సత్యభామదే. అందుకే... దీపావళి పండుగలో ప్రధాన పాత్ర సత్యభామదే. ఈ కథనంలో కృష్ణుది సపోర్టింగ్‌ పాత్ర మాత్రమే. నరకాసుర వధ జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపకాంతులతో ఆనందంగా నిర్వహించుకునే ఈ వేడుక అందరికీ తెలిసిందే. అయితే అంత గొప్ప మహిళకు ఆలయం ఎక్కడైనా ఉందా?... ఉంది. 

అనంతపురం జిల్లా మడకశిర సమీపాన కృష్ణుని విగ్రహంతోపాటు సత్యభామ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకల కంటే మిన్నగా దీపావళి వేడుకలు జరుగుతాయి. అలాగే చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కృష్ణుడితోపాటు సత్యభామ పూజలందుకుంటోంది. ధీర వనిత సత్యభామను పూజలందుకునే పౌరాణిక పాత్రగా గౌరవించింది మన సంస్కృతి. ఈ పండుగలో సత్యభామది నాయిక పాత్ర అయితే ప్రతినాయక పాత్ర నరకాసురుడిది. నరకాసురుడికి ఆలయం లేదు కానీ, అస్సాంలో నరకాసురుడు కట్టించిన ఆలయం ఉంది. అది గువాహటిలోని కామాఖ్య ఆలయం.

చిత్తూరు జిల్లా, కార్వేటి నగరంలో సత్యభామసమేత వేణుగోపాల స్వామి ఆలయానికి ఓ విశిష్టత ఉంది. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారితో పూజలందుకొంటున్న రుక్మిణి, సత్యభామ, వేణుగోపాలస్వామి మూర్తులను కార్వేటి నగరానికి తెప్పించి వైఖానసులచే ప్రతిష్టించినట్లు పురాణ కథనం. ఆకాశరాజు వంశానికి చెందిన నారాయణరాజుకు సంతానం లేకపోవడంతో తపస్సు చేసినట్లు, అదే వంశానికి చెందిన  వెంకట పెరుమాళ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం. ఈ ఆలయంలో శిల్పనైపుణ్యం అద్బుతంగా ఉంటుంది. ఆలయంలో మకరతోరణం, గోమాత సహిత రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి విగ్రహాలను ఏకశిలతో రూపొందించడం విశేషం. గాలి గోపురానికి ఎదురుగా ఉన్న 105 అడుగుల ధ్వజస్తంభం ఏకశిల నిర్మితం.  


                                                    రాణి మహల్‌

14 ఎకరాల పుష్కరిణి
ఈ ప్రాంతాన్ని 19వ శతాబ్దంలో తీవ్రమైన కరువుపీడించింది. అçప్పుడు ప్రజలను కాపాడేందుకు కార్వేటినగరం సంస్థానధీశుడు వెంకట పెరుమాళ్‌ రాజు 14 ఎకరాల విస్తీర్ణంలో స్కంధపుష్కరిణిని నిర్మించాడు. ఏ దిక్కు నుంచి చూసినా నీటి మట్టం సమాంతరంగా కనిపించడం దీని నిర్మాణ విశిష్టత. పుష్కరిణి మెట్ల మీద దేవతామూర్తులు, సర్పాలు, శృంగార శిల్పాలు నాటి శిల్పకళకు ప్రతిబింబిస్తున్నాయి. పుష్కరిణి కోసం పని చేసిన వారికి వెంకట పెరుమాళ్‌ రాజు స్వయంగా దోసిళ్లతో నాణేలను ఇచ్చారని స్థానిక కథనం. ఇక్కడి చెరువుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ చెరువు నుంచి ఏడు బావులకు నీరు సరఫరా అవుతుంది. ఏడు బావుల నుంచి స్కంద పుష్కరిణికి చేరుతుంది. 


                                                     స్కంద పుష్కరిణి

చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..

కార్వేటి నగరంలో చూసి తీరాల్సిన మరో నిర్మాణం రాణి మహల్‌ (అద్దాల మహల్‌). ఈ మహల్‌ నిర్మాణంలో కోడిగుడ్డు సొన ఉపయోగించిన కారణంగా ఇప్పటికీ పటిష్టంగా ఉండడంతోపాటు నీటితో తుడిస్తే గోడలు అద్దంలా మెరుస్తుంటాయి. అందుకే దీనికి అద్దాల మహల్‌ అనే పేరు వచ్చింది. ఏపీ టూరిజం నిర్వహించే ప్యాకేజ్‌ టూర్‌లో తిరుమలతోపాటు చంద్రగిరి, నారాయణవనం, నాగులాపురం, కార్వేటి నగరం ఉంటాయి.


                         రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల ఆలయం


                                                ఏకశిల ధ్వజస్తంభం

చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్‌ ఐలాండ్‌.. లక్షల కోట్ల సంపద!

మరిన్ని వార్తలు