Toxic Positivity: ‘పాజిటివిటీ పిచ్చి’ పడితే అంతే సంగతులు! అతి సానుకూలతతో అనర్థాలే! మీలో ఈ లక్షణాలుంటే వెంటనే..

9 Dec, 2022 16:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

What Is Toxic Positivity: రాజుది తెనాలి. సివిల్స్, గ్రూప్స్‌ కోచింగ్‌ కోసం మూడేళ్ల కిందట హైదరాబాద్‌ వచ్చాడు. అశోక్‌నగర్‌లో ఫ్రెండ్స్‌తో పాటు రూమ్‌లో ఉండి చదువుకునేవాడు. మొదట్లో కోచింగ్, లైబ్రరీ, రూమ్, ప్రిపరేషన్‌లతో చాలా బిజీగా ఉండేవాడు. అక్కడే ఒక ఫ్రెండ్‌ రూమ్‌లో ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ బుక్‌ చదివాడు.

అప్పటి నుంచి అలాంటి పుస్తకం ఎక్కడ కనపడినా చదువుతుండేవాడు. ఒక సంస్థ ఉచితంగా వ్యక్తిత్వ వికాస శిక్షణ నిర్వహిస్తోందని తెలిసి హాజరయ్యాడు. అదే సంస్థ నిర్వహించే ట్రైనర్స్‌ ట్రైనింగ్‌కీ హాజరయ్యాడు. అక్కడే అతనికి ‘పాజిటివిటీ పిచ్చి’ పట్టింది. 

జీవితంలో అంతా పాజిటివిటీనే చూడాలని ట్రైనింగ్‌లో చెప్పిన మాటలు అతని మనసును పూర్తిగా ఆక్రమించాయి. అప్పటి నుంచీ పాజిటివిటీ, పాజిటివ్‌ థింకింగ్‌పై సోషల్‌ మీడియాలో రోజుకు పది పోస్టులు పెడుతుండేవాడు. వాటికి వచ్చే లైక్‌లు చూసుకుని, కామెంట్లు చదువుకుని సంబరపడిపోయేవాడు.

యువతలో పాజిటివిటీ నింపాలని స్కూళ్లు, కాలేజీల్లో ఉచితంగా క్లాసులు నిర్వహించేవాడు. ప్రతిక్లాసుకు సంబంధించిన వార్త, ఫొటో పేపర్లో వస్తుండటంతో చదువుకుని మురిసిపోయేవాడు. తానో సెలబ్రిటీ అయ్యానని కలల్లో విహరించేవాడు. 

కానీ వాస్తవం మరోలా ఉంది. రాజు తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. రాజు ఉద్యోగం సాధిస్తే తమ జీవితాలు మారతాయని వాళ్లు ఎదురుచూస్తున్నారు. కానీ రాజు పాజిటివిటీ పేరుతో పక్కదారి పట్టాడు. మూడేళ్లయినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇలాంటివాళ్లు మనకు అక్కడక్కడా తారసపడుతూనే ఉంటారు. 

టాక్సిక్‌ పాజిటివిటీ లక్షణాలు
పాజిటివిటీ లేదా పాజిటివ్‌గా ఆలోచించడం తప్పుకాదు. కానీ ఆ పాజిటివిటీ ఎక్కువైతే అదే ఒక సమస్యగా మారుతుంది. అన్ని పరిస్థితుల్లోనూ ఆశావాదంతో, సంతోషంగా ఉండాలనుకోవడం, నిజమైన భావోద్వేగాలను తిరస్కరించడం లేదా తగ్గించడాన్నే ‘టాక్సిక్‌ పాజిటివిటీ’ అంటారు.

ఈ టాక్సిక్‌ పాజిటివిటీలో చిక్కుకున్న వ్యక్తులు...
అన్నింటిలో సానుకూలతను మాత్రమే చూడాలంటారు
నిజమైన భావోద్వేగాలను గుర్తించేందుకు ఇష్టపడరు. వాటికి ముసుగువేస్తారు లేదా దాచేస్తారు.
జీవితంలో ఎదురయ్యే ప్రతీ విపత్తు వెనుక ఏదో మంచి ఉంటుందని వాదిస్తారు
భావోద్వేగాలను విస్మరించడం ద్వారా దానితో సర్దుకుపోయే ప్రయత్నం చేస్తారు

పాజిటివ్‌ కోట్స్, స్టేట్‌మెంట్లతో ఇతరుల బాధను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తారు
ప్రతికూల భావోద్వేగం వస్తే అపరాధ భావనకు లోనవుతారు
ప్రతికూల భావోద్వేగాలున్నవారిని బలహీనులుగా చూస్తారు, కించపరుస్తారు. 

అతి సానుకూలతతో అనర్థాలే
ప్రతికూల భావోద్వేగాలను నిర్లక్ష్యం చేసినా, అణచివేసినా అవి వదిలిపెట్టవు. సమయం చూసుకుని వెంటపడతాయి. అందుకేటాక్సిక్‌ పాజిటివిటీని పాటించే వ్యక్తులు మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి.

‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’, ‘డోంట్‌ వర్రీ, బీ హేపీ’, ‘పాజిటివ్‌ వైబ్స్‌ ఓన్లీ’ అనే స్టేట్‌మెంట్లు అన్ని సందర్భాల్లోనూ సరిపోవు. ప్రతీక్షణం ఇలా ఆలోచించడం వల్ల... 
ప్రతికూల భావోద్వేగాలను అణచివేయడం లేదా తిరస్కరించడం వల్ల మరింత మానసిక ఒత్తిడికి లోనవుతారు ∙అంతా మంచిగా ఉందని అనుక్షణం నటించడం చివరకు యాంగ్జయిటీ, డిప్రెషన్, శారీరక సమస్యలకు దారితీస్తుంది
అసలైన సమస్యను తిరస్కరించడం లేదా గుర్తించకపోవడం వల్ల కష్టాల్లో పడతారు, నష్టపోతారు
సమయం సందర్భం చూసుకోకుండా పాజిటివ్‌గా మాట్లాడటం వల్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి, ఒంటరిగా మిగిలిపోతారు
సహానుభూతి లేకుండా, సన్నిహితుల కష్టాలను అర్థం చేసుకోకుండా సలహాలిచ్చి దూరం చేసుకుంటారు. 

మరేం చెయ్యాలి?
జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశాన్నీ పాజిటివ్‌గా చూడటం ద్వారానో లేదా ప్రతికూల భావోద్వేగాలను అణచివేయడం ద్వారానో నిజమైన ఆనందం రాదు. ఇప్పుడు, ఈ క్షణంలో మనం ఏ భావోద్వేగాన్ని అనుభవిస్తున్నామో.. అది పాజిటివ్‌ అయినా, నెగెటివ్‌ అయినా.. దాన్ని అంగీకరించడమే నిజమైన ఆనందాన్నిస్తుంది.

టాక్సిక్‌ పాజిటివిటీ నుంచి తప్పించుకోవాలంటే..
ఆరోగ్యకరమైన వ్యక్తికి అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని గుర్తించండి
కోపం, బాధ, నిరాశ, నిస్పృహ.. ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలు జీవితంలో సాధారణమని గుర్తించాలి.
వాటిని కలిగి ఉండటం, వ్యక్తీకరించడం తప్పేమీ కాదని అంగీకరించాలి ∙
భావోద్వేగాలను సాధనాలుగా, సమాచారంగా గుర్తించాలి.

ఏదైనా ప్రతికూలత ఎదురైతే, అది ఇస్తున్న సమాచారాన్ని గుర్తించి ముందుకు సాగాలి ∙
ప్రతికూల భావోద్వేగాల గురించి సన్నిహితులతో మాట్లాడాలి.
టాక్సిక్‌ పాజిటివిటీతో సన్నిహితులను ఇబ్బంది పెట్టాయని గుర్తిస్తే వెంటనే ఆ తప్పును అంగీకరించాలి.

మరోసారి అలా స్పందించకుండా జాగ్రత్తగా ఉండాలి.
సన్నిహితులెవరైనా టాక్సిక్‌ పాజిటివిటీతో సలహాలిస్తుంటే నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకోవాలి.
నిగ్రహాన్ని కోల్పోయి అరిచినా.. కోపం చల్లారాక క్షమాపణ కోరాలి.
మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. ఇవేవీ పనిచేయనప్పుడు సైకాలజిస్ట్‌ లేదా సైకోథెరపిస్ట్‌ను కలవండి. 
-సైకాలజిస్ట్‌ విశేష్‌ 
చదవండి: అందమైన అమ్మాయి.. ఆమె ఓ డాక్టర్‌! టీనేజ్‌ అఫైర్‌ను గుర్తు చేసుకుని.. చివరికి

మరిన్ని వార్తలు